సప్త మహర్షులు సంభ్రమ దృష్టులు।
కరముల మానస పద్మములొప్పగ।
వేచియుండిరట పద్మామానసు।
డగు హరి విప్పడు పద్మ నేత్రముల॥
మహతీ వీణను మీటుచు పాడును।
నారదుడచ్చట నారాయణయని।
కాని వనమాలి కర్ణమునీయడు।
పద్మాగళ మాధుర్యము తలచుచు॥
కిన్నర కృతములు మంగళ తూర్యము।
లవిగో మిన్నును ముట్టుచుండెనట।
కలకల నవ్వెడి పద్మావతినే।
స్మరించు ఈశుడు మేల్కొనడాయెను॥
దేవతలిచ్చెడి కర్పూరగంధ।
మేఘములచ్చట ఘుమ ఘుమలాడును।
అయినా హరిమది పద్మాప్రణయము।
దివ్యగంధముల మత్తున మునిగెను॥
అప్సరసలు సరసాంగ నృత్యముల।
ఆడుచుండిరట ఆలోకింపడు।
కృష్ణదత్తుడదె అంతరంగమున।
పద్మ నడకలను కులుకుల చూచును॥
నిన్ను కట్టుటకు భక్తియె మార్గము।
కిటుకును తెలిసితి చిక్కితివిదిగో।
గోవింద దత్త ! గోవిందా హరి !
గోవింద కృష్ణ ! గోవింద పద్మ !॥