home
Shri Datta Swami

 13 Jul 2025

 

శివలహరి - 3

స్వామి “మూడు తలలోడు”

స్వామి ఒకరోజు విజయవాడ కృష్ణలంకలోని మా ఇంటి రెండవ అంతస్థులో శయనించారు. 3వ అంతస్థులో ఉన్న శ్రీదత్త పీఠమందిరంలో యథాప్రకారమే మేము శయ్యను వేసి చిన్న దిండును పెట్టి పవళింపు సేవ చేసి వచ్చినాము. తెల్లవారింది. రెండవ అంతస్థులో శయనించిన మన స్వామి నిద్రలేచి నా భార్య వైపు చూసి “ఏమమ్మా భవానమ్మా! ఏమిటి ఇంత చిన్న దిండు పెట్టావు. నా మూడు తలలకు సరిపోవద్దా? రేపు అయినా కాస్త పెద్ద దిండు పెట్టు” అన్నారు. అలా ఎందుకు అన్నారో మాకు అర్థం కాలేదు ఎందుకనగా - రెండవ అంతస్థులో శయనించిన స్వామికి పెద్ద దిండే పెట్టినాము గదా! స్వామి స్నానాదులు ముగించుకొని వెడలి పోయినారు. ఆ తరువాత మేము యథాప్రకారము శయ్యను తీసి మందిరాన్ని శుభ్రపరుద్దామని పై మందిరంలోకి వెళ్ళినాము. ఆశ్చర్యం! ఆ శయ్యపై మేము రాత్రి ఉంచిన దిండు కుడి వైపున బాగా అణిగి ఉంది. అప్పటికి గాని స్వామి పలుకులు మాకు అర్థము కాలేదు. మేము ఉంచిన దిండు రెండు తలలకు సరిపోయి మూడవ తలకు చాలక అణిగిపోయినది అన్నమాట. "మూడు తలలోణ్ణిరా నేను మూడు లోకాల ఏలికనురా" అని స్వామి పాడిన పాటకు ఇది ప్రత్యక్ష నిదర్శనం కాదా!

ఆ నాటి నుండి పైన శయనమందిరములో శయ్యపై పెద్ద దిండు పెట్టాము. స్వామి సాక్షాత్తు మూడుతలల శ్రీదత్త ప్రభువే అని రెట్టించిన భక్తి ప్రపత్తులతో ఆరాధన సాగించాము. స్వామీ! ధన్యులము!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch