home
Shri Datta Swami

 30 Jun 2002

అత్రి పుత్ర! దత్త దేవ!

అత్రి పుత్ర! దత్త దేవ! (పల్లవి)

ఓ అత్రి కుమారా! భగవంతుడైన స్వామీ దత్తాత్రేయా!

అత్రి పుత్ర! దత్త దేవ! – శ్రుతి పవిత్ర! సచ్చరిత్ర!

 ఓ అత్రి కుమారా! భగవంతుడైన స్వామీ దత్తాత్రేయా! పవిత్రములైన వేదములనే పరమ పవిత్రములుగా మార్చువాడా! సృష్టిలోని సమస్త మానవులు అనుకరించి అనుసరించవలసిన చారిత్ర్యము గలవాడా!

కేళి చిత్ర! పుత్ర మత్ర! – త్రాహి మాం శతపత్ర నేత్ర!

 సృష్టిలోని సమస్త జీవులతో రకరకములుగా క్రీడించి ఆనందించేవాడా! ఓ కమలముల వంటి కన్నులు గల అందమైన స్వామీ, నీ సంతానము వంటి నన్ను దయతో రక్షించు.

అజ్ఞాన తిమిర భేద పద్మమిత్ర! – ప్రజ్ఞాన చిదనఘా సత్కళత్ర!

 ఓ జ్ఞానసూర్యుడా! అంధకారమనే అజ్ఞానమును పారద్రోలేవాడా! ఘనమైన ప్రజ్ఞానము, మహా చైతన్యమును కలిగి అనఘామాత యొక్క భర్తగా ఉన్నట్టివాడా!

విజ్ఞాన రూఢ తత్త్వ సుధాపాత్ర – సుజ్ఞాని మానవార్ధ ధృత మానవ గాత్ర!

నిశితమైన తార్కిక విశ్లేషణతో ఆధ్యాత్మిక విజ్ఞానమనే తత్త్వామృతమును ఆధ్యాత్మిక జ్ఞానము పట్ల శ్రద్ధతో ఉన్నవారికి అందజేసేవాడా! సుజ్ఞానులైన మానవుల కొరకు మానవ శరీరాన్ని ధరించి, మాలో ఒకరిగా వచ్చి, మమ్ములను పరమ కరుణతో ఉద్ధరించేవాడా!