home
Shri Datta Swami

 05 Jul 2025

 

విష్ణులహరి - 15

అతిసార, శూలవ్యాధులను పోగొట్టుట.

i) ఒకసారి అతిసారవ్యాధి, వాంతులు విపరీతంగా వచ్చి, నా పరిస్థితి అస్తవ్యస్తమైనది. ఆ రోజు స్వామి అజయ్ గారింటిలో ఉన్నారు. స్వామి అజయ్ గారితో "ఇంత దత్తసేవ చేసిన బాలకృష్ణమూర్తికి (నేను) ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే ఎలా?" అన్నారట. స్వామికి వెంటనే అతిసారవ్యాధి, వాంతులు ఆరంభించినవి. అదే సమయానికి సరిగా (ఉదయం 7 గంటలకు) నా వ్యాధి అదృశ్యమైనది. అజయ్ గారు స్వామి బాధను ఆ రోజంతా కనులారా గాంచి ఆశ్చర్యపడి "పుస్తకాలలో స్వామి భక్తుల వ్యాధులను అనుభవిస్తారని చదివితిని గానీ ఇదే మొదటిసారి చూచుట" అని స్వామి అనుభవిస్తున్న రోగబాధను చూస్తూ నిశ్చేష్టులైనారు.

ii) మరియొకసారి కడుపులో వ్యాధి ముదిరి నేను అన్నము తినుట ఆగిపోయినది. అన్న హితవు లేక శుష్కించితిని. స్వామి వచ్చినారు. భోజనము చేస్తున్నారు. నేను స్వామి పాదాల వద్ద కూర్చుని "స్వామీ! తమరు శ్రీ నరసింహ సరస్వతి అవతారమున ఒక భక్తుని శూలను పోగొట్టినారు కదా, అలానే నన్ను ఇప్పుడు అనుగ్రహించండి" అని దీనంగా వేడుకున్నాను. స్వామి హృదయం ద్రవించినది. వెంటనే తాను తింటున్న అన్నమును 3 ముద్దలను నాకు ప్రసాదముగా ఇచ్చినారు. అవి తిన్నాను. మెతుకు పోయినా వికటించే స్థితిలో ఉన్న నాకు ఏమీ కాలేదు. అప్పటి నుండి అన్న హితవు పుట్టి శూలరోగము పోయి పూర్ణారోగ్యమును పొందితిని.

iii) మరియొక సారి నాకు స్నానం చేస్తుండగా నడుము పట్టివేసింది. బాత్రూమ్ నుండి బయటకు రాలేక పోయినాను. నా శ్రీమతి సహాయంతో వచ్చి పడుకున్నానే కానీ ఇటూ అటూ కదలలేక పోయినాను. స్వామిని మనస్సులో తలచుకొని నా పరిస్థితి నివేదించుకొన్నాను. మధ్యాహ్నం 3 గంటకు స్వామి వచ్చారు. నా మంచం మీద కూర్చున్నారు. లేచి నమస్కారం కూడా పెట్టలేకపోయాను. “నీ బాధను నేను తీసుకోనా?” అన్నారు స్వామి. “స్వామీ! వద్దు, వద్దు, నా కర్మ ఫలాన్ని నన్నే అనుభవించనీయండి. మీరు తీసుకోవద్దు మీ అనుగ్రహమే చాలు” అని ప్రార్థించాను. స్వామి విభూతి నోట్లో వేసి నడుముకు కూడ రాచారు. 3 గంటల నుండి 6గం ల వరకు స్వామి భజన చేసారు. గుంటూరు వెళ్తూ వెళ్తూ నా దగ్గర కూర్చుని “మీరు బాధను నన్ను తీసుకోవద్దన్నారు కదా! దత్తునిగా నేను తీసుకుంటే క్షణంలో తగ్గేది. అందుకే భక్తునిగా మీ కోసం 3 గం॥లు భజన చేసాను. ఇక తగ్గుతుంది లెండి” అని అన్నారు. అంతే! నేను పూర్తిగా కోలుకొన్నాను. అంతా స్వామి అనుగ్రహమే.

భక్తుడు నీవే - దత్తుడు నీవే । ఒక్కడె మా మా - భావసిద్ధుడు” అని స్వామిని గురించి గానము చేయుదము గాక.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch