home
Shri Datta Swami

 06 Jan 2002

బ్రహ్మదత్తులను చూడండీ

బ్రహ్మదత్తులను చూడండీ - కొలువైయున్నారిపుడండీ. (పల్లవి)

ఆ దేవ సవిత గొప్ప తేజమును।
ధ్యానింతుమెవరు మాదగు బుద్ధుల।
ప్రేరేపించగ సమర్థులగుదురొ।
ఆ బ్రహ్మయైన జ్ఞాన సూర్యులగు॥
 
 
ప్రాణి ప్రసవము చేయు సవితయును।
సృష్టికర్తయగు బ్రహ్మతేజమే।
శిష్య బుద్ధులను ప్రేరేపించును।
ఆ గాయత్రీ మంత్రసారమగు॥
 
 
గాయత్రియనగ ఛందోనామము।
సవితయె దేవుడు చెప్పుచుంటిమట।
శిష్యాంధకార ముకుళితాబ్జ।
ధీవికాసదులు గురువరేణ్యులగు॥
 
 
కర్తయు భర్తయు హర్తయు వారే।
సర్వ జగత్తుకు శ్రుతివాక్యమదే।
త్రిమూర్తిరూపులు ఏకమె బ్రహ్మము।
బ్రహ్మాకారులు బ్రహ్మవాక్కులగు॥
 
 
త్రిపాది ఛందము త్రిస్వరమంత్రము।
త్రికాలవంద్యులు త్రిగుణసూత్రమది।
గంగాయమునా సరస్వతీ సమ।
త్రిమూర్తిసంగమ ముద్దేశించును॥
 
 
ఓంకారంబది త్రివర్ణమిళితము।
త్రివ్యాహృతులును సంబోధించును।
సర్వమంత్రమును త్రిగుణములేగద।
త్రిమూర్తులను గుణి వ్యక్తి ఒక్కరగు॥
 
 
నాల్గు వేదములు శునకములగుచును।
వేదధర్మమే గోవుగ నడవగ।
వీణాశ్రవణులు వాణీ రమణులు।
షోడశ వర్షులు బ్రహ్మదేవులగు॥
 
 
జగదారంభులు హంసవాహనులు।
తేజోవదనులు మంత్రమూలమును।
గాయత్రీశులు సామగాయకులు।
విద్యా నిలయులు వేదపాఠులగు॥
 
 
యజ్ఞాచరణులు హోమనిష్ఠితులు।
కమండలుకుశలు జపమాల బట్టి।
ప్రాతస్సంధ్యా బాలభానులును।
అగ్నిజ్వాలగ భాసించుచుండు॥
 
 
చందనతిలకము కుంకుమాంకితము।
బ్రహ్మతేజస్సు దీపించుచుండ।
త్రిజగన్మోహన సుందరాకృతులు।
కాషాయధారి పండితేశ్వరులు॥
 
 
అత్రిపుత్రులును బ్రహ్మదత్తులును।
అనసూయాంబా ప్రేమరాశులును।
అజినమేఖలురు బ్రహ్మదండులును।
యజ్ఞోపవీత మక్షమాలగల॥
 
 
తన తనువునగల కమలగంధముల।
త్రిభువనములు ఆహ్లాదమునొందగ।
బ్రహ్మముహూర్తము నందు సాధకుల।
మమ్ముల బుద్ధుల ప్రేరేపించెడి॥
 
 
త్రిస్వరబద్ధము పావనార్థమగు।
సృష్టిని జెప్పెడి పురుష సూక్తమును।
ఋషులు పఠించగ బ్రహ్మకాలమున।
విని విని యెంతో ప్రీతిని పొందెడి॥
 
 
త్రిమతాచార్యులు పఠించుచుండగ।
తమతమ మతముల భాష్య వాదముల।
అవి విని చివరకు సిద్ధాంతమును।
సమన్వయ మతము నొప్పుగచెప్పెడి॥
 
 
వేదాంతములకు అంతిమార్థమై।
వేదాంతార్థము బోధించునెపుడు।
శాస్త్రరహస్యము లందున నడిగెది।
ఋషులకు చెప్పుచు వారి మధ్యగల॥
 
 
ఆయుధవర్జిత పాణిపద్ములును।
వాగాయుధమున శత్రుమారకులు।
కర్మఫలంబుల నుదుటి పత్రమున।
లిఖించునాయుర్దాయ దాతలగు॥
 
 
ఆచార్యేంద్రులు వాక్ప్రచారకులు।
భువి సంచారులు నిర్విచారులును।
ఖలాభిచారులు సదాచారులును।
సురపరిచారులు చిత్తచోరులగు॥
 
 
పద్మసంభవులు పద్మాసనులును।
పద్మసుగంధులు పద్మవర్ణులును।
పద్మాపుత్రులు పద్మనేత్రులును।
పద్మసుపాణులు పద్మపాదులగు॥
 
 
వీణాపాణియు శిష్యురాలగుచు।
వాణి పాడునట జ్ఞానదేవతయె।
ఆ వాగీశుని సామగీతముల।
శోణాధరచర మంత్రపాఠులగు॥
 
 
ఒక సంకల్పమె ఎవరు చేయగా।
సర్వము విశ్వము రచిత మీ విధిగ।
ఆద్యదేవులును ప్రథమమూర్తియగు।
ఆరాధనీయు లజులనాదియగు॥
 
 
నుదుటివ్రాతలను తుడిచివేయగా।
వ్రాసినవారే సర్వసమర్థులు।
విధాతయనగా కర్మఫలములను।
విధించువారలు మూలమూలమగు॥
 
 
చతురవాక్కులగు చతుర్వేదముల।
చతురాననములు చెప్పుచునుండగ।
ఆదికావ్యమగు సర్వజగత్తును।
రచించువారలు కవులకు కవులగు॥
 
 
పరబ్రహ్మమను బ్రహ్మశబ్దమది।
ఏ ఒక్కరికే పేరుగ గలదో।
బుద్ధికి చిక్కరు పూజలకందరు।
దినారంభమున పరమపూజ్యులగు॥
 
 
గాయత్రి మొదలు ముగ్గురు భార్యలు।
త్రిశక్తులుండగ త్రిముఖపద్ములై।
దేవులు తండ్రులు వారికె తండ్రియు।
పితామహులనగ బ్రహ్మరూపులగు॥
 
 
సత్యలోకమున పద్మపీఠమున।
బ్రహ్మసదస్సున అధ్యక్షులగుచు।
సరస్వతీ సతి నారదసుతుడును।
తమతమ వీణల మీటుచునుండగ॥
 
 
బ్రహ్మర్షులచట శాస్త్రవాదముల।
చర్చల సేయగ నాకర్ణించుచు।
చివరకు నిజమత సిద్ధాంతములను।
సమన్వయములను ప్రతిపాదించెడి॥
 
 
బ్రహ్మముహూర్తము సంధ్యాసమయము।
బాలభానురుచి కుంకుమరాశుల।
పాదపద్మముల నర్చన సేయగ।
పద్మాసనమున ఆసీనులైన॥
 
 
వేదపురుషులట నలుగురు తనయులు।
జటామండలము లొప్పుచునుండగ।
మధురకంఠముల శ్రవణరమ్యముల।
త్రిస్వరపావన మంత్రముల చెప్ప॥
 
 
శరదంబోధర శరీర కాంతులు।
జ్ఞానతేజములు ప్రసరించుచుండ।
వాణీదేవత సామగానముల।
కచ్ఛపివీణను వాయించుచుండ॥
 
 
సిద్ధాంతార్థము నటనటపలుకగ।
ఆహో! యని ముని ఘోషలు చెలగగ।
తన్మయుడై తన తండ్రిని పొగడుచు।
వీణాకలముల దేవర్షి పాడ॥
 
 
బ్రహ్మదత్తులను ఈ గాయత్రిని।
బ్రహ్మకాలమున గానము చేసిన।
బ్రహ్మతేజమున ఉద్దీప్తులగుచు।
బ్రహ్మజ్ఞానులు బ్రహ్మమె అగుదురు॥
 
 
శతవర్షంబులు ఆయుర్దాయము।
సర్వవిద్యలును సంప్రాప్తించును।
హోమము చేసిన మహదైశ్వర్యము।
సత్పుత్రసిద్ధి బ్రహ్మదృష్టి పడు॥
 
 whatsnewContactSearch