నళినీ! నళినీ! నాకర నళినీ!
వేచియుండుము కొంతకాలము (పల్లవి)
నన్ను క్షమించుము కోపగించకుము - ఒక్క మాట విను చెప్పెదనీకు |
నన్నుఁజూచిన క్షణము నందున - అంతః స్వరూప దర్శనమగును ||
స్వామిని చేరి ఐక్యమౌదువు - పంచదారవలె జలమును చేరి |
నీవు చేసే సేవలు కలవు - అవతరింపగ చేసితి నిన్ను ||
కారణ జన్మము నెత్తిన దానవు - నీకు సాధన హాస్యాస్పదము! |
అస్మదీయవు నిత్య ముక్తవు - నీకు మోక్షము సిద్ధ వస్తువు ||
స్వామిని గుర్తు పట్టిన దానవు - పరీక్షలోన గెలిచితివీవు |
ఈ రహస్యమును మనమున దాచుము - అయోగ్యులెపుడు పరిహసింతురు |
అన్యులకేమి తెలియును దైవము? - పద్మ గంధమును ఖరములు తెలియునె? ||
నావెంట వచ్చు నను దూషించుచు - మేనత్త కొడుకు మాశిశుపాలుడు |
దంత వక్త్రుడు హిరణ్యకశిపుడు - వీరలచట నా ద్వార పాలురె! ||
ప్రతి నాయక రహిత చలన చిత్రములు - కారములేని వంటలు గావే? |
నాకర పద్మము నీకు పీఠము! - పద్మాదేవికి నీవు పీఠము! ||
నా హృత్కమలము సాక్షాత్తు నీవు - నీ లోన కమల కూర్చొని యున్నది |
ఆఘ్రాణించును స్వామి నిత్యము - ఎంతో ప్రీతిగ నిన్నుఁ జూచుచు ||
దీనిని మించిన భాగ్యము కలదే! దేవ దేవతలు ఋషులకు నైన |
నీపై శ్రీపతి కన్నులు రెండు - భ్రమరములెప్పుడు భ్రమించుచుండు! ||
నందక ఖడ్గము నీ సోదరుడే - అన్నమయ్య ఇట అవతరించెగద |
షట్చక్రములును షట్కమలములే - యోగసాధన నీ సొంత సొత్తు |
నీ మధుర భక్తి దివ్య సుగంధము - వేణు గీతముల పాడించినది ||