కొల్హాపురిని మధ్యాహ్న భిక్షకు -
పద్మ ముంగిట నిలచెను దత్తుడు।
పద్మా పద్మా అని మొత్తుకున్న -
తలుపులు తెరవదు మంగళ దేవత॥
పద్మాయనగా పద్మావతియే -
మంగాపురికే పొమ్మని పలికె।
పద్మాయనగా నీదేనామము -
మొదట నుండియు ననెను దత్తుడు॥
మొదటినుండియు పత్నిగనున్నను -
వెడలి పోతిగద నాపేరుకూడ।
వెడలి పోయెనిది సత్యము నాధా ! -
అనె గద్గదగళ పలికె శ్రీ లక్ష్మి॥
భిక్షుకునిటు పొమ్మనగన్యాయమె -
అని వెంకటపతి పలికెను దత్తుడు।
నీప్రేమ భిక్షువు నేను నీకెమి -
దానము చేయుదు ననె మహాలక్ష్మి॥
సాగరతనయా ఎంత విశాలము -
నీహృదయప్రేమ సాగరమనెపతి।
ఆకాశరాజు కూతురి హృదయము -
ఆకాశమంత విశాలమనె సతి॥
అర్థరాత్రియట మధ్యాహ్నమిట -
ఒక పూటనుందు సమకాలముగా।
ఉదయాననచట సాయమునిచట -
వెడలుచుంటిననె వెంకట దత్తుడు॥
మిగిలిన సమయము లందుననెందరో -
గోపికలుందురు నీ ప్రేమ భిక్షులు।
నేను చూతునా పద్మ చూచునా -
పద్మకు చెప్పితి నిదియనె భార్గవి॥
ఈ రీతి నైన ఇరువురు కలిసిరి -
సంతోషమదియే నాకనె శ్రీ హరి।
అర్థరాత్రి యిది పద్మ చెప్పునట -
నా చెల్లెలనెను నారాయణసతి॥
ఇరువురు పొమ్మన్న నాకేదిదిక్కు -
అని వాపోయెను మధుసూదనుడు।
గోదయు మీరయు నాంచారియును -
కులమతములైన లేవనె కమలయు॥
చేసెడి దేమియు లేకింక విభుడు -
వెనుదిరిగెను పాదుకల శబ్దముల।
తటాలున తలుపు తెరిచి పద్మ చూచె -
అశ్రుధారా ప్రేక్షణములతో॥
ఆగెను వెనుకకు తిరిగెను దత్తుడు -
నిలబడె పరుగున వచ్చెను పద్మయు।
కౌగిలించె ముఖమంతయు ముద్దాడె -
మన్నించు మనుచు పదముల బడెను॥
మంగళదేవత నెత్తెను కరముల -
కౌగలించె హరి గృహమునకేగిరి।
విందొనరించెను శ్రీ మహాలక్ష్మి -
కమలావయవములను భోజ్యముల॥
కులమత రహిత జీవులందరును -
గోపికలేగద అందరివాడవు।
నీఅందమందరి సొత్తు సొంతమె -
అని నుతించెను లక్ష్మి మురారిని॥