home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

పండితానాం పండితస్త్వమ్


పండితానాం పండితస్త్వమ్,
దత్త! పామర పామరోఽసి ।। (పల్లవి)

హే దత్త పరమాత్మా! నీవు పండితులలో పండితుడవైయున్నావు, మరియు పామరులలో పామరుడవైయున్నావు.

 

తాపసానాం వేదవాదీ,
గోపికానాం వేణుగీతిః ।।

త్రికరణశుద్ధితో కూడిన మహర్షులకు నీవు పవిత్రమైన వేద జ్ఞానమును బోధించే బోధకుడవై,  సద్గురువువై యున్నావు. అదే సమయంలో, గోపబాలకుడిగా, బృందావనంలోని ప్రవృత్తి ధర్మాన్ని ఉల్లంఘించి వచ్చిన వేయిమంది గోపికలకు అమితమైన ఆనందాన్ని కలిగించే మధురగీతాలను, నీ అద్భుతమైన పిల్లనగ్రోవిపై వాయిస్తున్నావు.

 

దేవతానాం ధ్యానగమ్యః,
రాసకేళి నాయకోఽసి ।।

ధ్యానముద్వారా తమ మనస్సులను పరమాత్మపై లగ్నము చేయాలని ప్రయత్నించే దేవతలకు లక్ష్యమైన పరమాత్మవు కూడ నీవే అయి ఉన్నావు. అదే సమయంలో, అర్ధరాత్రి వేళలో బృందావనంలో గోపికలతో రాసకేళి నృత్యం చేస్తూ గోపీజన వల్లభుడవై, రాసకేళి నాయకుడవై కూడ ఉన్నావు.

 

మన్మథస్య దాహకస్త్వమ్,
మద్యవేశ్యా లాలసోఽసి ।।

శృంగారానికి అధిపతిని, మనస్సులో కామాన్ని పుట్టింపచేసే మన్మథుడిని నీవు నశింపచేసినవాడవు. నీవు తీవ్రమైన తపస్సు చేస్తున్నపుడు, నీ మనస్సును కామవికారాలతో చలింపచేయాలని ప్రయత్నించిన మన్మథుడిని, అగ్నినేత్రమైన నీ మూడవ కంటిని తెరచి, బూడిద కుప్పగా మార్చి యున్నావు. అదే సమయంలో,  ఆధ్యాత్మిక సాధననుండి దూరంచేసే, దుర్గుణములుగా పరిగణించబడే, మద్యపానము యందు మరియు వేశ్యల యందు ఆసక్తిని చూపే పిచ్చివాడిలాగా కనబడుతున్నావు.

{దత్తభగవానుడు చూసేవారికి త్రాగుబోతులాగ, అలానే వేశ్యలయందు విపరీతమైన మోహం పెంచుకున్నవాడిలాగ కనిపిస్తాడు. కాని, అది నటన మాత్రమే. తన పట్ల తన భక్తులు కనబరిచే భక్తియొక్క నిజమైన లోతు ఎంత అని పరీక్షించడానికే భగవానుడు ఆ విధంగా అజ్ఞానిలా ప్రవర్తిస్తాడు. దీనివల్ల ఒక ప్రయోజనం కూడ కలుగుతోంది. అది ఎలాగంటే, కేవలం తమ ప్రవృత్తిపరమైన కోరికలు తీర్చుకొనడం కోసం దత్తుని ఆశ్రయించడానికి వచ్చిన భక్తవేశ్యలు, ఆధ్యాత్మిక మార్గమునకు విపరీతమైన ఆయన చేష్టలు చూసి ఏవగించుకునో, భయపడో అక్కడినుండి పారిపోతారు. ఆ విధంగా తన భక్తబృందమునుండి అయోగ్యులైన వారిని దత్తభగవానుడు తరిమివేస్తాడు.}

  

నవనిధీనాం ఏక దాతా,
నిత్యభిక్షా యాచకోఽసి ।।

సృష్టిలో ఉన్న తొమ్మిదిరకములైన గొప్ప నిధులను, నిజమైన భక్తులకు నీవు మాత్రమే అనుగ్రహిస్తున్నావు. అదే సమయంలో ప్రతిరోజూ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఇంటింటికి భిక్షకోసం వెళ్తున్న భిక్షుకునిలా కనపడుతున్నావు.

{దత్తుడు భోగమోక్షప్రదుడు – ‘అత్యధిక భోగ ప్రదానేన మోక్షం దదాతి ఇతి భోగమోక్షప్రదః.’ సాధకుడు నాకు దరిద్రం వద్దు అని భోగాన్నే కోరుకుంటే దత్తుడు ఊహించలేనంతగా భోగాన్ని అనుగ్రహిస్తాడు. పరిమితికి మించి అత్యధికంగా భోగాన్ని అనుభవించడం వలన ప్రశాంతత కోల్పోయి, సమస్యలు పెరిగి, భోగం పట్ల వెగటు ఏర్పడి అది చివరకు విషయాల పట్ల వైరాగ్యానికి దారి తీస్తుంది. ఆవిధంగా సాధకుడు భోగం ద్వారా మోక్షాన్ని పొందడానికి దత్తుడు అవకాశం కల్పిస్తాడు. ఇంకోవిధంగా, కటిక దారిద్ర్యాన్ని కూడ దత్తుడు సాధకునికి అనుగ్రహిస్తాడు. దారిద్ర్యాన్ని పొందినట్లయితే, అప్పుడు మోక్షం పొందడం సులభమవుతుంది. కారణమేమంటే, దరిద్రుని జోలికి ఎవరూ వెళ్లరు కద. అందువలన సమస్యలు లేక, చాలా ప్రశాంతత ఏర్పడి అది మోక్షకారణమవుతుంది. యాచకవేషంలో ఉన్న దత్తుని అనుసరించినట్లయితేనే దారిద్ర్యావస్థను దాటి దత్తుని చేరడం సాధ్యమవుతుంది. దత్తుడు యౌవనంలో భోగాన్ని, ముసలితనంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడని భోగమోక్షప్రదః  (భోగం చ మోక్షం చ) అన్న శబ్దానికి లోకంలో అర్థం చెపుతారు. కాని పైన వివరించిన విధంగా భోగము ద్వారా మోక్షము (భోగేన మోక్షః) అని సరియైన అర్థాన్ని గ్రహించాలి.}

 
 whatsnewContactSearch