home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

భజ భజ దత్తం



(Sung by Smt. Devi)

భజ భజ దత్తం - భజ భజ దత్తమ్ || భజ భజ దత్తం  బ్రహ్మ దత్తమ్ || (పల్లవి)

1. తత్సవితుస్త ద్దేవతాయాః - వరేణ్య భర్గో ధీమహీహః |

ప్రచోదయేద్వై ధియో యో నః - తంబ్రహ్మాణం జ్ఞానసూర్యమ్ ||

దేవుడైన ఆ సవితయొక్క శ్రేష్టమైన ఆ తేజస్సును ధ్యానించు చున్నాము. ఏ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునో, అట్టి జ్ఞాన సూర్యుడైన ఆ బ్రహ్మదేవుడగు దత్తుని భజించుము.

 

2. ప్రాణిప్రసవా ద్యః ప్రసిద్ధః - సవితే త్యస్య బ్రహ్మతేజః |

శిష్యధియశ్చ ప్రేరయేన్నః - తంగాయత్రీ మన్త్రసారమ్. ||

ప్రాణులను ప్రసవించుట అనగా సృష్టించుటచేత ఏ దేవుడు సవితయని ప్రసిద్ధుడయ్యెనో, ఏ దేవుని బ్రహ్మతేజస్సు మా శిష్య బుద్ధులను ప్రేరేపించుచున్నదో, అట్టి గాయత్రీ మంత్రసారమైన దత్తుని భజింపుము.

 

3. గాయత్రీయం ఛన్దఏవ - సవితాదేవఃస్మర్యతేచ |

శిష్యాన్ధకార ముకుళితాబ్జ - ధీవికాసదం గురువరేణ్యమ్. ||

గాయత్రి అనగా ఛందస్సు పేరే గదా! ఆ మంత్రదేవత సవితయని ముందే చెప్పబడినది గదా. శిష్యులయొక్క అజ్ఞానాంధ కారము చేత ముకుళించిన బుద్ధి పద్మములకు వికాసమునిచ్చు గురువరేణ్యుడగు దత్తుని భజింపుము.

 

4. కర్తాభర్తా హ్యేషహర్తా - సర్వస్యాస్య శ్రూయతేహి |

త్రిమూర్తిరూపం బ్రహ్మచైకం - బ్రహ్మాకారం బ్రహ్మవాచమ్. ||

ఈ జగత్తును సృష్టించువాడే పాలించి దీనిని హరించు వాడని శ్రుతి “యతోవా” అని చెప్పుచున్నది గదా. ఒకే పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపముతో నున్నది అనియే ఈ శ్రుతికి అర్ధము. బ్రహ్మదేవుని ఆకారముననున్న వేదములను చెప్పు బ్రహ్మదత్తుడగు ఆ సవితను భజింపుము.

 

5. త్రిపదం ఛన్దః త్రిస్వరోక్తం - త్రికాల వన్ద్యం త్రిగుణ సూత్రమ్|

త్రివాహినీనాం సఙ్గమం వా - త్రిమూర్తి తత్త్వం యం వ్యనక్తి ||

త్రిపాదములతో నున్నది గాయత్రీ ఛందస్సు. అది ఉదాత్త అనుదాత్తస్వరితములను త్రిస్వరములతోనున్నది. త్రిగుణములతో (మూడు పోగులు) నున్నది యజ్ఞోపవీతము. త్రివాహినుల సంగమమైన ప్రయాగవంటి పవిత్రమైన త్రికాల సంధ్యలయందు వందనీయమైన ఏ త్రిమూర్తి తత్త్వమును ఈ గాయత్రీ మంత్రము స్ఫురింపచేయునో అట్టి దత్తుని భజింపుము.

 

6. ఓఙ్కారశ్చ త్రివిధవర్ణః - త్రిస్రోవ్యాహృత యోஉపి యంహి |

సంబోధయన్తి సర్వమన్త్రో - యమేవ వక్తి త్రిగుణమేకమ్.||

అకార, ఉకార, మకారములతోనున్న త్రివర్ణాత్మకమగు ఓంకారము, భూః భువః సువః అను మూడు వ్యాహృతులును, ఏ దేవునే సూచించునో, సర్వగాయత్రీ మంత్రము, సత్త్వ-రజః-తమః గుణములను కలిగిన ఏ ఒకే దేవుని చెప్పుచున్నదో అట్టి దత్తుని భజింపుము.

 

7. చత్వారోయం వేదశునకాః - గౌరనుసరతిచ వేదధర్మః |

వీణాశ్రవణం వాణీపతిం - షోడశవర్షం బ్రహ్మదేవమ్ ||

నాల్గు వేదములు కుక్కలుగను, వేదధర్మమే గోవుగ వెంట నడుచు చుండగ వీణాశ్రవణమును చేయువాడును, వాణీపతియు, పదునారు సంవత్సరముల ప్రాయము కలవాడును బ్రహ్మదేవుడగు దత్తుని భజింపుము.

 

8. జగదారంభం హంసవాహం - తేజోవదనం మన్త్రమూలమ్ |

గాయత్రీశం సామగానం - విద్యానిలయం వేదపాఠమ్ ||

జగత్తును సృష్టించుటకు ఆరంభించుచున్నవాడును, హంస వాహనుడును, తేజస్సుతోనున్న ముఖము గలవాడును, మంత్రములకు మూలమును, గాయత్రికి అధీశ్వరుడును, సామగానము చేయుచున్నవాడును, విద్యలకు నిలయుడును, వేదపాఠము చేయుచున్నవాడునగు దత్తుని భజింపుము.

 

9. యజ్ఞాచరణం హోమనిష్టం - కమణ్డలుధరం దర్భపాణిమ్ |

అగ్నిజ్వాలా భాసమానం - ప్రాతస్సన్ధ్యా బాలభానుమ్ ||

యజ్ఞములను చేయుచున్నవాడును, హోమములందు నిష్ఠతోనున్నవాడును, కమండలమును ధరించి దర్భలను చేతపట్టిన వాడును, అగ్నిజ్వాలవలె ప్రకాశించుచున్నవాడును, ప్రాతస్సంధ్యాకాలమున వెలుగు బాలభానుడివలె ఎర్రగా భాసించుచున్న దత్తుని భజింపుము.

 

10. చందన తిలకే కుఙ్కుమాఙ్కం - బ్రహ్మతేజసా దీప్యమానమ్ |

త్రిజగన్మోహన సున్దరాఙ్గం - కాషాయధరం పణ్డితేశమ్ ||

ముఖమున చందన బింబ తిలకము, మధ్య కుంకుమ తిలకమును ధరించిన వాడును, బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న వాడును, త్రిలోకములను మోహింపచేయు సుందరాంగుడును, కాషాయ వస్త్రధారియు, పండితసార్వభౌముడునగు దత్తుని భజించుము.

 

11. అత్రేః పుత్రం బ్రహ్మదత్తం - అనసూయాంబా ప్రేమరాశిమ్ |

అజిన మేఖలం బ్రహ్మదణ్డం - యజ్ఞోపవీత మక్షమాలమ్ ||

అత్రిపుత్రుడగు బ్రహ్మదత్తుడును, అనసూయాంబయొక్క ప్రేమరాశియును, కృష్ణచర్మమును మేఖలగా కలవాడును, బ్రహ్మదండమును యజ్ఞోపవీతమును జపమాలను ధరించినట్టి దత్తుని భజింపుము.

 

12. స్వతనోరుద్య త్కమల గన్దైః - త్రిభువనాని హ్లాదయన్తమ్ |

బ్రహ్మముహూర్తే సాధాకానాం - ప్రచోదయేత్తా యో ధియో నః ||

తన తనువునుండి ప్రసరించు పద్మగంధములచేత త్రిభువనములను ఆహ్లాదపరచువాడును, బ్రహ్మముహూర్తమున సాధకులగు మాయొక్క బుద్ధులను ఏ దేవుడు ప్రేరేపించునో అట్టి దత్తుని భజింపుము.

 

13. సృష్టిక్రమ వద పురుషసూక్తం - త్రిస్వరబద్ధం పావనార్ధమ్ |

ఋషిభిః పఠితం బ్రహ్మకాలే - శ్రుత్వాశ్రుత్వా ప్రీయమాణమ్ ||

జగత్తుయొక్క సృష్టిక్రమమును వివరించునదియు, మూడు స్వరములతో నున్నదియును, పవిత్రమైన అర్ధము కలదియగు, పురుష సూక్తమును తనివితీర విని విని సంతోషించుచున్న దత్తుని భజింపుము.

 

14. త్రిమతాచార్యైః పఠ్యమానాన్ - తత్తన్మతమయ భాష్యవాదాన్ |

శ్రుత్వా సిద్ధాన్తార్ధ మన్త్యం - సమన్వయమతం వాచయన్తమ్ ||

త్రిమతాచార్యులగు శంకర-రామానుజ-మధ్వులు తమతమ మతానుసారములగు తమ తమ భాష్యవాదములను వినిపించు చుండగా వినుచు చివరకు త్రిమత సమన్వయమగు మతమును తన చరమ సిద్ధాంతముగా పలుకుచున్న దత్తుని భజింపుము.

 

15. వేదాన్తానా మన్తి మార్థం - వేదాన్తార్థం బోధయన్తమ్ |

ఋషిభిః పరితో భాషమాణం - శాస్త్రార్ధేషు వ్యఞ్జితేషు ||

ఉపనిషత్తులుయొక్క అంతిమసారమైన వాడును, ఉపనిషత్తుల అర్ధమును బోధించుచున్నవాడును, నిగూఢమైన వ్యంగ్యములగు శాస్త్ర విషయములను చుట్టు చేరిన ఋషులు అడుగుచుండగ చెప్పుచున్న వాడును అగు దత్తుని భజింపుము.

 

16. ఆయుధవర్జిత పాణిపద్మం - వాచైవారిం మారయన్తమ్ |

కర్మఫలాని లలాటపత్రే - లిఖన్త మాయు ర్దాయ దానమ్ ||

తన కరకమలమున ఎట్టి ఆయుధములేనివాడును, వాక్కు చేతనే శత్రువులను చంపగలవాడును, లలాట పత్రమునందు కర్మఫలములను లిఖించువాడును, ఆయుర్దాయమును ప్రసాదించువాడును అగు దత్తుని భజింపుము.

 

17. ఆచార్యేన్ద్రం వాక్ప్రచారం - భువిసంచారం నిర్విచారమ్ |

ఖలాభిచారం సదాచారం - సురపరిచారం చిత్తచోరమ్ ||

ఆచార్యేంద్రుడును, వాక్కుతో జ్ఞానప్రచారమును చేయుచున్న వాడును, భూమినంతయును సంచరించుచున్నవాడును, విచార రహితుడును, దుష్టులను సంహరించువాడును, వైదిక సదాచార వంతుడును, దేవతలే పరిచారకులుగ కలవాడును, చిత్తచోరుడును అగు దత్తుని భజింపుము.

 

18. పద్మ సంభవం పద్మపీఠం - పద్మ సుగన్ధం పద్మవర్ణమ్ |

పద్మాపుత్రం పద్మ నేత్రం - పద్మ సుపాణిం పద్మ పాదమ్ ||

కమల సంభవుడును, కమలాసనుడును, కమల సుగంధములను వెదజల్లువాడును, కమలకాంతిగలవాడును, కమలయొక్క పుత్రుడును, కమలనేత్రుడును, కమలపాణియును, కమలచరణుడునగు దత్తుని భజింపుము.

 

19. వీణాపాణిః యస్య శిష్యా - వాణీగాయతి జ్ఞానదేవీ |

తం వాగీశం సామవాచా - చర శోణాధర మన్త్రపాఠమ్ ||

ఏ దేవుని యొక్క శిష్యురాలును, వీణాపాణియును, జ్ఞాన దేవియునగు వాణీదేవత కదలుచున్న ఎర్రని పెదవులతో మంత్రములను పఠించుచున్న ఏ వాగీశ్వరుని సామగానములతో స్తుతించుచున్నదో, అట్టి దత్తుని భజింపుము.

 

20. యత్సఙ్కల్పః కేవలం హి - సర్వ విశ్వం రచితమేవమ్ |

ఆద్యం దేవం ప్రథమ మూర్తిం ఆరాధనీయ మజమనాదిమ్ ||

ఏ దేవునియొక్క కేవల సంకల్పమే ఈ రచితమైన సర్వ ప్రపంచమో, అట్టి ఆదిదేవుని ప్రధమ రూపమును, ఆరాధనీయుడును, అజుడును, అనాదియనగు దత్తుని భజింపుము.

 

21. లలాటరేఖాం కర్మబద్ధాం - పరిమార్ష్టుం యః కేవలోహి |

సర్వసమర్ధో లేఖకోஉయం - ధాతారంతం మూల మూలమ్ ||

కర్మబద్ధమైన లలాట రేఖలను తుడిచివేయుటకు వ్రాసిన వాడగు ఏ దేవుడు ఒక్కడే సర్వ సమర్ధుడో అట్టి ధాతయు, మూలమునకే మూలమైనవాడగు దత్తుని భజింపుము.

 

22. చతురామ్నాయాం శ్చతురవాచా - చతురాస్యాబ్జై రుద్గిరన్తమ్ |

కవిం కవీనా మాదికావ్యం - సర్వజగదిదం విరచయన్తమ్ ||

ఏ దేవుడు తన నాలుగు ముఖ కమలముల ద్వారా నాలుగు వేదములను చతురవాక్కులతో రచించెనో, కవులకే కవియును, ఆది కావ్యమైన ఈ సర్వజగత్తును రచించినవాడగు దత్తుని భజింపుము.

 

23. పరమ బ్రహ్మ బ్రహ్మ శబ్దో - యస్మిన్నేవ ప్రకృతి హేతౌ |

పూజాతీతం పరమపూజ్యం - దివసారంభే పూజనీయమ్ ||

ఈ సృష్టికి ముందున్న సృష్టి కారకుడగు పరబ్రహ్మమైన ఏ దేవునియందే బ్రహ్మ శబ్దము వాడబడినదో ఏ దేవుడు వాఙ్మనోబుద్ధ్యతీతుడగుట వలన పూజలకు అందడో (బ్రహ్మపూజ లేకపోవుటకు ఇదే కారణము), నిజముగా ఉదయ పూజకు అర్హుడగు దత్తుని భజింపుము.

 

24. గాయత్రాద్యా యస్యభార్యాః - త్రిశక్త యస్తా స్త్రిముఖ పద్మమ్ |

దేవపితౄణాం పితరమేవ - పితామహాఖ్యం బ్రహ్మరూపమ్ ||

గాయత్రీ, సావిత్రీ, సరస్వతియను పేర్లతో త్రికాల సంధ్యాశక్తులే ఏ దేవుని భార్యలో, మూడు ముఖపద్మములతోనున్న వాడును, ఏ దేవుడినైననూ తండ్రియని పిలిచినచో ఆ తండ్రికే తండ్రియై పితా మహుడని ప్రసిద్ధుడైన దేవదేవుండగు బ్రహ్మరూపుడగు దత్తుని భజింపుము.

 

25. శ్లో|| శ్రీ దత్తబ్రహ్మ గాయత్రీం -యో గాయే ద్బ్రహ్మకాలికీమ్ |

స బ్రహ్మతేజసా దీప్తో - జ్ఞానీ బ్రహ్మత్వ మశ్నుతే ||

ఈ శ్రీదత్తబ్రహ్మగాయత్రిని ఎవరు ప్రాతః కాలమున బ్రహ్మీ ముహూర్తములో గానము చేయుదురో, అట్టి జీవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచూ జ్ఞానియై బ్రహ్మత్వమును పొందును.

 

26. శ్లో|| శతాయుర్దాయ మాప్నోతి - సర్వవిద్యాః ప్రపద్యతే |

సత్పుత్రం లభతే హోమా - దైశ్వర్యం బ్రహ్మ వీక్షితః ||

ఈ గాయత్రీ గానముచేత శతాయుర్దాయము లభించును. సర్వ విద్యలు లభించును. సత్పుత్రుడు కలుగును. ఈ గాయత్రితో హోమము చేసినచో ఐశ్వర్యము లభించును. బ్రహ్మదేవుని కృపాకటాక్షము వానిపై సదా ప్రసరించును.

 
 whatsnewContactSearch