home
Shri Datta Swami

 12 Jan 2002

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !
నా ప్రాణదీపం – కొండెక్కముందె
కొండలరాయ! నీ - కోనేటి లోన |
ఒకసారి మునకేతునా?
నా ప్రాణనాథా ! శ్రీ వేంకటేశా ! (పల్లవి)

1. జీవించినా లేక మరణించినా స్వామి !
మరల జన్మించినా లేక - ఏ లోకమందున్నను
చింతాకు చింతయును నా మదిని లేదెపుడు
నీ నామగానమ్ము నాకిమ్ము అది చాలు ||

2. నీ ప్రేమ కోసమే - నా జీవితంబంత
కర్పూర నీరాజనంబుగా కాలనీ
గోవింద గోవింద పిలుపుతో తపనతో
నా చిట్టచివరి నిశ్శ్వాస మాగిపోనీ! ||

3. నిన్నెంత తలచినా - సంతృప్తి రాదయ్యె
తీరమన్నది లేని – ప్రణయసాగరమీవు
నా జీవితేశ్వరా ! నీ తరంగాలలో
తేలియాడుచు తుదకు నను మునిగిపోనీ ||

4. నవకోటి మన్మథా ! - నీ పొందు లేకున్న
ఈ జగముతో పొందు - ఇపుడె ఆగిపోనీ
నీ కౌగిలింతయే - లేకున్న గోపాల !
విరహాగ్నిలో నన్నిక - భస్మమైపోనీ ||

5. నీ పెదవి ముద్దాడలేకున్న నా పెదవి
నీ విరహ శిఖలలో - కమిలి మాడిపోనీ
నీ దర్శనంబింక నాకు లేకున్నచో
నీకొండ నుండి దూకి ముక్కలై పోనీ ||

6. సప్త శైలన్యస్త - పాద పద్మాయ తే
వామహస్తాలోల - కేళి పద్మాయ తే |
పద్మనేత్రాయ తే పద్మవక్త్రాయ తే
పద్మావతీ ప్రాణనాథాయ వందనమ్ ||

 

 
 whatsnewContactSearch