తెలవారవచ్చె తెల్లనగు నభము -
తెల్ల కాగితము రీతిచూపట్టె।
మీమీద కవిత నేవ్రాయ ప్రకృతి -
సిద్ధముగఁ జేయు విధముగ తోచు।
సంధ్య రేఖలవె రాగరంజితము -
లక్షర పంక్తులు వ్రాయబడె వరుస।
అనురాగ కలిత గీతల కవితల -
పాడవలె వీటినే రాగముతో॥
నానా పక్షులు నానారాగము -
లందున పాడగ కలకలమదియే।
సంగీత విదుషి పద్మావతిసతి -
లేవనిమ్ము హరి ! రాగాల దిద్ద।
గోవిందనామ నిత్య జప పద్మ -
పద్మాయని హరి నిత్యము జపించు।
విడువదు పద్మయు విడువడు హరియును -
పైన దర్శనము గోవింద నేడు।
ఎత్తుక పోవగ వచ్చియున్నారు -
హనుమయు గరుడుడు బయటకు వచ్చిన।
బయటకె రానీయదు పద్మ నేడు -
బాహు బంధమున బంధించె హరిని॥