home
Shri Datta Swami

 10 Jan 2002

ఎర్రని కన్నుల పద్మాల పద్మా

(ప్రతిదినము శ్రీవేంకటేశ్వరుడు పవళింపు సేవ అనంతరము కొండ దిగివచ్చి పద్మావతీ దేవి వద్ద చేరటం - ఇంతలోనే తెల్లవారక ముందే సుప్రభాత సేవకు కొండ మీదికి వెళ్ళవలసి రావటం - అప్పుడు పద్మావతీదేవి శ్రీవేంకటేశ్వరుని ఎడబాటు సహించలేక ఎలా తపించినది అనే కీర్తన ఇది. ఇది పూజలేని భక్తి యని స్వామి చెప్పినారు.)

ఎర్రని కన్నుల పద్మాల పద్మా
వేంకట రమణుని వీడ్కోలు చెప్పె॥ (పల్లవి)

రాలు రక్తరుచి బాష్ప పగడముల।
చెదరి చలించెడి అలకనీలముల।
ఏడ్వగ కనబడు దంత ముత్తెముల।
వణకెడి పెదవుల పల్లవ కాంతుల॥
 
 
కంపించెడి కుచభర హృదయముతో।
వడగాలి వేడి నిట్టూర్పులతో।
పోవలసినదేనా? పరమాత్మా।
గోవిందా ! నా గోవిందా ! యనె॥
 
 
ఒకసారి లేచు ఒకసారి తూలు।
ఒకసారి శయ్యపై బడి పొరలును।
అర్థరాత్రి వరకా? వేచియుంట !।
అని విలపించును గుండె బాదుకొను॥
 
 
ముందుకు వెనుకకు అడుగులు వేయుచు।
వెడలుచు తడబడి కన్నీరొలుకుచు।
పద్మా పద్మా అని రోదించెడి।
గోవిందుని తానవలోకించెను॥
 
 
పది అడుగులు గిరినెక్కియు నిలబడె।
వెనుకకు చూచెను విలపించెను హరి।
క్రింద పద్మ నిలబడి పైకి విసరు।
బాష్ప తోరణములాకర్షింపగ॥
 
 
హనుమయు గరుడుడు ప్రక్కల చేరిరి।
భుజములనెత్తుక బలవంతముగా।
కొండపైకి ఎగిరిరి బ్రహ్మర్షులు।
నిరీక్షణములను చేయుచుండిరని॥
 
 whatsnewContactSearch