home
Shri Datta Swami

 08 Jul 2025

 

విష్ణులహరి - 18

హనుమద్భక్తునికి గండము తప్పించుట.

1999 సం॥ ఆరంభములో శ్రీ కోనేరు సత్యనారాయణగారి తండ్రి గుంటెపోటుతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చగా, వారి ప్రమాదమును నివారించుటకై, శ్రీ సత్యనారాయణగారు స్వామిని అర్థించినారు. ఆ పని మీద మా ఇంటిలోనే స్వామి 3 రోజులు మృత్యుంజయ మంత్రానుష్ఠాన ధ్యానంతో ఉన్నారు. శ్రీ లక్ష్మయ్యగారు పూర్ణ స్వస్థతతో ఇంటికి తిరిగి వచ్చినారు. శ్రీ సత్యనారాయణగారు స్వామికి కృతఙ్ఞతను తెలిపినారు.

ఆ తరువాత మరికొన్ని సంవత్సరములకు శ్రీ లక్ష్మయ్యగారు జబ్బున పడినారు. ఒక రోజు స్వామి తన సహాధ్యాయునితో సాయంత్రము ఇట్లు చెప్పినారు –  “లక్ష్మయ్యగారి ఫైలు మీద సంతకం అయినది” అని. మరునాడే, ఉదయం లక్ష్మయ్యగారు మరణించినారు. “ఆయన హనుమంతుని భక్తుడు కావున సద్గతినొందినాడు” అని మాతో వచించినారు. స్వామి స్వయముగా మృత్యుంజయులయ్యును మృత్యుంజయ మంత్రానుష్ఠానము నేల చేసిరి?” అని ఒక భక్తుడు స్వామిని ప్రశ్నించగా “నన్ను భక్తునిగా తలచినచో నీ కొరకు దైవమును ప్రార్థింతును. నన్ను దత్తునిగా తలచినచో నేనే ఆ పనిని చేయుదును. ఎంత మాత్రముగ నిన్ను తలచిన అంత మాత్రమే నీవు! “యే యథా మాం ప్రపద్యన్తే” అని గీత అని స్వామి చెప్పి ఇలా పాడినారు. “భక్తుడు నేనే దత్తుడు నేనే! ఒక్కడె మీ మీ భావ సిద్ధుడు”.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch