home
Shri Datta Swami

 11 Jul 2025

 

శివలహరి - 1

సిద్ధపురుషులు స్వామిని దత్తునిగా గుర్తించుట.

[శ్రీశివానంద మహరాజ్]

విశాఖపట్నములో షిర్డిసాయి పీఠాధిపతులు శ్రీశివానంద మహరాజ్ గొప్ప యతీశ్వరులు. సర్వసిద్ధులు కల యోగిశ్రేష్ఠులు. సంకల్ప మాత్రము చేత వస్తువులను సృష్టిస్తారు. వారి వయస్సు 500 సం॥ లని ప్రసిద్ధి. శ్రీ నరసింహ సరస్వతి శిష్యులైన ‘సిద్ధయోగి’ వీరేనని ప్రసిద్ధి. ఆ సిద్ధపురుషులు విజయవాడ ముత్యాలంపాడు సంస్థానానికి విచ్చేయటం తటస్థించినది. స్వామి భక్తులైన అజయ్, ఫణి, మన స్వామిని వీరి వద్దకు తీసుకునిపోయినారు. స్వామిని చూడగానే ఆ సిద్ధపురుషులు ఇలా వచించారు. "దత్తుడు దత్తుడు అంటారు. ఆ దత్తుడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఈతడే దత్తుడు" అంటూ అజయ్ గారి వైపుచూసి “ఈయనలో దత్తుడు అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాడని నీవు అనుకుంటున్నావు. అలా అనుకుంటే బురదలో నీ కాలు పడినట్లే. ఈయనలో దత్తుడు ఎప్పుడూ ఉంటాడని తెలుసుకో” అని అన్నారు. స్వామి భక్తులందరకు ఇది హెచ్చరిక కాక మరేమిటి? భీమశంకరంగారు, వారి భార్య వసుమతి, స్వామి తమ ఇంటిలోనున్నప్పుడు శివానంద మహరాజ్ గారిని తమ ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు శ్రీశివానందులు ఆమెతో ఇలా అన్నారు. “నీ ఇంటిలోనే దత్తుడు సాక్షాత్తుగా ఉంటే ఇంక నేనెందుకు?” అని అన్నారు. ఆహా! ఎంతటి వివరణ! ఆ రోజున వసుమతి గారింట్లో స్వామి ఉన్నారు.

ఒకనాడు శ్రీకోనేరు సత్యనారాయణగారు శ్రీశివానంద మహరాజ్ ను దర్శించడానికి వచ్చినారు. పక్కనే స్వామి కూడా ఉన్నారు. శ్రీసత్యనారాయణగారితో శ్రీశివానందులు “మీ పక్కనే దత్తుడు ఉన్నారు. మనం గ్రహించుట లేదు” అంటూ లేచి స్వామిని పెద్ద పూలమాలతో సత్కరించి స్వామికి “జయ జయ దత్త ధ్వానాలు” చేసినారు. ఆహా! ఎంతటి ప్రత్యక్ష నిదర్శనము. స్వామి సాక్షాత్తు దత్తుడే. శివానందులు విశాఖపట్నానికి బయలుదేరేముందు స్వామికి నమస్కరించి “నీ కరుణ నాపై నుంచుము” అని ప్రార్థించినారు.

అయితే, స్వామి ఇంత జరిగినా, చిరునవ్వుతో తానొక ధూళికణాన్ని అన్నారు తప్ప అహంకరించలేదు. “ఎందుకలా మిమ్ములను తక్కువ చేసుకుంటారని భక్తులు ప్రశ్నించగా స్వామి ఇలా చెప్పారు. “దత్త తత్త్వము ఎప్పుడూ వినయమే. జ్ఞానఫలము వినయమే, అహంకారం కాదు” ఎంతవారైనా అహంకరిస్తే పతనమగుదురు”.

ఆహా! అట్టి నరావతారములో ఎల్లప్పుడూ మన మధ్య శ్రీకృష్ణభగవానుడు పాండవుల మధ్య ఉన్నట్లు మానవాకృతిగా మనలను రక్షిస్తూ "జ్ఞానమె దీపము భక్తియె మార్గము" అని పదే పదే చెప్పుచూ ఎన్నో భక్తిరసామృత గీతములను ఆశువుగా పాడుతూ, ఎలాగో ఒకలా బండరాళ్ళు అయిన మనలను తన శిల్పచాతుర్యం చేత మూర్తులుగా మలచుచూ, మన మధ్య తిరుగుచూ ఉన్న ఆ దత్తప్రభువు అగు స్వామిని గుర్తించి సేవించి తరింతుము గాక!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch