వినరా ఓ జీవా ! దత్తుని కనరా ఓ జీవా !
నరాకారుడు నరుల కోసమె పాడుచున్నాడు || (పల్లవి)
చింతల బురదల మునుగుచునుందురు జీవవరాహము లోయన్నా
నీ ప్రేమసుధల తెలియగలేరిల వీరలగతి ఇంతేనన్నా |
దారాతనయుల, ధనముల తపనలు చిట్టచివరివరకోయన్నా
కాలకింకరులు ఎదురుగ నిలువగ మొత్తుకొందురపుడోయన్నా
ప్రయాణమగునెడ ధనములు సుతులును రక్షించలేరు రామన్నా
నీప్రేమామృత నామగానమే రక్షించగలదు రంగన్నా |
ఆశాపాశము మొదలును చివరను లేనిది చుట్టును కృష్ణన్నా
కంఠమునందున కాలుడులాగగ ఉచ్చుబిగియునో దత్తన్నా |
చెప్పలేదనుచు చెప్పకుండుటకు చెప్పితినిప్పుడు కొండన్నా
చెప్పిన చెప్పక యున్నను ఒక్కటె బాధ్యత తీరెను హరియన్నా ||
నేనను భావమె బ్రహ్మరాక్షసుడు మూలబీజమదె బ్రహ్మన్నా
నాకనుకోరిక బ్రహ్మరాక్షసియె వానిభార్యయగు విధి అన్నా |
నావారు నావి అనుభావంబులు వారల సంతతి వెంకన్నా
ఈ కుటుంబమే నరులను గృహముల నివసించుచుండు హరియన్నా |
భగవద్గానమె వారల నెపుడు పారద్రోలునిల మల్లన్నా
గానమునాపిన మరల చేరుదురు వారలయిళ్ళను రుద్రన్నా ||
కర్తవ్యంబుల మానుకొమ్మనవు వేదాంతంబులు వెంకన్నా
విశ్రాంతి విడిచి భజన బోధించవవియు హరియన్నా |
కర్తవ్యంబులు విశ్రాంతి పోను మిగిలిన సమయమె బ్రహ్మన్నా
చాలు చాలు నీ కరుణను పొందగ నరుడు తరించగ మల్లన్నా |
వ్యసనము లందున కాలశక్తులవి వ్యర్ధము లయ్యెడి రామన్నా
ఆ కాలశక్తి నీ కర్పించిన చాలు చాలు గద కృష్ణన్నా |
వ్యర్ధ భాషణము చలనచిత్రములు నవలల చదువుట దత్తన్నా
వ్యసనము లివియే ఇహపర దూరము లివె పిశాచములు మూడన్నా |
రంభయు మేనక ఊర్వశి యనగా అప్సరసలివియె కొండన్నా
నిను చేరు తపము నంతము జేసెడి మారు రూపములు ఇవెయన్నా ||
పాఠము చెప్పుచునుండగ గురువిట సాయము చేయును వెంకన్నా
పరీక్ష వ్రాయగ సాయము చేయడు కఠినతనుండును హరియన్నా |
మర్త్యలోకమున అవతారమెత్తి బోధించు నెపుడు మల్లన్నా
పరలోకములో విచారణ సేయ పరుషుడు పలకడు రుద్రన్నా |
ఇచ్చట ఇప్పుడె వాని వాడుకొన యుక్తము నరులకు కొండన్నా
కాలము దేశము మారిపోవునెడ తారుమారగును దత్తన్నా ||
హంస లేవగనె అచటకు వత్తువు పదిదినములుండ ఓరన్నా
సింహాసనమున ఆసీనుడైన నన్ను చూచెదవు ఓరన్నా |
మనస్వామి యనుచు సంతోషింతువు పరిస్ధితి వేరు ఓరన్నా
కాలభైరవుని నొప్పించలేను పక్షపాతమున ఓరన్నా |
నిష్పక్షపాతముగనే తీర్పును జీవులకిచ్చెద ఓరన్నా
న్యాయాధిపతిగ నన్ను చూచెదరు నిర్నిమేషులే ఓరన్నా |
నేను చెప్పినది ఇచ్చట చేయక అచ్చట నిలచిన ఓరన్నా
నేనేమి సేతు నానియమునకు నేనె బద్ధుడను ఓరన్నా |
సేవల నందిన కృతఘ్నుడనుచు నన్ను దూరకుము ఓరన్నా
నీ సేవ ఫలమె బోధించుచుంటి నీవెంటబడుచు ఓరన్నా |
ఇంత విపులముగ చెప్పలేదు ఏ అవతారమునను ఓరన్నా
తెలిసియు తెలియనివానిగ నీవిట నటించబోకుము ఓరన్నా ||
సృష్టి స్ధితి లయ కారణ మొక్కటె బ్రహ్మమని చెప్పు బ్రహ్మన్నా
వేదములన్నియు, వేరు వేరుగనె త్రిమూర్తులుండగ హరియన్నా |
సృష్టికి బ్రహ్మము స్ధితికిని విష్ణువు లయమునకు హరుడు వెంకన్నా
వేరువేరుగనె కనపడుచుందగ బ్రహ్మము ఒకటె ఎట్లన్నా |
అని ఆలోచించిరి తపముల చేసిరి ఋక్షశైలమున రుద్రన్నా
ఋషులు మహర్షియు అత్రియు తపించ త్రిమూర్తులు వచ్చిరోయన్నా |
బ్రహ్మము ఒక్కటి మీరు కాదనుచు వాదించెనత్రి దత్తన్నా
త్రిమూర్తి ముఖముల దత్తుడు బ్రహ్మమె గోచెరించెనట హనుమన్నా |
ఒక్కవ్యక్తియగు దత్తుడు ఒక్కటె బ్రహ్మమె శ్రుతి సరియేనన్నా
మూడు ముఖములవి మూడుపనులిట చేయును ఒక్కడె గరుడన్నా |
వేద సమన్వయమయ్యెను దత్తము దత్తమనె అత్రి శేషన్నా
దత్తము బ్రహ్మము చిక్కెననియెగద దత్తపదార్ధము గణపన్నా|
వేదప్రమాణ సిద్ధ బ్రహ్మము దత్తుడొకడే లలితమ్మా
అన్యరూపముల వేద సమన్వయ మెట్లు కుదురునో దుర్గమ్మా ||
దారా పుత్రుల సహజముగ నెట్లుప్రేమించెదవో ఓరన్నా
అట్లే నాపై సహజ సత్య ప్రేమనుంచుమిల ఓరన్నా |
కాల దేశములు విధానములేదు సత్యప్రేమల ఓరన్నా
ఎప్పుడు ఎచ్చట ఏవిధినైనను ప్రేమవ్యక్తమగు ఓరన్నా
తమ సుఖసాధనమగు నిను తమకై ప్రేమింతురిలను ఓరన్నా
దారా పుత్రులు సైతము స్వార్ధమె లోక బంధములు ఓరన్నా |
నీ నుండి పొందవలసిన దేమియు స్వామికి లేదిల ఓరన్నా
నీకొరకై నిను ప్రేమించు స్వామి నిస్వార్ధుడతడు ఓరన్నా |
చలన చిత్రనటు డంతమునొందగ వీరాభిమాని ఓరన్నా
ఆత్మదహనమును చేసుకొనెనొకడు భక్తిమార్గమదె ఓరన్నా |
నటుని నుండి నొక పైసయు పొందక స్వధనమె వ్యయించె ఓరన్నా
నటుని ఆర్జితము నంతయు మ్రింగిరి వాని భార్య సుతులోరన్నా |
నటునే దహనము చేసిరి చావగ సిద్ధము కారిల ఓరన్నా
వీరలె స్వామికి వేశ్యాభక్తులు స్వార్ధపూజలివి ఓరన్నా |
వీరాభిమాని మార్గమె గ్రాహ్యము లక్ష్యము తప్పక ఓరన్నా
లక్ష్యము స్వామిని చేయుము మార్గమువానిదె ఉత్తమ మోరన్నా ||