06 Jul 2025
సైన్సును మించిన శక్తి
గుంటూరులో జరిగిన సంఘటన వినిపించి తరింతునుగాక ॥
భగవంతుని మహిమల యందు పూర్తి విశ్వాసము కలుగని వారు ప్రత్యక్ష ప్రమాణము మీద ఆధారపడతారు. సైన్సునే నమ్మిన వారు వీరు. ఇక్కడ చెప్పబోయేది కేవలం సైన్సునే నమ్ము ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అనుభవము. ఒకనాడు ఆ విద్యార్థినితో స్వామి “నిన్న టీవి చూసావా? రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించే దృశ్యం ఎంతబాగుంది” అని అన్నారు. ఆ విద్యార్థిని “నేను చూడలేదు. క్రికెట్ ఆట చూస్తున్నాను. అయినా సైన్సు ఇంత వృద్ధియైన రోజుల్లో సముద్రాన్ని దూకటం నమ్ముతారా?” అని అన్నది. ఆ తరువాత కొన్నాళ్ళకు స్వామి ఒకనాడు ఆ విద్యార్థిని ఆహ్వానంపై గుంటూరులో వారి ఇంటికి పోవటం జరిగినది. ఆమెకు మహిమల మీద నమ్మకం కుదరలేదు కదా! స్వామిని పరీక్షించదలచినది. ఆ విద్యార్థిని వారింటిలో అద్దెకున్న 6 సం॥ నుండి శూలవ్యాధితో బాధపడుచున్న ఒక వృద్ధుని స్వామికి చూపించి "వీరి వ్యాధిని మీరు పోగొట్టండి. 6సం॥ నుండి ఎన్ని వైద్యాలు చేసినా నిష్ఫలమైనది. నేను ఆధ్యాత్మికమును నమ్ముతాను" అని అన్నది. స్వామి చిరునవ్వు చిందించారు. ఇంతలో ఆ వృద్ధుడు స్వామికి 2 అరటిపండ్లను సమర్పించి నమస్కరించగా, స్వామి ఆ రెంటినీ వెంటనే తింటూ "ఇదిగో ఈ ఫలముల ద్వారా నీ కర్మఫలమును స్వీకరించుచున్నాను" అన్నారు. అంతే! 6 సం॥ నుండి శూలవ్యాధితో బాధపడుతూ అన్నం మెతుకులు తినగానే వికటించు ఆ రోగి ఆ రోజు నుండియే పరిపూర్ణ భోజనము చేసి తృప్తిగా తేన్చెను. స్వామి సాక్షాత్తు దత్తావతారులు కదా. ఆ భక్తుని వ్యాధిని తాను స్వీకరించి, తానే అనుభవించి, ఆ భక్తుని రోగ విముక్తుని చేయుట శ్రీ దత్తతత్త్వము గదా! ఆ రోజు రాత్రి అంతయూ స్వామి ఎంత శూలవ్యాధితో బాధపడినారంటే స్వామి బాధ తట్టుకొనలేక మంచముపై ఎగిరి ఎగిరి పడగా, మంచము నవారు తెగిపోయెను! ఈ విధమైన భగవంతుని మహిమను తెలిసికొని ఆ విద్యార్థిని స్వామికి ఒక పిచ్చి భక్తురాలిగా మారినది.
ఆహా! దైవకృప! వర్ణనాతీతముగదా!
★ ★ ★ ★ ★