home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

వేంకటేశ్వర పాహిమాం


 

వేంకటేశ్వర వేంకటేశ్వర వేంకటేశ్వర పాహి మామ్,
వేంకటేశ్వర వేంకటేశ్వర వేంకటేశ్వర రక్షమాం || (పల్లవి)

శ్రీ వేంకటేశ్వరా! హే వేంకటేశ్వరా! ప్రభో వేంకటేశ్వరా! నన్ను రక్షించు, శ్రీ వేంకటేశ్వరా! హే వేంకటేశ్వరా! ప్రభో వేంకటేశ్వరా! నన్ను కాపాడు ।।

ఊర్ధ్వ పుండ్ర విలక్షణాంకిత ఫాలదేశ సముజ్జ్వలమ్,
సప్తశైల విభూషణం నవనీల మేఘ సమప్రభం,
వామపార్శ్వ విలంబి మౌక్తిక దామ చారు కిరీటినం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।1।।

విశాలమైన నుదుటిపై మెరిసిపోతూ విలక్షణంగా దిద్దిన ఊర్ధ్వపుండ్రముతోనున్నట్టి, నీలిరంగులోనున్న అందమైన క్రొత్త మేఘముల ఛాయ వంటి ఛాయను కలిగి సప్తగిరులకే ఆభరణమైనట్టి, చక్కటి కిరీటమును ధరించి ఎడమవైపు అందంగా వ్రేలాడుతున్న తెల్లముత్యముల హారమును ధరించినట్టి శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

అంసయో రుపరిస్ఫురద్ద్యుతి శంఖ చక్ర సులక్షితం,
చక్రవాక సమాకృతి స్ఫుట కర్ణ భూషణ శోభితమ్,
స్వర్ణవర్ణ ధగ ద్ధగద్ద్యుతి నూతనాంబర విభ్రమం
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।2।।

తన రెండు భుజములపై వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్న శంఖము, చక్రములతోనున్నట్టి, చక్రవాకముల ఆకృతివంటి ఆకృతితో కూడిన కర్ణభూషణములతో చక్కగా శోభిస్తున్న, బంగారు రంగులతో కూడిన కటివస్త్రముతో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్నట్టి, శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

చిత్రపుష్ప సరోల్లసత్తులసీ దళాత్మక మాలికం,
వజ్రమౌక్తిక దామ సంభృత చిత్ర చిత్ర విభూషణమ్,
శోణ పద్మ విశేషహార పరిష్కృతామల కంధరం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।3।।

అందమైన రంగురంగుల పువ్వుల మధ్యలో తులసిదళములను కూర్చిన పూలహారమును దరించిన, వజ్రములు, ముత్యములతో తయారు చేసిన ఆభరణమాలను ధరించి, అటువంటి చిత్ర విచిత్రమైన హారములను ధరించినట్టి, ఎఱ్ఱని పద్మములతో కూర్చిన విశేష హారములు భుజములపైనుండి వ్రేలాడుతున్నట్టి శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

చూత పల్లవ కోమలాధర నర్తితస్మిత సుందరం,
చందనాక సముల్లస చ్చుబుకాంత కాంతి విలక్షణమ్,
ఉల్లసత్తిల పుష్ప సమ్మిత చారునాస మనోహరం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।4।।

లేత మామిడి చిగురుల వంటి కోమలమైన పెదవులపై నర్తిస్తున్న చిరునవ్వుతోనున్న సుందరాకారుని, అందముగానున్న చుబుకము (గడ్డము)పై గాయము మానుటకు చక్కగా అద్దిన చందనగంధముతో కూడినట్టి, తెల్లగా ప్రకాశించే నూగుపూవు వంటి, తిన్నగా ఉన్న అందమైన ముక్కును కలిగినట్టి, శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

ధౌత దీధితి మీన యుగ్మ కళాలసత్తల లోచనం,
కామ చాప యుగ భ్రువోరతి సుందరాకృతి భాసురమ్,
వామ పాణి విలోల సౌరభ వర్షి కోమల వారిజం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।5।।

తెల్లని కాంతితో కూడిన రెండు చేపల వంటి కన్నులతో కళా ప్రకాశమును వెదజల్లుతున్నట్టి, తన కుమారుడైన మన్మథుని విల్లు ద్విగుణీకృతమైనదా అనిపించెడి రెండు కనుబొమ్మలతో కూడి సుందరాకారముతో ప్రకాశిస్తూ, ఎడమచేతిలో సుగంధమును వర్షిస్తున్న కోమలమైన పద్మమును ధరించిన శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను, కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

దక్షిణాది గుణాలయం శుభ సర్వ సద్గుణ సాగరం,
పాప కూప నిమగ్న జీవ సముద్ధరం ధరణీధవమ్,
అంగుళీయక వజ్ర దీధితి పాణినాஉభయదాయకం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।6।।

కరుణ, ఔదార్యముల వంటి అద్భుతమైన గుణములకు స్థానమైనట్టి, అన్ని రకముల శుభములను కలిగించే సద్గుణములకు సముద్రమైనట్టి, పాపమనే నూతిలో పడి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతున్నట్టి జీవులకు ఉద్ధరించినట్టి, భూమాతకు భర్తయైనట్టి, కాంతులీనే వజ్రాంగుళీయకమును చేతియందు ధరించి వజ్రమువంటి అభయమును ప్రసాదించే శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను, కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

ఉజ్జ్వలాంగ సుదర్శనాభిధ చక్ర ఖండిత రాక్షసమ్,
సర్వమంగళ దేవతా రమయా లసద్గురు వక్షసం,
శంఖ చక్ర గదాஉ సిశార్ఙ్గ సమాఖ్య పంచ సమూయుధం,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।7।।

ఉజ్జ్వలమైన తన అంగముగా కలిగిన సుదర్శనమనే పేరు కలిగిన చక్రాయుధముతో రాక్షసులను సంహరించినట్టి, తన విశాలమైన వక్షస్స్థలముపై అన్ని రకముల శుభములకు కారణమైనట్టి శ్రీలక్ష్మి (రమ)ను కలిగినట్టి, శంఖము, చక్రము, గద, నందకము, శార్ఙములనే పేర్లు కలిగిన పంచాయుధములను ధరించిన శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను, కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

యః పఠేదిద మధ్భుతం స్తవ ముత్తమోత్తమ మాగమమ్,
సర్వ కష్ట విముక్తిమేతి, సకృత్సుఖం లభతే నరః,
క్షీరసాగర శాయినం, పరమాప్నుయాత్పర పూరుషమ్,
వేంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ।।8।।

ఎవరైతే అద్భుతమైన అత్యుత్తమమైన వేదము యొక్క పవిత్రత వంటి పవిత్రత కలిగిన ఈ స్తోత్రమును గానం చేస్తారో వారు అన్ని రకముల కష్టముల నుండి విముక్తులై పూర్తిగా ఇక్కడ సుఖాన్ని పొందడమే గాక చివరకు క్షీరసాగరములో శయనించిన పరమాత్ముని కూడ పొందగలరు. అట్టి సాయుజ్యాన్ని అనుగ్రహించే శ్రీవేంకటేశ్వర స్వామిని శరణు వేడుతున్నాను, కాబట్టి కలి ప్రభావం నన్నేం చేస్తుంది?

 
 whatsnewContactSearch