home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త సత్యశాయి శరణాష్టకమ్


శ్లో||  శ్రీ దత్తదేవ భగవత్ కరుణావతార శ్రేణిస్ఫురన్మణిగణోజ్జ్వల మధ్య రత్నమ్
 మాయాంధకార పటలీపటపాటనాంశుం శ్రీ సత్యశాయి తరణిం శరణం ప్రపద్యే ||

తా|| శ్రీ దత్తాత్రేయ భగవానుని కరుణావతారములను ప్రకాశించు మణుల మాలలోని ముఖ్యమైన రత్నమును, మాయాంధకార సమూహ మను వస్త్రము చీల్చు కిరణములు కల శ్రీ సత్యశాయి సూర్యుని శరణము పొందుచున్నాను.

శ్లో||  ఛాయాగ్రహవ్యసనపుత్ర కళత్రబంధ వ్యామోహనక్రఘన మృత్యు తిమింగిలోగ్రం
 సంసార సాగర మిమం సహసైవతర్తుం శ్రీ సత్యశాయి తరణం శరణం ప్రపద్యే ||

తా|| వ్యనములను ఛాయాగ్రహములతోను భార్యాపుత్రుల బంధములందు గల మోహములను మొసళ్ళతోను, మహామృత్యువను తిమింగలములతోను, భయంకరమైన ఈ సంసార సాగరమును వెంటనే దాటుటకు శ్రీ సత్యశాయి పడవను శరణము పొందుచున్నాను.

శ్లో||  వ్యర్ధ ప్రసంగమతి దుర్వినియోగశక్తి నిస్సార జీవ నివహోద్ధరణాయ జాతం
 సృష్టి స్ధితి ప్రళయ హేతు కృత త్రిమూర్తిం శ్రీ సత్యశాయి తరుణం శరణం ప్రపద్యే ||

తా|| వ్యర్ధములైన వాక్కులు, ఆలోచనలు క్రియలతో శక్తి దుర్వినియోగము కాగా, సారమును కోల్పోయిన ఈ జీవులను ఉద్ధరించుటకు అవతరించిన వాడును, సృష్టి స్ధితి ప్రళయముల కొరకు త్రిమూర్తులైన వాడును అగు శ్రీ సత్యశాయిని తరుణ వయస్కుని, శరణము పొందుచున్నాను.

శ్లో||  బ్రహ్మర్షిశేఖరసముల్లస దంతరంగ కేదారపాక కరశీకర కారణాభ్రమ్
 భక్తప్రమోద నవశీతల వాతహేతుం శ్రీ సత్యశాయి వరుణం శరణం ప్రపద్యే ||

తా|| బ్రహ్మర్షులలో శ్రేష్ఠులైన వారి యొక్క ఉల్లాసముతో గూడిన మనస్సులను మాగాణి భూముల పంటలను పండించు చినుకులను వెదజల్లుచున్న ఆకాశమును, భక్తులకు ఆనందమును కలుగజేయు చల్లని వాయువులనొసగుచున్న శ్రీ సత్యశాయి వరుణుని శరణము పొందుచున్నాను.

శ్లో||  శ్రీ శంఖ చక్ర జలజాది పవిత్ర రేఖా సంలక్షితం శ్రితజనావనబద్ధ దీక్షమ్
 అజ్ఞాన రాత్రి గమనోదయ పుల్లపద్మం శ్రీ సత్యశాయి చరణం శరణం ప్రపద్యే ||

తా|| శుభమైన శంఖ, చక్ర, పద్మ, పావన రేఖలతో కూడినదియు, ఆశ్రయించిన వారిని రక్షించుటకు దీక్షను వహించి నట్టిదియు, అజ్ఞానమును రాత్రి పోయిన తర్వాత వచ్చిన ఉషః కాలమునందు ఉదయించిన పద్మమువంటిదియు అగు శ్రీ సత్యశాయి చరణమును శరణము పొందుచున్నాను.

శ్లో||  మాయా కలి ప్రబల  కాల ఘనాఘనాభ్ర చ్చేదాగతస్ఫుట తటిత్తతి హేతి తీక్ష్ణమ్
 కైవల్య మార్గకలనా సహకారి దివ్యం శ్రీ సత్యశాయి కిరణం శరణం ప్రపద్యే ||

తా|| మాయతో కూడిన ఈ కలియుగమను నల్లని మేఘములతో కప్పబడిన ఆకాశమును చీల్చుకొని వచ్చినట్టిదియు, బాగుగా మెరయు మెరపుల తీక్ష్ణ ధారయు, మోక్ష మార్గమును చూపుటలో సహాయమును చేయునట్టిదియు అగు దివ్యమైన శ్రీ సత్యశాయి కిరణమును శరణము పొందుచున్నాను.

శ్లో||  నానా  వ్యధావికలిత శ్రిత కర్మపాక-పీడాఫలగ్రహణ దుఃఖ సుఖానుభూతిమ్
 ప్రేమ ప్రసన్న జలధిం రస సార్వభౌమం శ్రీ సత్యశాయి కరుణం శరణం ప్రపద్యే ||

తా|| అనేక బాధలతో వికలితులైన భక్తుల ప్రారబ్ధ కర్మ పీడా ఫలములను తాను గ్రహించి వారి ధుఃఖమును సుఖముగా తాను అనుభవించువాడును, ప్రసన్నమైన ప్రేమసముద్రమును, నవరసములలో ఉత్తమమును, అగు శ్రీ సత్యశాయి కరుణను, శరణము పొందుచున్నాను.

శ్లో||ప్రేమావతార సముపాశ్రయ సాధనాంత సాయుజ్య తత్పర మహోన్నత భక్త బృందైః
 ఆత్మీయ భావవిమలైః కృతమేక భాగ్యం శ్రీ సత్యశాయి వరణం శరణం ప్రపద్యే ||

తా|| ప్రేమావతారమగు తనను ఆశ్రయించి సాధనచే సాయుజ్యమును పొందగోరు ఆత్మీయ భావ విశుద్ధులగు భక్తులచే చేయబడిన అదృష్టఫలమగు శ్రీ సత్యశాయిని వరించుటను   శరణము పొందుచున్నాను.

ఫలశృతి
శ్లో|| శ్రీ దత్తాత్రేయ భగవత్-వర్తమాన శరీరిణమ్ సత్యశాయిన మాలంబ్య కైవల్యపదవీం వ్రజేత్ శ్రీ దత్తాత్రేయ భగవత్-అష్టకం దుఃఖ నాశకమ్ సప్తర్షివాంఛయా కృష్ణ-కృతం సాధక సాధనమ్

తా|| శ్రీ దత్తాత్రేయ భగవానుని వర్తమానావతారమగు శ్రీ సత్యశాయిని శరణము పొందినవాడు కైవల్యమును పొందును. సప్తమహర్షుల కోరికచే కృష్ణునిచే రచింపబడినదియు, సాధకులకు సాధనమగు ఈ సత్యశాయి భగవానుని అష్టకము సర్వ దుఃఖములను నశింప జేయును.

 
 whatsnewContactSearch