01 Feb 2025
భారతయుద్ధము అమావాస్యనాడు ప్రారంభించబడినది అని లోకములో ఒక కథ ప్రచారములో ఉన్నది. అటువంటి లోకములో ప్రచారములోనున్న కథను ప్రమాణముగానే తీసుకుందాము. ఈ కథలో సూర్యచంద్రులను ఒక చోటకు రప్పించి, వారిద్దరి కలయిక ద్వారా చతుర్దశి నాడే అమవాస్యను కృష్ణుడు కల్పించినాడని ఉన్నది. దీని చేత గ్రహములను కూడ పరమాత్మ అధిగమించినాడని బోధించబడినది. ఈ కథ వేదములో లేకున్ననూ ఈ కథ యొక్క సారాంశము వేదములో యున్నది. ఇటువంటి విషయమే గీతలోనూ యున్నది. ‘న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, భీషోదేతి సూర్యః’ అని వేదము. అనగా, పరమాత్మ ప్రకాశము ముందు సూర్యుడు కాని, చంద్రుడు కాని, నక్షత్రాలు కాని ప్రకాశించలేవు. సూర్యుడు కూడ పరమాత్మ యొక్క భయం కారణంగానే రోజూ ఉదయిస్తున్నాడు అని అర్థము. ‘న తత్ భాసయతే సూర్యో న శశాంకో’ అను శ్లోకపాదము ద్వారా పరమాత్మ యొక్క అతి ప్రకాశవంతమైన స్థానాన్ని సూర్య-చంద్రులు కూడ ప్రకాశింపచేయలేరు అంటూ సూర్యచంద్రులను మించినవాడు పరమాత్మయని గీత స్పష్టముగా చెప్పుచున్నది.
మీరెవరైనా అటువంటి భారతయుద్ధ కథ మూలగ్రంథమైన భారతములోనే లేదు అని వాదించవచ్చును. దానికి బదులుగా, అసలు ఈనాటి మీ భారతగ్రంథము సరైన ప్రమాణమని చెప్పుటకు వీలు లేదు అనే అంటాము. ఏలననగా మొదట్లో జయమను పేరు గలిగి 7,000 శ్లోకములు గల భారతమును తరువాతి కాలములో పండితులు 1,25,000 శ్లోకములుగా మార్చినారని వ్యాసభారత వ్యాఖ్యానము ఆదిలోనే వ్రాయబడి ఉన్నది కద.
కావున లౌకికులు రచించిన ప్రక్షేపశ్లోకములు గల ఈ భారతగ్రంథము లోకములో మహాభారత సంబంధమై ప్రచారములో ఉన్న కథలను ఎట్లు ఖండించగలదు? లౌకికులు వ్రాసిన శ్లోకములు గల మహాభారతము స్మృతియైతే లౌకికులు చెప్పిన అటువంటి ఇతిహాస పరమైన కథలు కూడ స్మృతులు అవ్వాలి. లోకములో పుట్టిన ఒక స్మృతి అట్టి మరియొక స్మృతిని ఎట్లు ఖండించగలదు? మూలభారతములో వ్యాసుడు ఈ విషయమును చెప్పలేదు కదా అని మీరు అనవచ్చును. కాని, భారతముతో ముడిపెట్టిన ఈ లోకకథ యొక్క సారాంశము గీతలో, వేదములో ఉన్నది కావున దీనిని మీరు మూలభారతమను స్మృతి చేత కూడ ఖండించలేరు.
ఒకవేళ అట్టి కథ భారతములో లేదని స్వయముగా వ్యాసుడే వచ్చి మీకు చెప్పి ధృవీకరించినాడని అనుకొందాము. అప్పుడైనను భారతమనే స్మృతి, ముందు చెప్పుకున్న వేదసమ్మతమైన కథా సారాంశమును (న తత్ర సూర్యో…) ఖండించలేదు. ఎందుకనగా, ఇతిహాసమైన భారతము కన్నా వేదము పరమ ప్రమాణము. మరియు గీతలో (న తత్ భాసయతే…) కూడ ఇదే సారాంశము ఉన్నది. అప్పుడు వ్యాసభారతము వ్యాసుడు రచించిన మహాభారతములో భాగమైన గీతా సారాంశమును ఎట్లు ఖండించును? తను ఒకచోట చెప్పిన మాటను వేరొకచోట వ్యాసులవారు తనే ఖండించినట్లగును. కావున కథలు నిజమైనవా, కావా అనే వాదాన్ని ప్రక్కనపెట్టి వాటిలోని వేదసమ్మతమైన సారాంశమునే తీసుకొనవలయును.
★ ★ ★ ★ ★