18 Jul 2025
సంన్యాసి పరీక్ష.
ఆ రోజుల్లో స్వామిని దత్తభక్తులుగా వ్యవహరించేవారు. స్వామి, నేను, నా శ్రీమతి శ్రీశైలంలోయున్నాము. ఆనాడు శ్రీమల్లికార్జునుల సేవించి భ్రమరాంబ తల్లి దేవాలయానికి వెళ్ళాము. భ్రమరాంబాదేవి గుడిలో మేము ముగ్గురము నిలచియున్నాము. ఆ గుడిలో విరిగిన ఒక పాత గంట త్రాడుతో బాగా పైకి కట్టబడి ఉంది. బలంగా ఆ ఎత్తుకు ఎగిరితే తప్ప ఆ గంట అందదు. అది విరిగిన గంట కదా! అందువలన ఎవరూ కొట్టరు. దానికి ముందు కొత్త గంట బాగా క్రిందకు కట్టబడివున్నది. అందరూ ఆ కొత్త గంటనే కొడుతున్నారు. ఆ గుడిలో కొంత దూరమున ఒక సంన్యాసి కనిపించాడు. ఆ సంన్యాసి స్వామి వైపు అదేపనిగా చూస్తున్నాడు. మన స్వామి ఒక సిద్ధపురుషునిగా గోచరిస్తున్నట్లున్నది. ఆ సంన్యాసి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. ఆ సంన్యాసి "స్వామి సిద్ధ పురుషుడా? కాదా?" అన్న సంశయముతో మథనపడుతూ మనస్సులో ఇలా అనుకున్నాడు - “ఇతడు సిద్ధపురుషుడు అయినచో వెనుకకు వచ్చి ఎగిరి ఆ పాత గంట కొట్టాలి” అని. స్వామి సర్వాంతర్యామి గదా! అతని మనోభావాన్ని ఇట్టే గుర్తించి అతడి వైపు చూచి చిరునవ్వు నవ్వి, వెనుకకు వచ్చి వేగంగా పైకి ఎగిరి పాత గంటను కొట్టినారు. ఆ చర్యను గమనించిన ఆ సంన్యాసి స్వామి వద్దకు వచ్చి తనను పరిచయం చేసుకొని ఆ తరువాత మేముంటున్న శివసదనానికి వచ్చారు. గుడిలో తాను ఏమి భావించినది పూసగుచ్చినట్లు వివరించాడు. ఇదంతయూ స్వామికి విదితమే గదా. స్వామి చిరునవ్వు చిందించారు.
అప్పటి నుండి ఆ సంన్యాసి ప్రతి రోజూ వచ్చి స్వామిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకనాడు నేను ఆ సంన్యాసితో స్వామిని గురించి ఇలా అన్నాను. “వీరు దత్తభక్తులు. వీరికి దత్తదర్శనం అయింది” అని. కానీ, ఆ సంన్యాసి తటాలున లేచి నిలబడి ముఖంలో మాత్సర్యం ఉట్టిపడగా ముఖం చిట్లించుకొని “ఆ! వీరికి దత్తుడు కనిపించినాడా? దయ్యం కనిపించిందా?” అని వికటంగా నవ్వాడు. అప్పటి వరకు కూర్చునియున్న స్వామి తటాలున లేచి నిలబడి కన్నెర్ర చేసి “ఓ సంన్యాసీ! నీవు కొన్ని అల్పసిద్ధులను సాధించి మిడిసిపడుతున్నావు. నీవు మహాత్ముడైన ఒక స్వామివారి శిష్యుడవు. నీవు నీ గురువు మీదే నీ క్షుద్రవిద్యలను ప్రయోగించినావు. అందుకే ఆయన నిన్ను తన్ని తగలేశాడు. ఎంతటి గురుద్రోహము చేశావు. పో! ఆయన పాదములపై పడు. ఆయన నిన్ను అనుగ్రహించగలడు” అని ఆ సంన్యాసిని స్వామి హెచ్చరించారు. అప్పుడు ఆ సన్యాసి మరల వికటంగా నవ్వి “నీవు చెప్పినదంతా కట్టుకథ”, అంటూ మరల రుసరుస లాడుతూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.
పట్టరాని క్రోధంతో, మాత్సర్యంతో ఆ సంన్యాసి ఆ రాత్రి చండీ ఉపాసన చేసి స్వామిపై ప్రయోగం చేసినాడు. స్వామి సర్వాంతర్యామి గదా! ఆయనకు తెలియనిది ఏముంది. చిరునవ్వుతో ఉండిపోయారు. కానీ జరిగిన ఆ సంఘటనలు, ఆ సంభాషణలు విన్న మాకు చాలా భయం వేసింది. అప్పుడు స్వామి " ఏమీ ఫరవాలేదు, మీరు విశ్రాంతిగా పడుకోండి" అన్నారు. శివసదనంలో గదిలో ఉన్నాము గదా మేము. మంచి నిద్రలో ఉన్నాము. ఇంతలో మా గది తలుపులు తటతట ఎవరో కొట్టారు. లేచి తలుపు తెరిచాము. ఆశ్చర్యం! ఆ సంన్యాసి లోపలికి వేగంగా వచ్చాడు. అప్పటికే లేచి కూర్చుని ఉన్న స్వామి పాదాలపై పడి క్షమించమంటూ ప్రాధేయపడ సాగాడు. స్వామి అతడిని లేవనెత్తి ఆసీనులను చేసారు. అప్పుడు ఆ సంన్యాసి గద్గదగళంతో ఇలా వివరించాడు –
"స్వామీ! నీవు సర్వజ్ఞుడవు. నీవు నా గురించి చెప్పినదంతా నిజమే. నా గురువు నన్ను మరల అనుగ్రహించునట్లు చేయుము. ఇది ఎవరికిని తెలియని రహస్యము! నీకు తెలిసినది! గత రాత్రి చండిని ఉపాసిస్తూ, నిన్ను బాధించుటకు నేను శ్రీచక్రార్చన చేయుచుండగా జగదంబ సాక్షాత్కరించి తీక్ష్ణదృక్కులతో నా వంక చూచుచూ ఉంగరాల వేళ్ళతో నామాడును గట్టిగా మొట్టినది. "పోయి స్వామి పాదాలపై బడి శరణము పొందుము" అని ఆదేశించినది. అందుకే ఉరుకులు పరుగులతో వచ్చినాను. స్వామీ! నన్ను క్షమించి, నాకు మార్గదర్శకులు కండి" అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి అపారవాత్సల్యంతో చిరునవ్వు చిందించుచూ, “ఇక నైననూ దుష్ట ఆలోచనలను దూరము చేసుకొని సన్మార్గములో నడుచుకొనుము” అని బోధించి పంపివేసినారు. ఆ సంన్యాసి పేరును ఇచ్చట వ్రాయవద్దన్నారు స్వామి. “ఆయన గౌరవమును కాపాడాలి” అన్నారు. ఆహా! స్వామి కరుణ ఎంత ఉన్నతము!
జగదంబయే స్వామి దైవత్వమునకు ప్రత్యక్ష నిదర్శనమయ్యెను గదా! ఎంతటి ప్రత్యక్షప్రమాణము!
★ ★ ★ ★ ★