home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

హే దత్త! వైశ్వానరాగ్నే!


హే దత్త! వైశ్వానరాగ్నే!
హోతాఽసి హవనీయ ఏవ (పల్లవి)

ఓ దత్త! వైశ్వానరాగ్నిగా పిలువబడే క్షుధారూపుడా! హోత అనబడే నీవు అగ్నిలో నేతితో కూడిన అన్నమును సమర్పించే ఋత్విజుడవే కాక వైశ్వానరాగ్ని రూపముతో, నేతితో వండిన అన్నమును స్వీకరించెడి హవనీయము  కూడ అవుతున్నావు. అనగా, ‘హోత,’ ‘హవనీయము’ అనే రెండు తత్త్వములు కూడ ఒక్కడైన దత్తుడే అగుచున్నాడు.

ఋగ్వేదస్య ప్రథమ మంత్రమ్,
యో వేత్తి స ఖలు యజ్ఞవేత్తా ॥

వేదములలో మొదటిదైన ఋగ్వేదంలోని మొదటి మంత్రమును, ఎవడైతే సరిగా అర్థం చేసుకుంటాడో అతడే సంపూర్ణ యజ్ఞ ప్రక్రియను సరిగా అర్థం చేసుకున్న వాడిగా చెప్పబడతాడు.

{ఋగ్వేదములోని ‘అగ్నిమీళే పురోహితమ్.., హోతారమ్..’ అనే మొదటి మంత్రము ‘హవనీయమ’నబడే అగ్నియే హోతయని (హవన కర్తయని) చెబుతోంది. కాని, జడరూపమైన అగ్ని తనే హోత మరియు తనకు తానే ఘృతంతో వండిన అన్నాన్ని సమర్పించుకునే వ్యక్తియో కాలేదు. ఈ సందర్భములో ‘అగ్ని’ శబ్దమునకు సరైన అర్థము జడమైన అగ్ని కాజాలదు కావున అట్టి అర్థమును ఇక్కడ గ్రహించరాదు. తన ఉదరమందు వైశ్వానరాగ్నిని కలిగిన, తనకు తానే ఘృతాన్నాన్ని సమర్పించు కొనగలిగిన, స్వతంత్రుడైన, ఆకలిగొన్న, ఋత్విజుడే ఇక్కడ ‘అగ్ని’ శబ్ద వాచ్యుడని తెలుసుకోవాలి. భగవంతుడే వైశ్వానరాగ్నిగా ప్రాణులలోని ఆకలి రూపంలో ఉన్నాడని, ‘అహం వైశ్వానరో భూత్వా..’ అనే శ్లోకం ద్వారా శ్రీమద్భగవద్గీత కూడ చెబుతోంది.}

ఘృతం ఘృతాన్నం క్షుధా మగ్నిమ్ ।
యో వేత్తి స ఖలు యజ్ఞవేత్తా ॥

ఎవడైతే ఘృతములో (నేతిలో) సంస్కరించబడిన అన్నమునే ‘ఘృతము’ అంటారని, ఆకలిగొన్న వాని యొక్క క్షుధాగ్నినే ‘అగ్ని’ అంటారని తెలుసుకుంటాడో వాడే యజ్ఞప్రక్రియ యొక్క సరియైన అర్థమును తెలసికొన్న ఋత్విజుడు లేక పండితుడు అనబడతాడు.
{బుట్టలో ఆపిలు పండ్లను అమ్ముతున్నవాడిని చూచి, ‘ఓ ఆపిలు పళ్ళూ’ అని పిలిచినట్లుగా ఎక్కువ నేతితో వండిన ఆహారమే ఘృతమని ‘లక్షణ’గా లేక ‘లాక్షణికము’గా పిలువబడుతుంది. శబ్దము యొక్క ప్రాథమికమైన వాచ్యార్థమును వదలి రెండవదైన వ్యంగ్యార్థమును గ్రహించడమే శాస్త్రంలో ‘లక్షణ’ అని చెప్పబడినది.}

పాక సాధనాగ్నిం అన్నసూక్తమ్ ।
యో వేత్తి స ఖలు యజ్ఞవేత్తా ॥

యజ్ఞములో ఆహారం వండుటకు ‘భౌతికాగ్ని’ లేక ‘లౌకికాగ్ని’ మరియు ‘వైద్యుతాగ్నిగా’ పిలువబడే జడమైన అగ్నియే పాక సాధనము అని తెలుసుకోవడమే గాక వేదములోని ‘అన్నసూక్తము’ను గూడ సరైన అర్థముతో ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ఋత్విజుడు లేక పండితుడు అని పిలువబడుతాడు.
అన్నసూక్తము ‘అన్నం న పరిచక్షీత’ అని ఆహారమును ఒక్క మెతుకు కూడ  వృధా చేయరాదని చెప్తుంది. కాబట్టి భగవంతునిచే సృష్టింపబడిన అట్టి విలువైన ఆహారమైన నేతిని, ఆ నేతితో వండబడిన ఆహారమును జడమైన అగ్నిలో కాల్చి నింద్యమైన కర్మకు పాల్పడరాదు. వైశ్వానరాగ్ని లేక దేవతాగ్ని అనబడే ‘క్షుధాగ్ని’లో మాత్రమే అట్టి ఆహారమును కాల్చి (సమర్పించి) హవనము చేయాలి. కట్టెలు, పుల్లల సహాయంతో వెలిగింపబడే జడమైన అగ్నిని, భౌతికాగ్ని లేక లౌకికాగ్ని అంటే, జడమైన విద్యుత్తు ద్వారా ఏర్పడే అగ్నిని వైద్యుతాగ్ని అన్నారు.

 
 whatsnewContactSearch