12 Jul 2025
కమల గంధములు వెలువడుట.
[శ్రీ సోమయాజులు, శ్రీమతి కామేశ్వరమ్మ (అజయ్ తల్లిదండ్రులు)]
స్వామి అజయ్ గారింట్లో మధ్య బ్రహ్మముఖముగా కల శ్రీబ్రహ్మదత్తుల స్వామి చిత్రమును ప్రతిష్ఠించారు కదా. అప్పుడు స్వామి “తన తనువున గల కమల గంధముల, త్రిభువనములు ఆహ్లాదము నొందగ” అంటూ కీర్తించారు బ్రహ్మగాయత్రి భజన కీర్తనలో. ఆ కీర్తన విన్న అజయ్ గారి తల్లిదండ్రులు ఆ బ్రహ్మదత్తుల వారి చిత్రపటం ముందు కూర్చుని భజన చేస్తూ “ఇది నిజమేనా? నిజంగా దత్తునినుండి సుగంధం వస్తుందా?” అని సందేహించారు. స్వామి సత్యస్వరూపులు గదా! ఆశ్చర్యం! ఆ చిత్రపటం నుండి కమలగంధము 3 రోజులు ఘుమ ఘుమలాడింది. అదే గంధము స్వామి శయనించు గది నుండి కూడా వెలువడినది. ఎంతటి అద్భుతం! అజయ్ గారింటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలోనే స్వామి శయనిస్తారు. అదీ సంగతి. ఈ సంఘటన, స్వామికి, బ్రహ్మదత్తులకు అభేదాన్ని సూచించటం లేదా?
మరియొక సంఘటన.
[శ్రీ P.V.N.M. శర్మ]
ఒకసారి సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగియగు శర్మగారు అజయ్ గారి స్కూటరు వెంట తన స్కూటరుపై వస్తున్నారు. అజయ్ గారి స్కూటర్ వెనుక స్వామి కూర్చున్నారు. “స్వామి నిజంగా దత్తుడేనా?” అనే సందేహం హృదయాంతరాలలో మెదిలింది శర్మగారికి. అంతే! వెంటనే స్వామి నుండి గాఢమైన పద్మగంధం వచ్చి శర్మగారికి సోకింది. స్వామి వెనుకకు తలతిప్పి శర్మగారి వైపు చూసి చిరునవ్వును నవ్వి ఇంటికి రాగానే “ఎలా ఉంది సుగంధం?” అని అడిగినారు. శర్మగారు ఆశ్చర్యచకితులయినారు! ఆహా! స్వామీ! నాది ఎంతటి అవిశ్వాసమయ్యా! నన్ను క్షమించు అని మనసా వేడుకున్నారు శర్మగారు. ఇట్లే ఒకసారి స్వామి రచించిన దత్తవేద గ్రంథము నుండి కూడా ఇదే కమలగంధం రావటంతో అచ్చటి భక్తుల సందేహం తీరి ధన్యులయ్యారు.
ఇలా ఉండగా మొట్టమొదటి సారిగా విజయవాడలో సత్యనారాయణపురంలో శ్రీశిష్ట్లా భీమశంకరం గారింటికి స్వామి వచ్చారు. ఆ మరుసటి దినం వారింటికి స్వామి రాలేదు. స్వామి కోసం అందరూ ఎదురు చూచారు. ఇంతలో ఆ క్రిందటి రోజు స్వామి ఆసీనులైన స్థలంనుండి విపరీతముగా సుగంధము రావటం మొదలైనది. ఆ సమయములో వసుమతి, భీమశంకరం దంపతులు బయటకి వెళ్ళటంవల్ల వారికి ఈ సుగంధం విషయం తెలియలేదు. ఇంటిలో పద్మ, ప్రభాకర్ దంపతులు ఇద్దరే ఉన్నారు. ఆ గంధము చాల గాఢముగ వచ్చుచున్నందున, ఆ దంపతులు భయపడి ఆ గదినంతయును కిటికీలతో సహా బంధించి వేసారు. గంట తరువాత ఆ గదిని తెరువగా ఆ గంధము అదృశ్యమైనది. ఆ మరునాడు వచ్చిన స్వామి "రెండవ రోజు నేను రాలేదని మీరు అనుకున్నారు. కానీ నేను వచ్చాను కదా. ఆ గదిలో నుండి వచ్చిన కమల సుగంధం నేను వచ్చాననటానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా!" అన్నారు స్వామి. ఆహా! అద్భుతం!!
★ ★ ★ ★ ★