home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

గేహి ప్రేమ త్యాగ పరీక్ష్యమ్


గేహి ప్రేమ త్యాగ పరీక్ష్యమ్,
సంన్యాసీ తు స్వగతి ర్దత్త ॥  (పల్లవి)

ఓ దత్తస్వామీ! భగవంతుని పట్ల ఒక గృహస్థునికి నిజమైన ప్రేమ ఉన్నదా, లేదా అని పరీక్షించాలంటే అతనికిగల  కర్మ ఫలత్యాగము చేసే సామర్థ్యాన్నిబట్టే పరీక్షించాలి తప్ప అతనికి కర్మ సంన్యాసం చేసే సామర్థ్యమున్నదా, లేదా అనేదాన్ని బట్టి కాదు. భగవంతుని పట్ల ఒక సంన్యాసికి నిజమైన ప్రేమ ఉన్నదా, లేదా అని పరీక్షించాలంటే అతనికున్న ఏకైక సామర్థ్యమైన కర్మ సంన్యాసాన్ని బట్టే పరీక్షించాలి తప్ప మరొక విధంగా కాదు.
సంన్యాసి తన ఆహారాన్ని యాచన చేసి పొందుతాడు కనుక కలలో కూడ అతని కర్మ ఫలత్యాగ సామర్థ్యమెంత అని పరీక్షించగోరరాదు. మరి కర్మ ఫలత్యాగము తీసివేయగా, సంన్యాసి విషయంలో మిగిలిన ఒకే ఒక వికల్పమేమంటే, సమర్థముగా కర్మ సంన్యాసమును చేయగలగడము. కావున, సంన్యాసి కర్మ సంన్యాసము చేయగలడా, లేడా అని పరీక్షించాలి తప్ప కర్మ ఫలత్యాగము చేయగలడా లేడా అని కాదు.

మధ్యమపద మాసక్తిం భజ,
కర్మజమితి చ విగ్రహ ఉక్తః ॥

ఓ పిసినారియైన వైయాకరణుడా! కర్మఫలత్యాగము అనే సమాస పదములో మధ్యమ పదము లోపించగా అధ్యాహారము చేసుకోవాల్సిన ‘ఆసక్తి’ అనే కొత్త పదాన్ని మామీద రుద్దవద్దు. ఆ సందర్భములో సమాస పదమునకు ‘కర్మ యొక్క ఫలమును త్యజించడము’ అని అర్థమే కాని, ‘కర్మ ఫలమందు ఆసక్తిని త్యజించడమ’ని కాదు. నీవు ఇటువంటి అల్లరి పని ఏదో చేస్తావనే, కృష్ణ భగవానుడు ఆ సమాసపదానికి నీ అపవ్యాఖ్యానాన్ని నిర్మూలించి, ఈ సమాసపదమునకు సరియైన విగ్రహవాక్యమును ముందే విశ్లేషించి నిజమైన అర్థాన్ని బోధించాడు. భగవద్గీత ప్రారంభంలోనే, రెండవ అధ్యాయంలో ‘కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః’ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. విజ్ఞులైన పండితులు వారి యొక్క కర్మలచే పొందిన ఫలమును త్యాగం చేస్తారు అని ఆ శ్లోకపాదము యొక్క అర్థము. కర్మఫలత్యాగము – అనే సమాస పదాన్ని విడగొట్టి, ‘ఫల’ శబ్దము నుండి ‘కర్మ’ శబ్దమును (‘కర్మజం’) వేరు చేసి భగవానుడు అపవ్యాఖ్యాన రూపమైన – ‘కర్మ ఫలము పట్ల ఆసక్తిని వదలివేయడమ’నే అనే అర్థాన్ని తీసివేసి, ‘కర్మ యొక్క ఫలమును త్యజించడమ’ని స్పష్టీకరించాడు. ఇటువంటి స్పష్టమైన వాక్య నిర్మాణము వలన ఒకరు తన కర్మ ఫలమునే త్యాగం చేయాలి అని అర్థం కలగడం చేత, ఎటువంటి సందేహానికీ ఆస్కారము లేదు.

యస్య స్వామ్యం తస్య త్యాగః,
పూర్ణాపూర్ణౌ గమ్య మార్గౌ ॥

భక్తుడు ఏదైనా కర్మ ఫలమైన ధనమును త్యాగము చేస్తున్నపుడు అది అతని స్వంత ధనమా కాదా అనేదే ప్రశ్న కాని, తనది కాని ధనమును త్యాగం చేయడమనే ప్రశ్న కలుగదు. భగవదనుగ్రహం కోసం, స్వంతంగా సంపాదించిన కర్మ ఫల రూపమైన ధనము యొక్క సంపూర్ణ త్యాగమే లక్ష్యమైతే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ సంపాదించిన ధనము యొక్క పాక్షికమైన త్యాగము మార్గమవుతుంది.
నీవు కష్టపడి సంపాదించిన ద్రవ్యమును త్యాగం చేయగలవా, లేదా అని భగవంతుడు పరీక్షిస్తాడు తప్ప నీకు స్వంతము కాని ద్రవ్యమును త్యాగం చేస్తావా, లేదా అని పరీక్షించడు. కనుక, నీవు పొందని ద్రవ్యము ఏదైనా భగవంతునికి అనవసరము. సక్తుప్రస్థుని వద్ద తను కష్టపడి సంపాదించుకున్న కొద్ది ఆహారం ఉన్నది కాబట్టే భగవంతుడు వెళ్ళి ఆ ఆహారాన్ని అర్థించాడు. అయితే, మనం అటువంటి మహాత్ములలాగ, సంపూర్ణ కర్మ ఫలత్యాగము చేయలేకపోయాము, చేస్తున్న పాక్షికమైన కర్మ ఫలత్యాగము కూడ వృథా అవుతుందేమోనని అనుకోరాదు. అందుకే, సంపూర్ణ కర్మ ఫలత్యాగము లక్ష్యమైతే, పాక్షికమైన కర్మ ఫల త్యాగము ఆ లక్ష్యాన్ని చేరడానికి మార్గము అని చెప్పారు. మార్గములో ప్రవేశించి ముందుకు వెళ్ళకుండా లక్ష్యము ఎపుడూ సిద్ధించదు కద.

సర్వ స్వామీ నిర్మమ ఏవ,
పౌత్ర యాచనా పితామహస్య ॥

భగవంతుడు ఈ సమస్త ప్రపంచానికి యజమాని. ఆయనకు ఏ వస్తువుతోను, ఎవరితోను పని లేదు. తన పట్ల నీకు ఎంత ప్రేమ ఉన్నదో పరీక్షించడానికే ఆయన నిన్ను అర్థిస్తాడు. ఈ సన్నివేశం ఎటువంటిదంటే, ఒక తాతగారు తన మనవడికోసం ఒక బిస్కెట్ ప్యాకెట్టు కొని తెచ్చి కోడలికి ఇచ్చారు. తను కొన్న విషయం పిల్లవాడికి చెప్పవద్దన్నారు. వాడు తల్లి ఇచ్చిన బిస్కెట్లు తింటున్నపుడు, ఆయన వాడి వద్దకు వెళ్ళి, నాకూ ఓ చిన్న ముక్క ఇస్తావా అని అడిగినట్లు భగవంతుని యాచన ఉంటుంది.

సర్వ సృష్టికర్తయైన భగవంతునికి ఏ విషయములో కూడ అపేక్ష ఉండదు – ‘ఆప్త కామస్య కా స్పృహా’ అని వేదం చెబుతుంది. ఈ సమస్త సృష్టిలో భగవంతుడు పొందనిది ఏదీ లేదు, ఆయన పొందవలసినది కూడ ఏదీ లేదని – ‘నాఽనవాప్త మవాప్తవ్యమ్’ అని గీతావాక్యం చెబుతుంది. ముందు చెప్పిన ఉదాహరణలో తాతగారు మనవడి కోసం బిస్కెట్ ప్యాకెట్టు రహస్యంగా కొని తెచ్చి, కోడలికి ఇచ్చి, ఆవిడే ఆ బిస్కెట్లు కొన్నట్లు చెప్పమన్నారు. ఒకవేళ, పిల్లవాడు తను తింటున్న బిస్కెట్లు తాతగారే కొన్నారని తెలుసుకుంటే కృతజ్ఞతతో ఆయనకు ఒక బిస్కెట్టు ఇస్తాడు. తన పట్ల మనవడికి నిజమైన ప్రేమ ఉన్నదా, లేదా అని పరీక్షించడం కోసం తాతగారు ఈ వ్యవహారమంతా అందుకే రహస్యంగా ఉంచారు. పిల్లవాడు ఆ బిస్కెట్లు తన తాతగారు కొన్నవి అని తెలియకపోయనా ఆయనకు ఇవ్వగలిగినట్లయితే ఆయన పట్ల వాడికి నిజమైన ప్రేమ ఉన్నది అని అర్థము. అలాగే, భగవంతుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అయితే, అదంతా నా ప్రతిభతోనే సంపాదించానని నీవనుకుంటావు. ముందు చెప్పిన దృష్టాంతంలాగ, నేపథ్యంలోని ఈ రహస్యంతో, భగవంతుని పరీక్ష అప్పుడే మొదలవుతుంది.

 
 whatsnewContactSearch