అనఘా! వచ్చితి నెన్నో సార్లు |
ఈ మధ్య కాలమందున నేను || (పల్లవి)
1. శ్రీ పాద వల్లభ నామమున - వచ్చి పరిస్థితి చూచితిని |
శ్రీ నరసింహ సరస్వతిగా - అవతరించితిని మహిమల జూపితి ||
2. ధర్మ బోధలను చేసితినీ - గురు తత్త్వమును బోధించితిని |
సంప్రదాయమును పలికితినీ - విశ్వాసము రక్షించితిని ||
3. మాణిక్యపురిని ప్రభువుగ వచ్చితి - గద్దె నెక్కి శాసించితినీ |
స్వామి సమర్ధుడనై మరలను వచ్చి - తత్త్వమును నుడివితినీ ||
4. షిరిడీ గ్రామము నందునను - సాయిగ వచ్చితి చెప్పితినీ |
దైవ వాక్యమునన్నిటినీ - సోదాహరణము పలుకులతో ||
5. పర్తియందు విలసిల్లుదును - శ్రీ సత్య సాయి నామముతో |
భజనల పాడుచు తత్త్వమును - వివరించుచు సర్వ జనులకు ||
6. ఎన్నో రూపములందు భువిన్ - గురు రూపములను దాల్చితినీ |
దత్త వేదమును పలికితినీ - దత్త గీతలను వ్రాసితినీ ||
7. గోపీ గీతల పాడితినీ - కృష్ణ దత్తునిగ రసఝరులన్ |
ఙ్ఞాన భక్తులను చూపితినీ - కంఠ శోషయే మిగిలినది ||