home
Shri Datta Swami

Posted on: 01 Nov 2022

               

Important Message to Devotees from His Holiness Shri Datta Swami (Telugu)

Read this article in English   Hindi   Telugu   Tamil   Malayalam

పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త స్వామి వారు

వారి అనుగ్రహ భాషణములో భక్తులకు ఒక ముఖ్యమైన సందేశమును అందించినారు.

“నేను ప్రతి భక్తునికి ఒక మంత్రమును ఉపదేశించుచున్నాను. మరియు ఈ మంత్రమును ఇచ్చే ముందు దానిని గురించి ఈ క్రింది వివరణను ఇవ్వదలచినాను” అని శ్రీ దత్త స్వామి వివరించినారు. ఈ మంత్రమునకు గల నేపథ్యము వివరిస్తూ, ప్రతి జీవుడు ఆధ్యాత్మికత వైపు తన మనస్సును కేంద్రీకరించ లేక పోవుచున్నాడు. (కారణమేమనగా, పరమాత్మను ప్రతిఫలాపేక్ష రహితముగా ఆరాధించలేకపోవుటయే).  దీనికి గల ముఖ్య కారణము జీవులు తమ ప్రాపంచిక విషయములు/సమస్యల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుచున్నారు. ఇది వారి మనస్సులను ఆధ్యాత్మికతపై కేంద్రీకరించుటకు ఆటంకము కలిగిస్తున్నది. ఈ ప్రాపంచిక సమస్యలను పరిష్కరించడం ద్వారా, ప్రతిఫలాపేక్ష రహితముగా నిజమైన ప్రేమతో భగవంతునిపై ఏకాగ్రతను కలిగి వుండుటకు అవకాశము ఏర్పడుతుంది. దీని వలన జీవులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాస్తవానికి, చాలా మంది భక్తులు తమ ప్రాపంచిక సమస్యలను పరిష్కరించుకొనుటకు మాత్రమే భగవంతుని ఆరాధిస్తున్నారు. కేవలము తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు పరమాత్మను, భక్తిని ఒక సాధనముగా వినియోగించుట జరుగుచున్నది. ఒక వేళ ఇప్పటి వరకూ ఉన్న సమస్యలకు పరిష్కారము లభించినా కూడా పూర్తి స్థాయిలో భక్తిని వృద్ధిచేసుకొని, తద్ద్వారా జీవులు మానసిక ప్రశాంతతను పొంది ప్రతిఫలాపేక్ష రహితముగా పరమాత్మను పొందవలెననే ఏకైక లక్ష్యముతో ఆరాధించగలరా! అను సందేహము కలుగక మానదు. ఎందుకనగా,ఈ ప్రాపంచిక విషయములు/సమస్యలు అంతం అనునది లేకుండా నిరంతరముగా వుంటూనే వుంటాయి. అప్పటి వరకూ వున్న ప్రాపంచిక సమస్యలకు పరిష్కారము లభించి, మానసిక ప్రశాంతత సమకూరినా కూడా, ఆ మానసిక ప్రశాంతత వలన లభించిన శక్తిని ఇంకా ఎక్కువగా ఇతర ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టుటకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నేను ఈ సందేహమును పక్కనపెట్టి, ప్రాపంచిక సమస్యలు పరిష్కారమైతే, భక్తులు కనీసము అప్పటి నుండి ప్రతిఫలాపేక్ష రహితముగా పరమాత్మను పొందవలెననే ఏకైక లక్ష్యము వైపు మరలుతారనే సానుకూల దృక్పథముతో ఉన్నాను. అటువంటి సానుకూల దృక్పథముతో ఈ ప్రాపంచిక సమస్యల వలన ఏర్పడే ఒత్తిడి నుండి కొంత ఉపశమనమును పొందుటకు నేను ఈ క్రింది మంత్రాన్ని ఇస్తున్నాను.

ఈ మంత్రము యొక్క పూర్తి నేపథ్యమును ఇక్కడ వివరిస్తున్నాను. పరమాత్మ తన కార్యనిర్వహణాధికారులుగా పిలువబడే తొమ్మిది గ్రహముల ద్వారా ఈ సృష్టి పరిపాలనను నిర్వహిస్తారు. ఈ తొమ్మిది గ్రహములు, జీవుల పాప, పుణ్య కర్మలను అనుసరించి వాటికి పరమాత్మచే నిర్ణయించబడిన ఫలములనే అందిస్తున్నాయి గానీ, గ్రహముల ఇష్టాయిష్టములను అనుసరించి కాదు. ఈ గ్రహములు న్యాయస్థానం నుండి తీర్పు పొందిన తర్వాత నేరస్థుడిని జైలులో ఉంచే జైలర్ వంటి కార్యనిర్వహణాధికారులు మాత్రమే. తీర్పును రద్దు చేసే అధికారము గ్రహములకు లేదు. అటువంటి అధికారము కలిగిన సర్వశక్తిమంతుడైన పరమాత్మ కూడా, జీవుని కర్మల చక్రమును అనుసరించి వాటి ఫలములను నిర్ణయిస్తారు కానీ, తనచే రచించబడిన రాజ్యాంగమును ఉల్లంఘించరు. పాప కర్మ ఫలములను రద్దు చేయుటకు గల ఏకైక మార్గము జీవుడు తాను చేసిన పాపకర్మను అంగీకరించి, దానికి పశ్చాత్తాపము చెంది అటువంటి పాప కర్మను మరల తన జీవన పర్యంతము చేయకుండా ఉండుట మాత్రమే. తమను తాము సంస్కరించుకొనని జీవులు పాప కర్మలను చేసి, వాటి ఫలితములను అనుభవించకుండా వాటిని రద్దుచేయమని లేదా వాటి నుండి ఉపశమనమును కలిగించమని పరమాత్మను ప్రార్ధించినప్పుడు, పరమాత్మ ఆ జీవుడు ఈ జన్మలో అనుభవించవలసిన కర్మ ఫలములను తమ తదుపరి జన్మలలో అధిక వడ్డీతో అనుభవించునట్లు తాత్కాలికముగా సర్దుబాటు చేసి వారికి ఈ జన్మలో కొంత ఉపశమనమును కలుగచేస్తారు. ఈ తాత్కాలికమైన సర్దుబాటును సరిగా అర్ధము చేసుకొనని జీవులు, పరమాత్మ తమ ప్రార్ధనలకు వరముగా ఈ పాప కర్మ ఫలితములను రద్దు చేసినారని భావిస్తారు. అంతే కాక తమ మేధస్సు (భక్తి/ప్రార్ధనల) తో మోసగించి సర్వ శక్తిమంతుడైన పరమాత్మ ద్వారా తమ పాప కర్మ ఫలములను రద్దు చేసుకొనగలిగినామని భావిస్తుంటారు. జీవుడు ఇట్లు వక్ర మార్గములో ఆలోచిస్తున్నాడని తెలిసి కూడా, కొంతకాలము ఆ జీవుడు ఆనందముగా వుండగలడని పరమాత్మ మౌనముగా వుంటారు.

తొమ్మిది గ్రహములలో, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, జీవులకు తాము చేసిన పుణ్య కర్మఫలములను అందిస్తుండగా, వారు చేసిన పాప కర్మల ఫలితములను, శని, కుజుడు, రాహువు మరియు కేతు గ్రహములు అందిస్తుంటారు. ఇది కర్మచక్రము యొక్క సాధారణ నేపథ్యము. ఈ మంత్రములో మీరు నాలుగు గ్రహములకు నమస్కరించుటయే కాక, ఆ గ్రహముల అధిదేవతలను మరియు ఈ నాలుగు గ్రహములను నియంత్రించగల దైవ స్వరూపాలను స్మరిస్తున్నారు. హనుమంతుడు శనైశ్చరుని నియంత్రిస్తారు. ఎందుకనగా, హనుమంతుడు, శనైశ్చరుని, రావణుని చెరనుండి విముక్తుని చేసినారు. సుబ్రహ్మణ్య స్వామి, మరియు అంగారకుడు ఒకే రకమైన శక్తి (అగ్ని) ని స్వభావముగా కలిగి ఉంటారు. కనుక సుబ్రహ్మణ్య స్వామి, మరియు అంగారకుని ఒకరిగానే పరిగణిస్తారు (కుమారం శక్తిహస్తం తం, మంగళం ప్రణమామ్యహం). సుబ్రహ్మణ్య స్వామి, సర్పములకు అధిపతి అయిన ఆదిశేషుని కుమార్తె అగు వల్లీ దేవిని వివాహము చేసుకొన్నారు. ఆమె కొరకు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక సర్పరూపమును ధరించినారు. అందువలన, సర్పాకారము కలిగిన రాహు మరియు కేతు గ్రహములను నియంత్రిస్తారు. ఆంజనేయునికి, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తే, చెడు ఫలితములను ఇచ్చు నాలుగు గ్రహములు శాంతిస్తాయి. ఎవరికైనా శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని (కొంతమంది భక్తులు శివుని ఇష్టపడని కారణమున) అర్చించుటకు అభ్యంతరములు ఉన్నచో, సుబ్రహ్మణ్య స్వామి స్థానములో ఆదిశేషుని పూజించవచ్చు. పూజ మరియు జపమునకు, ఆంజనేయ స్వామి, మరియూ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటములను ఉంచుకొనగలరు. ఆంజనేయస్వామి చిత్రపటముతో పాటు, అభ్యంతరములున్నచో, సుబ్రహ్మణ్య స్వామి స్థానములో ఆదిశేషుని చిత్రపటమును ఉంచి పూజించవచ్చును.

మంత్రము:-

శ్రీ శనైశ్చర కుజ రాహు కేతుభ్యో నమః
శ్రీ ఆంజనేయ శ్రీ సుబ్రహ్మణ్య.

 
 whatsnewContactSearch