home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కిమస్తి దత్తే ? కమలే


 

కిమస్తి దత్తే ? కమలే ! విముక్త శీలే, విమలే ! (పల్లవి)

ఓ పవిత్రురాలైన కమలా! శీలాన్ని విడిచిపెట్టినటువంటి దత్తుడిలో ఇక ఏం మిగిలి ఉన్నది?

 

వర్షసహస్రం మహర్షిలోకే, సరసీకూలే నిరీక్షమాణే,
ఆలింగితోయం దిగంబరాంగ్యా, సాక్షాత్ దదృశే దిగంబరాంగః ! ।।

మహర్షులు అందరూ ఒక సరస్సు ఒడ్డున నిలబడి వేయి సంవత్సరాల పాటు దత్త భగవానుడి దర్శనం కోసం వేచి చూస్తుండగా, దిగంబరియైన స్త్రీ తనను కౌగలించుకొని ఉండి దత్తుడు వారికి దిగంబరంగా దర్శనమిచ్చెను.

 [దుస్తులు ధరించని ఏ వ్యక్తినీ (దిగంబరుడు) ఎవరూ చూడలేరు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎపుడూ చూడడం సాధ్యం కాదు. అనూహ్య పరబ్రహ్మము కంటికి కనపడదు. కనీసం మనము ఊహించలేము కూడ. అందుచేతనే, దుస్తులు ధరించని దిగంబర వ్యక్తితో అనూహ్య పరబ్రహ్మమును పోల్చడం జరిగింది. మహర్షుల ముందు దిగంబరంగా దత్త ప్రభువు దర్శనమివ్వడమంటే అనూహ్య పరబ్రహ్మ తత్త్వమును ఎవరూ చూడలేరని, ఊహించలేరని తెలుసుకోవడం. ఈ అర్థంలో దత్తుడు దిగంబరునిగా చెప్పబడినాడు. మహర్షులముందు దిగంబరియైన స్త్రీ దత్త భగవానుని కౌగిలించుకోవడమంటే అనూహ్య పరబ్రహ్మము యొక్క అనూహ్య మాయాశక్తి ఆయనను ఎపుడూ విడచి ఉండదని అర్థం చేసుకోవాలి. వేయి సంవత్సరాలపాటు దత్తభగవానుని దర్శనం కోసం వేచియున్నా మహర్షులు దత్తుని అనూహ్య పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోలేరని అర్థం చేసుకున్నారని ఇక్కడ ధ్వనిస్తోంది. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి.]

 

యస్మిన్ దృష్టే విచ్ఛిద్యంతే, సర్వే బంధాః సుత-పతి-రూపాః,
తదేకబంధాత్ సర్వ విముక్తిః, స్వార్థం పశ్య ప్రభుతాహ్యేవమ్ ! ।।

సంతానం, భార్య, భర్త మొదలగు సర్వవిధములైన లౌకిక బంధాలు దత్తుడిని చూసినపుడు వాటికవే తెగిపోతాయి. అటువంటి దత్త భగవానునితో భక్తులకు కలిగే బంధం మిగిలిన ప్రాపంచిక బంధాలన్నిటినుండి విముక్తి చేస్తుంది. అయితే, దత్తునితో కలిగే ఆధ్యాత్మిక బంధం వేరే విధమైన ఎటువంటి బంధాలనూ సహించదట. మరి అటువంటి దత్తుడి రాచరికాన్ని, అలాగే ఆయన స్వార్థాన్ని చోద్యం చూడండి!

[ఎపుడైతే దివ్యమైన అమృతాన్ని సేవించగలుగుతామో, అపుడే లోకంలో నిత్యమూ సేవించే కాఫీ, శీతల పానీయాలను సేవించాలనే కోరిక దానికదే దూరమవుతుంది. ఎవరైనా బలవంతపెట్టినా కూడ దివ్యమైన అమృతపానం చేసిన అనుభవం బలంగా ఉండడం చేత, మనం ఆ లౌకికమైన, అనిత్యమైన తృప్తినిచ్చే, శీతల-ఉష్ణ పానీయాలను సేవించాలని ప్రయత్నించము. దత్త పరబ్రహ్మము అటువంటి దివ్యమైన అమృతము కావున,  లౌకిక బంధాలైన ప్రవృత్తి రూపమైన సంతానాదులయందు అనురాగము దానికదే దూరమవుతుంది. అంతమాత్రాన, ఎవరూ కూడ కుటుంబము మొదలైన ప్రాపంచిక బంధాలను వైరాగ్యంతో బలవంతంగా తెంచుకునే ప్రయత్నం చేయరాదు. అటువంటి వైరాగ్యం ద్వారా దత్త భగవానుని ఎవరూ, ఎపుడూ పొందలేరు. ప్రాపంచిక బంధాలను దివ్యమైన అమృతము ఖండిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కాని, అది నిజము కాదు. మనకు దివ్యామృత ఆస్వాదనముతో ఏర్పడిన బలమైన బంధం ద్వారా నిస్సారమైన ప్రాపంచిక బంధాలు వాటికవే దూరమవుతున్నాయి. భక్తుడు ఎపుడూ భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలి కాని ప్రాపంచిక బంధాలనుండి తనని తాను దూరం చేసుకొనరాదు.]

 

ఏకాంతం నః సాధక యోగ్యం, సముపదిశన్ యో వేదాంతార్థైః,
నృత్యతి స హి నవరాసవిలాసీ, బృందావన-భువి గోపీబృందైః ! ।।

కుటుంబం నుండి దూరంగా, సాధనకు యోగ్యమైన ఏకాంతంలో సాధన చేసుకోమని చెప్పి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు బోధిస్తున్న దత్తుడు, తను మాత్రం, బృందావనంలో గోపికలతో కొత్త కొత్త రాస విలాసాలతో నాట్యం చేస్తున్నాడు.

[కృష్ణునిగా అవతరించిన దత్తుడు గోపికలతో నృత్యము చేయుట నింద యగును. కాని, ఏషణాత్రయములో ఉన్న దారేషణను పరీక్షించుటకు స్వామి పెట్టిన పరీక్షయే ఈ బృందావన నృత్యము. సర్వ ప్రాపంచిక బంధములనుండి విముక్తిని ఇమ్మని ఋషులే పూర్వజన్మమున రామావతారంలో ఉన్న భగవంతుని ప్రార్థించినారు. ఈ విషయము స్తుతి (ప్రశంస) పరము. ఈ దత్తభజన విన్నపుడు శ్రీదత్త భగవానుని నిందలా అనిపిస్తుంది కాని ఇది స్తుతి  మాత్రమే. అలంకార శాస్త్రంలోని నిందాస్తుతి అలంకారములో ఈ ప్రక్రియ ఒక భాగము.]

 
 whatsnewContactSearch