home
Shri Datta Swami

 15 Jul 2025

 

శివలహరి - 5

షిరిడిలో పుల్కాలను సృష్టించుట.

విజయవాడ వాస్తవ్యులు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు షిరిడి యాత్ర చేయాలని సంకల్పించి, వారితో వారి సతీమణి శ్రీమతి శివకాంచన లత గారిని, వారి మాతృదేవత చిట్టెమ్మగారిని బయలుదేరతీసారు. వారితోపాటు మన స్వామిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. షిరిడీలో స్వామి ఒక అద్భుతసత్యాన్ని నిరూపించి శ్రీసత్యనారాయణ గారిని ఆశ్చర్యచకితులను చేశారు. ఆనాటి ఉదయమున షిరిడిలో స్వామి రెండు పుల్కాలను అద్భుతరీతిలో సృష్టించి, శ్రీసత్యనారాయణ గారి చేతిలో పెడుతూ “షిరిడీసాయి వీటిని నాకు ఇచ్చారు. బిచ్చగానికి, కుక్కకు దానము చేయమన్నారు” అని అన్నారు. సత్యనారాయణగారు ఆశ్చర్యచకితులై, ఆ పుల్కాలను స్వీకరించి నడుస్తూ ఉండగా, మందిరానికి పోవు దారిలో ఎదురుగా వచ్చిన ఒక బిచ్చగానికి ఆ రెండు పుల్కాలను ఇచ్చినారు. ఆ పుల్కాలను అందుకొన్న ఆ బిచ్చగాడు వాటిని వెనుకకు ముందుకు త్రిప్పుచూ పరీక్షించి అక్కడే ఉన్న ఒక నల్ల కుక్క చేత వాటిని తినిపించాడుట. ఈ సంఘటన విన్న నేను స్వామిని ఇలా ప్రశ్నించాను.

"స్వామీ! షిరిడి బాబావారు ఆ పుల్కాలను బిచ్చగానికి, కుక్కకు పెట్టమన్నారు గదా. మరి సత్యనారాయణగారు అక్కడ పుల్కాలను బిచ్చగానికి దానం చేయటం, ఆ బిచ్చగాడు ఆ రెండు పుల్కాలను నల్ల కుక్కచేత తినిపించటం" అద్భుతంగా ఉన్నది. దీనిలోని దేవరహస్యం చెప్పరా? అని ప్రార్థించాము

స్వామి ఇలా వివరించారు. “షిరిడీ బాబా ఎవరు? దత్త భగవానుడే కదా! భగవంతునకు భక్తునిపై ప్రేమ ఎలా ఉంటుందో ఈ సంఘటనలో స్వామి నిరూపించారు. అసలు విషయం ఏమంటే షిరిడీబాబా వారు, ఒక పుల్కా బిచ్చగాడికి, ఒక పుల్కా కుక్కకు అని ప్రసాదించారు. కానీ సత్యనారాయణగారు ఆ రెండు బిచ్చగానికే యిచ్చారు. అసలు ఆ బిచ్చగాడు ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే. స్వీకరించిన పుల్కాలలో ఒకటి తనకు, ఒకటి కుక్కకు గదా. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడైన ఆ బిచ్చగాడు కుక్క పుల్కా కుక్కచేత తినిపించి, తాను తినవలసిన పుల్కాను భక్తుడైన ఆ కుక్కచేత తినిపించి తాను తృప్తిపడ్డాడు. ఇదీ రహస్యం.  కనుక స్వామికి తన భక్తులంటే ఎంతటి ప్రేమయో నిరూపించబడలేదా” అన్నారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch