home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కాషాయ చేల! కపర్ద కాల!


కాషాయ చేల! కపర్ద కాల!
నతోఽస్మి దత్త! కరుణాచిత్త! (పల్లవి)

ఓ కాషాయ వస్త్రము ధరించినవాడా! ఓ శిరస్సుపై నల్లనైన జటాజూటము కలిగినవాడా! ఓ కరుణారస హృదయుడా! హే దత్తా! నీకు వినయంతో ప్రణమిల్లుతున్నాను.

సువచన గీత జ్ఞాన భక్త్యా ।
క్రియా ఫలాశా వేశ్యాభక్తిః ।।

నింద్యమైన వేశ్యాభక్తియే వ్యభిచార భక్తిగా చెప్పబడుతుంది. ద్రవ్యరూపంగా ఖర్చు పెట్టక, క్రియాయోగ రహితంగా (సంభూతి ఉపాసనా రహితంగా), కేవలం భక్తి, జ్ఞానములతో కూడిన పాటలు పాడి, భజనలు చేసి స్వామినుండి భక్తుడు ద్రవ్యరూపమైన ఫలములను రాబట్టాలని ఆశించడమే వేశ్యాభక్తిగా తెలుసుకోవాలి. ఒక వేశ్య కూడ చాలా తెలివిగా మాట్లాడి, తియ్యగా ప్రేమ పాటలు పాడి విటులనుండి ద్రవ్యరూపమైన డబ్బును ఆశిస్తుంది.

క్రియా ఫలాభ్యాం క్రియా ఫలాని ।
క్రయ విక్రయతా వైశ్యభక్తిః ।।

క్రియారూపమైన భక్తితో స్వామికి తనకున్నది సమర్పించి ఆయన నుండి క్రియారూపమైన ఫలములను ఆశించడమే వైశ్యభక్తి లేక వ్యాపారభక్తి. ఇది వేశ్యాభక్తికన్నా కొంత నయము. ఎందుకంటే, ఒక వ్యాపారి ద్రవ్యరూపమైన డబ్బును తీసుకొని బదులుగా మనకు కావలసిన ద్రవ్యరూపమైన వస్తువునిచ్చినట్లుగా భక్తుడు తనకు కావలసిన ఫలమును పొందుటకై కొంత ద్రవ్యమును ఖర్చు చేసి తద్ద్వారా భగవంతుని నుండి ద్రవ్యరూపమైన ప్రతిఫలమును ఆశిస్తాడు. ఇటువంటి వైశ్యభక్తి క్రయ-విక్రయ రూపమైన వ్యాపారము కన్న వేరొకటి కాదు.

సంతానార్థం క్రియా ఫలాని ।
వినా ఫలం యదపత్య భక్తిః ।।

తల్లిదండ్రులు తమ పిల్లలనుండి ఏమీ ఆశించక, నిష్కారణమైన ప్రేమతో సర్వస్వం సమర్పించినట్లుగా భగవంతుని నుండి ఏమీ ఆశించక అట్టి నిష్కారణ భక్తిని కలిగియుండటమే అపత్యభక్తి అనబడుతుంది. త్రివిధ భక్తిరూపాలలో ఇదే అత్యుత్తమమైన అతి విశిష్టమైన భక్తి. తమ పిల్లలకిచ్చేది భవిష్యత్తులో తమకేదో రూపంలో తప్పకుండా తిరిగి వస్తుందనే ప్రతిఫలాశ లేకుండగా, నిష్కారణంగా వారికి ప్రేమతో సేవ చేసి, కష్టపడి సంపాదించిన సర్వస్వమూ తల్లిదండ్రులు సమర్పించినట్లుగా, భక్తుడు భగవంతుని నుండి ఏ ప్రతిఫలమునూ తిరిగి ఆశించక కర్మ సంన్యాసము (స్వామికి తన యోగ్యతననుసరించి సేవ చేయడం), కర్మ ఫల త్యాగములను (స్వామికి తన కర్మ ద్వారా సంపాదించిన ధనం సమర్పించడం) క్రియాయోగంతో, సంపూర్ణంగా స్వామికి నివేదించడమే అపత్యభక్తిగా పిలువబడుతుంది.

 
 whatsnewContactSearch