19 Jul 2025
మంచి ఉద్యోగమును అనుగ్రహించుట.
మేము హైదరాబాదులో ఉన్న రోజులవి. మా పిల్లలు అందరూ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మా మూడవ కుమారుడు చి. రమణకు మంచి ఉద్యోగము దొరకలేదు అనే చింత మా దంపతులలో చోటు చేసుకున్నది. అప్పటికే స్వామి మా ఇంట్లో దత్తభక్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను, నా శ్రీమతి, స్వామి ముగ్గురం శ్రీశైలం వెళ్ళాము. మల్లికార్జున స్వామివారికి మొక్కించి అభిషేకం చేయించి, భ్రమరాంబ తల్లి ఆలయంలో కుంకుమార్చన చేయించి, మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ అమ్మవార్ల దగ్గర కూర్చోపెట్టి మాకు దత్తమంత్రము ఉపదేశించి శ్రీసూక్త పారాయణం చేయించారు. ఈ ఆరాధనలన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా మాలో దత్తభక్తిని స్థాపించుటకే నన్నారు స్వామి.
మరియు ఇలా వచించారు స్వామి “మీ కుమారుడు రమణకు మంచి ఉద్యోగం రాలేదనే చింత మిమ్ములను లోలోపల వేధిస్తోంది గదూ. సరే మీ రమణకు మంచి ఉద్యోగం ఇస్తాను మరి మీరు నా వైపుకు పూర్తిగా తిరుగుతారా?” అన్నారు స్వామి. “అంతకంటేనా? స్వామీ! తప్పక తిరుగుతాము. మాకు ఇంక ఏ కోరికలు లేవు అన్నాము.” ఆహా! ఎంతటి మహిమ! వెంటనే నెలలోగానే మా రమణకు జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్లో ఉద్యోగం వచ్చి డిప్యూటీ జనరల్ మేనేజరుగా ఎదగటం స్వామి అనుగ్రహం కాకపోతే మరేమిటి? మేము ఏ చింతా లేకుండా విజయవాడ చేరి స్వామిసేవ చేసుకుంటూ, దత్తమందిరంలో అర్చనలు జరుపుకుంటూ మా శేషజీవితాన్ని ధన్యము చేసుకొనటం కూడా స్వామి అనుగ్రహమే.
మా కుమారుడు, మా కోడలు హైదరాబాదులో స్వామి ఉన్నప్పుడు చక్కగా సేవ చేసుకునేవారు. స్వామి రమణను ‘తాత్య’ అని సంబోధించేవారు కూడా. ఒకరోజు రమణ కుమారుడు పసివాడైన రామకృష్ణకు తీవ్రమైన జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతోంది. మా కోడలు సుజాత తహతహలాడుచు కన్నీరు పెట్టుకుంటోంది. ముందు హాలులో పడుకున్న స్వామి లేచి వెళ్ళి పిల్లవానికి విభూతి పెట్టారు. అంతే! వాడి జ్వరం నెమ్మదించింది. పూర్తిగా ఆరోగ్యం చేకూరినది.
ఆ రోజుల్లో స్వామి భక్తులుగా వ్యవహరించేవారు కావున దైవాన్ని ప్రార్థించారు. ఈ రోజుల్లో దత్తునిగా ఫలప్రదాత తానేనని వ్యవహరిస్తున్నారు. ఈ తేడా స్వామిలో లేదు. ఈ తేడా మా దృష్టిలో ఉంది. మేము భక్తుడనుకుంటే భక్తుడే. దత్తుడనుకుంటే దత్తుడే. అంతేకాదు. "నన్ను వంచకునిగా భావించువారికి వంచకునిగనే వ్యవహరిస్తాను" అంటారు స్వామి. ‘యద్భావం తద్భవతి’ గదా!
★ ★ ★ ★ ★