home
Shri Datta Swami

 04 Jul 2025

 

విష్ణులహరి - 14

మృత్యువునుండి రక్షించుట.

[శ్రీ విజయరామ్, శ్రీమతి రమ, పవన్ (రమ పుత్రుడు), లావణ్య (రమ పుత్రిక)]

ఒకసారి భక్తురాలైన రమకు హైదరాబాదులో తీవ్రమైన అనారోగ్యం వచ్చినది. అది ఒక విచిత్రమైన వ్యాధి. డాక్టర్లకు అంతుపట్టలేదు. ప్రతిదినము 3 గంటలు అయ్యేటప్పటికి క్రుంగిపోవటం, విలవిలలాడిపోవటం, ఇక ఆమె ప్రాణం పోతుందేమో అని భయపడటం జరుగుతోంది. ఎందరో డాక్టర్లు పరీక్షించి “అమ్మా! భయం లేదు, నీకు ఏ అనారోగ్యం లేదు” అంటూ ఏదో మందులు ఇచ్చారే తప్ప ఈ వ్యాధి తగ్గటం లేదు. మేము మా పుత్రిక రమా వాళ్ళింటికి వెళ్ళాము. అమ్మాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆమె పడే నరకబాధను చూడలేకపోతున్నాము. ఆమెను రక్షించుట స్వామి వల్లే అవుతుంది, అందుకే వెంటనే విజయవాడలోనున్న మా అబ్బాయి భాస్కర్ కు ఫోన్ చేసాము. అతనికి విషయం చెప్పాము. స్వామి వారు ఎక్కడున్నారో తెలుసుకొని, వారికి ఈ విషయము చెప్పి రమను రక్షించమని ప్రార్థించమని కోరాము. అప్పటికి రాత్రి 7-30 గంటల సమయం అయినది.

ఆశ్చర్యం! స్వామి వారు అప్పటికే అనగా మధ్యాహ్నం 1.00 గంటకే విజయవాడ వచ్చేసారని, మా కోడలు బాలతో “మీ వాళ్ళలో ఒకరు మరణించనున్నారు” అని చెప్పి వెంటనే స్నానం చేసి రుద్రాభిషేకం ప్రారంభించారని, అభిషేకంలోనే ఉన్నారని, స్వామి వచ్చి ఇప్పటికి ఆరు గంటలు అయిందని చెప్పారు. భాస్కర్ నేను చెప్పిన రమ అనారోగ్యం విషయాన్ని వినగానే దుఃఖితుడయ్యాడు. స్వామీ! హైదరాబాదు నుండి ఫోన్, నాన్నగారు మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడరా? అని విన్నవించాల్సిన విషయం భాస్కర్ చెప్పకముందే, "నేను ఆ పని మీదనే ఉన్నానని చెప్పు" అని మా అబ్బాయితో అన్నారట. రమను చంద్రశేఖరాష్టకం చదువుకోమని కూడా ఆదేశించారు. ఈ ఫోను వార్త వినగానే మేమందరం చంద్రశేఖరాష్టకం చేయటం మొదలుపెట్టాము.

అంతే! వ్యాధి తిరుగుముఖం పట్టటం ఆరంభమైనది. మరునాడు కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఆ వ్యాధి కనిపించింది. మేము ఆదుర్దా పడ్డాము. స్వామిని ప్రార్థించాము. వెంటనే చంద్రశేఖరాష్టకం పారాయణ చేయసాగాము. ఆ సాయంత్రం బాగ్ లింగంపల్లిలో మా ఇంటికి వచ్చారట స్వామి. మా కోడలు సుజాత స్వామిని తీసుకుని రాత్రి 9 గంటలకు రమాసుందరి వాళ్ళింటికి వచ్చినది. స్వామి వచ్చి విశ్రమించారు. రమ స్వామి పాదాలు గట్టిగ పట్టుకున్నది. ఏడవటం మొదలు పెట్టింది. తన శరీరం క్రుంగిపోతోంది, యమయాతన అనుభవిస్తోంది. రాత్రి 12 గంటలు దాటినది. మేము అక్కడే ఉన్నాము కదా! స్వామి అలానే పడుకొనే ఉన్నారు. రమ స్వామి పాదాలు వదలలేదు. ఆ బాధ చూడలేక “స్వామీ! ఆమెను రక్షించనన్నా రక్షించండి, లేకపోతే అంతం చేయండి, కానీ ఈ నరకబాధను చూడలేకపోతున్నాము” అని కన్నీరు పెట్టుకుంటూ ప్రాధేయపడ్డాము. స్వామి తటాలున లేచి కూర్చున్నారు. "నీవు కూడా ఇట్లు మాట్లాడుచుంటివా?" అంటూ మా రమను చంద్రశేఖరాష్టకం చదవమన్నారు. మేము కూడా చంద్రశేఖరాష్టకం పారాయణం చేసాము. స్వామి నిమీలిత నేత్రులై ఆమె రక్షణకు సంకల్పించారు. అంతే చంద్రశేఖరాష్టకం పారాయణం పూర్తికాగానే రమ తేరుకున్నది. స్వామి అనుగ్రహం వల్ల వ్యాధి నుండి బయటపడి రక్షించబడినది. ఆహా! స్వామి సర్వజ్ఞతకు, సర్వశక్తిమత్వానికి ఇంతకంటే మరి ఏమి నిదర్శనము కావలెను?

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch