home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఓ కృష్ణ దత్తుడా! మేలుకో


ఓ కృష్ణ దత్తుడా! మేలుకో మేలుకో
శ్రీ కృష్ణ దత్తుడా! సుప్రభాతము నీకు (పల్లవి)

1. నీ చూపులెన్నెన్నొ రాగాల పలికించు |
అనురాగమే నీవు ఆకారమైనావు |
మా చూపులకు ప్రాణ దానమును చేయగల |
నీ చూపులను మాకు దయ సేయుమా ఇంక ||

2. రుక్మిణీ వక్షోజ కస్తూరి నీ యెదను |
నీ రంగులో కలిసి పోయెనుగ సిగ్గేల?
భామ పెదవుల లాక్ష రక్త వర్ణము గూద |
నీ పెదవి రంగులో కలిసి పోయెనులెమ్ము ||

3. నలిగిపోయినది నీ పీతాంబరము గూడ |
రాధికాలింగనము రట్టు చేయదు లెమ్ము |
నిద్రలోనటునిటును పొరలంగ నందరికి |
వస్త్రాలు నలుగునని భావించుదుములెమ్ము ||

4. నీ తనువు కందినది గొల్లభామల రాత్రి |
అలరింపగా యనుచు అనుకొనుము లెమ్మురా |
హంసతూలిక కన్న సుకుమార గాత్రంబు |
నిద్రలో కందినది అని తలుచుదుము లెమ్ము ||

5. మంగళ స్నానమును నీ చేత చేయించ |
నీ అష్ట సతులిచట సిద్ధమై యున్నారు |
నెమలి పింఛమును సరి చేసికట్టగ నీకు |
మీరకే తెలియుగా నామెయును వచ్చినది ||

6. రాగాంశువులు నీలమేఘ గర్భము నందు |
దాగినవి యిపుడిపుడె ప్రకటితములగుచుండె |
ఓ నీలవర్ణుడా! నీలోనదాగినవి |
రాగభావములెన్నొ ప్రకటించవేలరా ||

7. రాత్రియును పగలుగల మిశ్రమము యీసంధ్య |
ప్రేమయు ఙ్ఞానంబు కలబోయగా నీవె |
ఓ వేణుగోపాల! నీ ప్రేమదేవతయె |
నిజకంఠమున పాడ నీ మురళిగానమౌ ||

8. ఓ ఙ్ఞానసాగరా! గురుదత్త దేవుడా! |
ఓ ప్రేమ హిమశైల! శ్రీ కృష్ణనామకా! |
ఙ్ఞానులగు బ్రహ్మర్షులే నిన్ను ప్రేమించి |
గోపికల రూపముల నిలచియున్నా  రిచట ||

9. యోగీశ్వరా! దత్త! ఉపనిషత్కర్తలే |
నీ గీతలను పాడుచున్నారు శ్లోకముల |
భోగీశ్వర! కృష్ణ! గోపికలు  గాఁబుట్టి |
నీ ప్రేమ నీఅంద మందుకొన వచ్చిరిట ||

10. అవతరించితివి మా కోసమే శ్రీ దత్త !
మా కనులు చూడగల కృష్ణ రూపంబుతో |
యోగిరాజా! నీ స్వరూపంబు ప్రకటించ |
కోటి సూర్యుల కాంతి జగమంత మాయమౌ ||

11. నీలజలధిని కలియు నీల యమునయె ధన్య |
తుమ్మెదను నిను బట్టు పద్మమే ధన్యంబు |
పురుషోత్తమా! నీవె పురుషుడవు జీవులిట |
ప్రకృతి బిందువులు నీ భార్యలగు భామలే ||

12. పాలమీగడ వెన్న తిన్న నీ అంగముల |
పూలమాలలు కూడ జారునవె సుకుమార!
నీ సుందరాకారమును చూచి తాపసులె |
స్త్రీ జన్మలను పొంది రాసకేళినిఁ బడిరి ||

13. మన్మధుని అబ్బవే! సౌందర్యమున గూడ|
కాలాంతకుని గూడ కల్లోల పరచితివి |
కమలలోచనముల నీవు మెల్లగ తెరువ |
పంచ శరముల వృష్టి ముంచినది భామలను ||

14. గోవింద! గోపాల! గోపికాలోలుడా! |
నిన్ను చూచిన కాని ఆవులీయవు పాలు |
నినుజూడనవి నిండు పాలతో భాండములు |
క్షీరసాగరమంత నీ వెంట వచ్చినటు ||

15. అరవిందలోచనా! కందర్ప సుందరా! |
బృందావనానంద మందార మకరంద! |
మందస్మిత స్యంద కుందేందు కరబృంద! |
ఇందీవరశ్యామ! ఇందిరా మందిరా! ||

16. హే పూర్ణచంద్రాస్య! హే పల్లవాధరా! |
హే కమలలోచనా! హే ముగ్ధ మోహనా! |
హే ఘనశ్యామలా! హే పించధారణా! |
శ్రీ వేణుగోపాల కృష్ణ దత్త ప్రభో! ||

 
 whatsnewContactSearch