home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

తుంచుము తెంచుము చూర్ణము చేయుము

శ్రీదత్త పరమార్ధ సుబోధక పద్యావళి

1. తుంచుము తెంచుము చూర్ణము చేయుము కాల్చుము మాడ్చుము కోరికలన్
నిర్మల భక్తిని సంపాదించుము స్వామిని కట్టెడి  బంధమదే
జపములు తపములు  భజనలు పూజలు కామకృతంబులు వ్యర్ధములే
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

2. భగవద్గుణముల ఆకర్షణతో ఆరాధింపుము దత్తగురున్
ఇచ్చట కోర్కెలు కర్మసుసాధ్యములచ్చట సాయము కావలెయున్
ఎవ్వడు నిను గుర్తించడు నిష్క్రియతో నట భీతిలి ఏడ్చెదవు
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

3. నీకై  వచ్చెడి అతిధిగ నిష్కామార్చన జేయుము నిత్యమిలన్
భిక్షుక భోజన లక్ష్యముమానుము కసరును నిన్నును దేవుడిటన్
అతిధికి సర్వ సపర్యలు వరములు నీకును కోరిక లేనియెడన్
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

4. స్వామికి సిద్దులు సొమ్ములు వాటిని కోరెడి భక్తులు వేశ్యలిలన్
అవినాభావిగ నుండును ఙ్ఞానము సౌందర్యముగా తత్పరలౌ
కుల వధువుల వలె తన్మయ దృష్టులు సద్భక్తులు  శ్రవణైక పరుల్
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

5. నైమిశ వనమున గురుపీఠాసన మందున ఆసీనుండగుచున్
ఋషులును సిద్ధులు సురలును ప్రణతులు సేయగ సర్వజగ ద్విభుడై
వాణియు లక్ష్మియు గౌరియు ప్రియసతులై కొలవగ నా నందముతో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

6. సర్వజగత్తుకు కర్తయు భర్తయు తానొక్కండగుచున్
వేదము చెప్పిన లక్షణపూర్ణ సమన్వయ మిచ్చటనే జరుగన్
దత్తుండొకడే బ్రహ్మము దేవతలందరు దత్తుని వేషములే
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

7. బ్రహ్మహరీశ్వర ముఖముల జగముల జనిధృతిలయముల తానొకడే
చేయును సృష్టిస్దితి లయ కారకు లామూర్తులుగా ప్రసిద్ధి గదా
ముమ్మూర్తులలో వ్యక్తిగ వేషియు నటుడగు మూల విరాట్పురుషా
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

8. శంఖము చక్రము ఢక్కయు శూలము కుండియు మాలయు హస్తములన్
నాలుగు వేదములును శునకములుగ ధర్మము గోవుగ వెంటబడన్
నానాஉஉకృతులనుఁ దాల్చుచు బోధలఁజేయుచు వసుధా సంచరుడై
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

9. అనసూయాత్రుల తపముల మెచ్చియు దత్త సుతుండగు దత్తుడిలన్
కోరికలేకయె సేవలఁజేసిన భక్తులకును దత్తుండగుటన్
కనుగొనతరమె? స్వామిని మాయనుఁ గప్పుచు నిల క్రీడించునుగా
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

10. చిక్కని వారికి చిక్కును చిక్కిన వారికి జారును చిక్కడిలన్
క్షణమునఁ దోచును క్షణమున మాయను కన్నులఁగట్టును గంతలుగా
జగతిని చూచుచు సాక్షిగ జగతినిఁ జొచ్చును మాయావేషముతో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

11. మార్గశిరంబున పూర్ణిమ రోజున మొదటిగ నత్రియె చూచెనుగా
దత్తుడు  త్రిముఖంబులతో షట్కరములతో నిలచెను వ్యోమమునన్
షోడశ వర్ష వయోధరుడై  త్రిజగన్నవమోహన  సుందరుడై
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

12. సిద్ధుల జూపుచు నాస్తికు నాస్తికునిగ  మార్చుచు ప్రారంభమునన్
క్రమముగ బోధలఁ జేయుచు పామరులకు పామర సంభాషణుడై
పండిత భాషల పండితులకు బోధించును శ్రుతి సిద్ధాంతములన్
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

13. సృష్టి స్దితి లయ పునరావృత బిందువుల న్మధ్యమమేదియనన్
బిందుత్రయ మధ్యమమేదయన న్సరియగు మూర్తి త్రైతములో
విధిముఖ మధ్యము హరిముఖ మధ్యము శివముఖ మధ్యము నొక్కొకచో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

14. శంకర రామానుజ మధ్వాచార్యుల మతగురు  రూపంబులతో
ప్రస్ధానత్రయ భాష్యములను వ్రాసిన వేదాంతాచార్యునిగా
గంగా యమునా సరస్వతీత్రయ సంగమ తీర్థ ప్రయాగసమా!
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

15. షోడశ కళలను షోడశ రూపము లెత్తుచు మాయనాటకుమున్
అవత్తరంబులతో నాడించుచు నందియు నందక లీలలతో
నిత్యవినోదిగ నమ్మినవారికి నొసగుచు సేవాభాగ్యములన్
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

16. భార్గవ షణ్ముఖ గురుడును శంకరదేశిక కుల చాదస్తములన్
పోగొట్టగ తా చండాలుండై  ఎదురుగ కాశీ వీధులలో
నాలుగు కుక్కలతో కనపడి బోధించిన అవధూతాగ్రసరా
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

17. దత్తుండొకడే బ్రహ్మగ సృష్టిని విష్ణువుగా పరిపాలననున్
శివునిగ లయమును చేయుచునుండును త్రిమూర్తులాయన వేషములే
బ్రాహ్మము శైవము వైష్ణవమనునది పామర మతమిది తెలిసినచో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

18. శ్యామకమల నయనుండగు హరిగా నింద్రుడు చూచెను పులకితుడై
పింగళనాగుడు శంకర రూపిగ బదరీ సిద్దులు బ్రహ్మతనున్
త్రివదన షడ్బుజ రూపము నత్రియ మనుజులు మాయా రూపములన్
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

19. బాహుసహస్రము నష్ట విభూతుల  హైహకులజున కిచ్చితివీ
భోక్తగ వచ్చియు విష్ణుదత్త  పితృదేవతలం గడ తేర్చితివీ
నా కొరకై కరుణారస సాగర ఏ రూపముతో వచ్చెదవో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

20. హే కమలాసన ! హే కమలేక్షణ ! హే కమలాస్త్రవపుర్దహన
హే శృతి బోధిత పూర్ణ సమన్విత లక్షణ లక్ష్య బ్రహ్మతనో
త్వాం ప్రణమామి పునః ప్రణమామి పునః ప్రణమామి చ దత్తవిభో
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

21. జ్ఞానం దిశ భక్తిం దిశ యోగం దిశ తే సేవాకర్మ దిశ
కామంహర కోపంహర లోభమదమోహమాత్సర్యం హర మే
శరణం భవ భవతరణం భవ కరుణా కిరణా వరణో భవ మే
జయజయహే పరమార్థ సుబోధక!  సత్యనిరూపక!  దత్తగురో!

 whatsnewContactSearch