home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త దేవునిపై పిచ్చి ప్రేమ


దత్తదేవుని పిచ్చి ప్రేమతో నీ నిత్య సాధన తపము సాగించు
భక్తా! నీ నిత్య సాధన  తపము సాగించు                 || దత్తదేవుని||

ప్రేమతోడ తన కృష్ణుని తలచుచు - నిత్య ధర్మముల సంన్యసించిన
అట్టి రాధకే భక్తి యోగమున - అందరాని గోలోక మందెనే!                            

తల్లిదండ్రులును పతులును సతులును - తనయులు తనయలు సర్వ బంధువులు
తెగితెగి పోవగ బంధములన్నియు - భగవద్భంధము ఒక్కటియె మిగుల          

దిక్కులలో ఎటు చూచిన గానీ - పరమాత్ముండే కనిపించుచుండు
అన్నపానములు నిద్రయు నుండవు - ప్రతి నిమిషంబును దత్తదేవుడే             

పరువు మర్యాద ధర్మము నరకము - సంప్రదాయములు పాపభీతియును
ఉల్లంఘించిన ఉన్మాదముతో - వ్రజవనితల వలె జీవించుచుండు              

నిత్య ధర్మముల చేయనందులకు - లోకులు కాకులు పలురీతులుగా
కూయుచుండినను లెక్కింపకయే - లోక సంగమును పూర్తిగ వదలిన      
        
గజములు త్రొక్కిన పాములు కరచిన - సాగరమందున ముంచి వేసినను
శ్రీ మన్నారాయణ యను యను మంత్రము - విడవని ప్రహ్లాదుని వలె నుండుచు
         
పరమాత్మ కనుల రక్త ధారలను - చూడగ ఏడ్చుచు రెండు కన్నులను
బాణము కొసతో పెకిలించి నట్టి - తిన్నని ప్రేమయె ఆదర్శముగా              

బృందావనమున  మండు టెండలో - ఇసుక రేణువుల నిప్పుల కణముల
నడచుచు  మాధవ మాధవ యనుచును - విలపించి రాధ ప్రాణము విడచెను          

స్వామి కోసమై ఏకైక సుతుని - శిరియాళుడు  తమ చేతుల చంపియు
వండినట్టి ఆ తల్లి దండ్రులే - భక్తియోగమున పరాకాష్టగా!        

తల్ల్లిని విడచిన బాలశంకరుడు - తండ్రిని విడచిన ప్రహ్లాద శిశువు
భార్యాపుత్రుల రాజ్యము విడచిన - బుద్ధదేవుడే నీ ధ్యేయముగా 

ముత్యాల హార మిచ్చిన గానీ - రాముడు లేడని కొరకుచు విసరెను
నఖముల హృదయము చీల్చి చూపెగా - శ్రీ రాముని హనుమంతుడటులనే

 
 whatsnewContactSearch