home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ముంచ ముంచ కృష్ణం - వంచకం తమేకమ్‌


ముంచ ముంచ కృష్ణం – వంచకం తమేకమ్ (పల్లవి)

ఓ భక్తా, మోసగాళ్ళకే మోసగాడైనటువంటి ఆ కృష్ణుని వదలివేయి, దయచేసి వదలివేయి!

దత్తాత్రేయం దయావిహీనం – కాశీస్నానం కామవికారమ్ ।
వేదాధ్యయనం వేశ్యా వశ్యం – బ్రహ్మధ్యానం మదిరాలోలమ్ ।।1।।

దత్తాత్రేయునిగా పిలువబడుతూ భక్తుల పట్ల పరమ కరుణను చూపించేదీ ఆయనే, అలాగే అదే భక్తుల పట్ల పరమ నిర్దయునిగా కనిపించేదీ ఆయనే. పాపములను ప్రక్షాళనము చేసే గంగానదిలో స్నానం చేసేదీ ఆయనే, ఆధ్యాత్మిక మార్గమునకు విరోధం కలిగించే కామ వికారాలను కలిగి ఉన్నదీ ఆయనే. ఆధ్యాత్మికతను గురించి, భగవంతుని గురించి బోధించే పవిత్ర వేదములలో పండితుడూ ఆయనే, వేశ్యల వెనుక పడుతూ అనైతికమైన కామమును కలిగియున్నదీ ఆయనే. సమస్త సృష్టికి కారణమైన పరబ్రహ్మము యొక్క ధ్యానములో మునిగేదీ ఆయనే, మత్తెక్కించే మద్యపానము చేసేదీ ఆయనే. ఓ భక్తా, మోసగాళ్ళకే మోసగాడైనటువంటి ఆ కృష్ణుని వదలివేయి, దయచేసి వదలివేయి!

గీతాచార్యం గోపీజారం – మోహతీతం రాధా మోహమ్ ।
ధర్మాధారం పరదధి చోరం – యతి తతి సేవ్యం రాసక్రీడమ్ ।।2।।

భగవంతుని తత్త్వమును, నిష్కామకర్మ యోగమును శ్రీమద్భగవద్గీత ద్వారా సమస్త మానవాళికి బోధించినదీ ఆయనే, రహస్యంగా గోపికలతో క్రీడించినదీ ఆయనే. ఎటువంటి మోహమునకు లోను గానిదీ ఆయనే, రాధాదేవి పట్ల పిచ్చి వ్యామోహమును కలిగినదీ ఆయనే. లోకమున జనులు ఆచరించవలసిన ధర్మమే గోరూపము దాల్చి ఆశ్రయము కొరకు తన వెనుక నిలువగా ఆ ధర్మమునకు ఆధారభూతమైనదీ ఆయనే, గోకులంలో గోపికల ఇండ్లలో పాలు, పెరుగు వంటి పదార్థములను దొంగలించడం ద్వారా ధర్మవిరుద్ధమైన దొంగతనములను చేసినదీ ఆయనే. లోకములో సమస్తమూ వదలివేసిన సన్యాసి, సాధుసమూహములచే భక్తిగా సేవించబడేదీ ఆయనే, రహస్యంగా అర్ధరాత్రివేళ బృందావనంలో గోపికలతో సరస సల్లాపములు, రాసకేళి చేసినదీ ఆయనే. ఓ భక్తా, మోసగాళ్ళకే మోసగాడైనటువంటి ఆ కృష్ణుని వదలివేయి, దయచేసి వదలివేయి!

దిగంబరాఖ్యం పీతదుకూలం – లక్ష్మీనాథం భిక్షుకవృత్తిమ్ ।
వేదాంతానా ముపదేష్టారం – వేశ్యావాటీ పథి సంచారమ్ ।।3।।

శరీరంపై వస్త్రములు ధరించక దిగంబరుడిగా కాన వచ్చేదీ ఆయనే, ధగధగలాడే పట్టు పీతాంబరమును ధరించి కాన వచ్చేదీ ఆయనే. సమస్త సృష్టిలోని ఐశ్వర్యమునకు మూలమైన లక్ష్మీమాతకు భర్త అయినదీ ఆయనే, మాహురీ వంటి క్షేత్రములలో నిత్యమూ భిక్షకు వెళ్ళేదీ ఆయనే. మోక్షమును కలిగించే వేదాంత జ్ఞానమును మనకందరికీ బోధించేదీ ఆయనే, తద్విరుద్ధంగా అజ్ఞానముతో వేశ్యావాటికలలో స్వేచ్ఛగా సంచరించేదీ ఆయనే. మరి ఇంతకంటే పెద్ద మోసం ఉంటుందా? అందుకే వెంటనే మోసగాడైన ఆ కృష్ణ రూపంలో ఉన్న దత్తుని వదలివేయి.

 
 whatsnewContactSearch