home
Shri Datta Swami

 25 Jun 2025

 

Telugu »   English »  

విష్ణులహరి - 5

పునర్జన్మను ప్రసాదించుట.

అజయ్, స్వామి వారి పరమభక్తుడు. వీరి భార్యయే నాగలక్ష్మి. ఆమె కూడా స్వామి భక్తురాలే. ఈ దంపతులు విజయవాడలోని సత్యనారాయణపురములో సొంత ఇంట్లో ఉంటున్నారు. వారింట్లో స్వామి "బ్రహ్మదత్తుల" చిత్రాన్ని ప్రతిష్ఠించి సేవించుకొనమని ఆనతి ఇచ్చారు. వారింట్లోనే “బ్రహ్మజ్ఞానము” అను గ్రంథమును రచించినారు కూడా. ఇలా ఉండగా ఒకరోజు స్వామి అజయ్ తో "లక్ష్మికి (అజయ్ భార్యకు) నేను చెప్పానని చెప్పుము. దైవధ్యానంలో ఉండమనుము. రథం వస్తున్నది, ఎక్కటానికి సిద్ధం కమ్మని చెప్పు" అని వెళ్ళిపోయినారు. అజయ్ గారు నిశ్చేష్టులయ్యారు. ఆ రోజు రాత్రి లక్ష్మికి యమభటుడు ఇనుప గునపముతో కనిపించినాడు. తెల్లవారుఝామున లక్ష్మి పెద్ద కేకతో కోమాలోకి పోయినది. స్కానింగు తీయగా! మెదడు నరాలు చిట్లి చాలపెద్ద రక్తపు గడ్డ కనిపించినది. “ఇది సెకండరీ స్టేజి, లాభం లేదు” అన్నారు డాక్టర్లు. వైద్యం చేయటానికి కూడా నిరాకరించినారు. అజయ్ వచ్చి స్వామిని శరణముజొచ్చినాడు. స్వామి విభూతి, కుంకుమల నిచ్చినారు. వాటిని పొట్లం కట్టుకొని జేబులో ఉంచుకున్న అజయ్, ఆ దారుణ దుఃఖపరిస్థితిలో ఆసుపత్రికి పోయి వాటి సంగతి మరచినాడు. లక్ష్మి, బయలుదేరిన అజయ్ చేతిని పట్టుకున్నది. ఎంత విడిపించుకున్నా వదలదు! చివరకు విభూతి, కుంకుమలు గుర్తుకురాగా వాటిని లక్ష్మి నుదుటిపై పెట్టగా, లక్ష్మి అజయ్ చేతిని వదిలినది! లక్ష్మి ద్వారా స్వామియే అజయ్ చేతిని పట్టుకున్నానని స్వామి తరువాత చెప్పినారు. స్వామి లక్ష్మికి మరల స్కానింగ్ తీయమని పదే పదే చెప్పగా, మరల స్కానింగ్ తీసినారు. రక్తపుగడ్డ అదృశ్యమైయున్నది! లక్ష్మి మాటలాడ ఆరంభించినది. లక్ష్మిని ఇంటికి తెచ్చినారు. ఆ రోజు స్వామి శయనించిన గది నుండి అర్థరాత్రి రెండు విభిన్న కంఠముల వాగ్వాదము, అజయ్ తండ్రిగారికి వినవచ్చెను. మరునాడు స్వామి తాను కాలభైరవునితో లక్ష్మి విషయములో వాదించినానని చెప్పినారు.

మరునాడు గురువారము. స్వామి “ఈ రోజు నీవు ఆఫీసుకు పోవచ్చును” అని అజయ్ తో అన్నారు. ఆ రోజే లక్ష్మి చకచక నడచినది. స్వామి తనవ్యాధిని అనుభవిస్తారని, లక్ష్మి తనవ్యాధి గురించి స్వామికి చెప్పవద్దని అజయ్ తో చెప్పుచుండెను. కానీ, స్వామి లక్ష్మి వ్యాధిని ఆకర్షించుకొని ప్రతి ఆదివారము కోమాలోకి పోయేవారు. స్వామి నిద్రిస్తున్నారని అందరూ తలచిరి. “నా భక్తుల కర్మ ఫలములను నేను అనుభవిస్తానని ధర్మదేవునితో ఒప్పందం చేసుకున్నాను. కావున కర్మఫలమ అనుభవించనిదే పోదు. నేను కర్మఫలాన్ని రద్దుచేయగల శక్తి కలిగియున్నను, దానిని దుర్వినియోగపరచను. భక్తకర్మఫల భోగార్థమే పరమాత్మ నరావతారమునెత్తుటకు ఒక కారణము. నా శక్తిని ఉపయోగించి కర్మఫలాన్ని అనుభవిస్తూ బాధపడకుండ కూడ ఉండగలను కానీ అది ధర్మదేవుడిని మోసగించుట అగును కావున కర్మఫలభోగములో మీలాగానే నేనూ బాధపడతాను. స్వామి బాధపడుట ఏ భక్తుడూ సహించలేడు. కావుననే నిజమైన భక్తుడు స్వామిని ఏమీ కోరడు. నిష్కామంగా అర్చిస్తాడు" అని ఎప్పుడూ బోధిస్తారు స్వామి. లక్ష్మికి అంతా ఆరోగ్యం కలిగినా చేతికి మాత్రం ఇంక కొంత వ్యాధి ఉండెను. ఆమె పొరపాటున “ఈ చేయి కూడా బాగు చేయండి స్వామీ!” అని అడిగింది అంతే! ఆ కర్మశేషాన్ని స్వామి అనుభవించలేదు. ఆ చేయి పూర్తిగా బాగు కాలేదు. “కర్మశేషం కొంచెం అయినా జీవుడు అనుభవించాలి. ఆ న్యాయమే లక్ష్మిని అలా అడిగేలాగా చేసింది” అన్నారు స్వామి. ఆహా! ఎంతటి నగ్నసత్యం. స్వామి వద్దకు అతిథిగా పోవాలే కాని, బిచ్చగాడిగా కాదు అని స్వామి చెపుతారు గదా.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch