దీపావళి నాడు స్వామి చెప్పిన కీర్తన
దీపావళీ ఙ్ఞాన దీపావళీ - దీపావళీ భక్తి దీపావళీ
నేడే కృష్ణుని స్మరణం - రేపటి నుండియె కార్తీకం చంద్రశేఖరునికి అభిషేకం || (పల్లవి)
1. హృదయమనే మట్టి పాత్రలో - ఙ్ఞానమను వత్తినుంచుమా
భక్తియను తైలము పోయుము - గురుదత్త బోధ జ్వాలతో
వెలిగించుమా స్వామికై - నీ జీవితమె ఈ దీపం ||
2. సంసారమె నరకాసురుడు - స్వామిపై ప్రేమయె సత్యభామ
సంసారరతియె అమావాస్య - అఙ్ఞానమె గాఢాంధకారము
భక్తి పాటలె మతాబులు - కాల్చుటయన భజన యోగము ||
3. రేరే జీవా ! మూఢమానవా ! - అంతరార్ధము నాలకించుమా
విషయతృణములనె భక్షించి - నిత్యము పశువైనావు
పశుపతినే మరచినావు - పశువుగ జన్మించేవు ||
4. అభిషేకమన ప్రేమించుట - గంగాజలమన శుద్ధ ప్రణయము
లింగమనగా సగుణరూపము - త్రిదళ బిల్వమన త్రిమూర్తి భావము
విభూతియన బ్రహ్మ ఙ్ఞానము - విశ్వేశ్వరుడన గురుదత్తుడే ||
5. సాత్విక భావమె క్షీరాభిషేకం - సత్సంగమె దధ్యభిషేకం
తపించు తనువే ఘృతాభిషేకం - ప్రేమయె మధువుల అభిషేకం
స్వామి పలుకులె చక్కెరల అభిషేకం ||
6. కొబ్బరికాయె నీ తలకాయ - పగులకొట్టుటయె వేదాంత చర్చ
కొబ్బరి నీళ్ళే నీ తియ్యని తలపులు - అభిషేకంబన అర్పణము
ద్రవ్య యఙ్ఞమున సారాంశమే - ఙ్ఞాన యఙ్ఞమని తెలియుమురా ||
7. నానా ఫలరస అభిషేకంబన - సర్వ ఫల సంగత్యాగము
కర్పూర నీరాజనమే - నీ మనసును స్వామికిచ్చుట
శివరతియే అగరువత్తి గంధం - నైవేద్యమే నీ ఆత్మార్పణము ||
8. దేవ దేవునికె నీ దేహం - వామ దేవునికె నీ వాక్కు
ఆదిదేవునికె నీ అంతరంగం - అర్పించుటయె ఆరాధన
ప్రతి క్షణము కార్తీకమాసం - ఆనందమె అమృతాభిషేకం ||