09 Jul 2025
జ్ఞానము ద్వారా రోగము పోయి ఆరోగ్యము పొందుట.
హైదరాబాదులో ఒక పండితుడు అష్టావక్రసంహిత అను పురాణము చెప్పుచుండెను. ఒక శ్లోకము వద్ద పండితుడు ఆగిపోయెను. ఆ శ్లోకార్థము చెప్పిన, శ్రోతలు రాళ్ళు వేయుదురని సంశయించెను. కానీ జనకుని గురువు అష్టావక్రుడు. శుకుని పరీక్షించిన వాడు జనకుడు. అట్టి జనకునికి గురువైన అష్టావక్రుడు జనకునికి ఉపదేశించుచున్న వేదాంతశాస్త్రము ఆ సంహిత. ఆ శ్లోకార్థము ఇట్లున్నది “ ఓ జనకా! ఈ జన్మలో తల్లియైన జీవుడు, తన పుత్రునిపైనున్న శరీర మమకారముతో మరుజన్మలో భార్యగా జన్మించును”! ఈ శ్లోకార్థమును ఎట్లు చెప్పవలయునని ఆ పండితుడు చాలామందినడిగి, అందరును ఆ శ్లోకమును ఛీ కొట్టగా, ఏమీ పాలుపోక, ఆ దిగులుతో అన్నపానాదులు రుచించక 6 నెలల తరబడి మంచము పట్టి ఆనారోగ్యమునకు గురియై శుష్కించినాడు. స్వామి భక్తులు కొందరు ఆ పండితుని స్వామితో సమావేశపరచినారు.
స్వామి ఆ పండితుని ప్రశంసించుచు “ఓహో! ఎంత నా భాగ్యము! జ్ఞానమునకు ఇంత విలువనిచ్చు వారు కలియుగమున కలరా! నేను తప్పక నీ సంశయమును తీర్చెదను. ముందు అన్నపానాదులను స్వీకరించ” మని బలవంతముగా ఆ పండితుని చేత అన్నపానములను స్వీకరింపచేసెను. ఆ తరువాత స్వామి ఆ శ్లోకమును ఇట్లు వివరించెను. “ఒక సినిమాహాలులో ముందు ఒక సినిమా వచ్చినది. దానిలో ఒక నటుడు, ఒక నటి, తల్లి, కుమారులుగా నటించిరి. ఆ హాలులో తరువాత మరొక సినిమా వచ్చినది. దానిలో అదే నటీనటులు భార్యా భర్తలుగా నటించిరి. కానీ ఆ నటులు నిజంగా మాత్రం మాతా పుత్రులూ కారు, భార్యాభర్తలూ కారు. ఇదే విధముగా ఈ లోకములో జీవుల మధ్యనున్న బంధాలు కూడ అంతే! స్థూలశరీరములు పోగానే ఈ బంధములు నశించును.
స్వర్గముననున్న అభిమన్యుని చూచి అర్జునుడు కౌగలించుకొనుటకు సమీపించగా “ఎవరు నీవు?” అని అభిమన్యుడు అడుగుట "నీ తండ్రిని నేను" అని అర్జునుడు చెప్పుట, “నాకు కోట్ల జన్మలు గడచినవి. నీవే జన్మలో తండ్రివి” అని అభిమన్యుడు అడుగుట మనకు తెలిసిన విషయమే గదా. దీని వలన స్థూలశరీరము పోగానే ఈ లోకబంధములన్నియును సినిమా షూటింగు బంధములవలె నశించుచున్నవి అనియే అర్థము కదా. ఇదే అష్టావక్రుడు చెప్పిన శ్లోకతాత్పర్యము. కావున ఇట్టి అసత్య బంధముల వ్యామోహములకు లోనుగాక సత్యమైన - నిత్యమైన భగవద్బంధమునకు ప్రయత్నించుడని అష్టావక్ర మహాముని ఉపదేశించుచున్నాడు. “ఈ శ్లోకము నిజముగా ఎంత విలువగలది!” అని స్వామి వివరించెను.
ఆ పండితుడు ఆ శ్లోకార్థ వివరణమునకు ఆనందముతో కంపించుచు, అశ్రునయనాలతో స్వామికి ప్రణమిల్లి “స్వామీ! నీవు నిజంగా దత్తుడవే. దత్తుడు తప్ప ఇలా ఎవరును వివరించలేర”ని ప్రశంసించెను. ఆ పండితుడు మరునాడు పురాణమును చెప్పుట ఆరంభించి ఆ శ్లోకమును వివరించి జనుల నానందపరచెను. మరియును స్వామి జ్ఞానదానము చేత పండితుడు స్వస్థుడయ్యెను.
★ ★ ★ ★ ★