home
Shri Datta Swami

 16 Jan 2002

మూడు నామాల మెరిసేటి మొనగాడా !

మూడు నామాల మెరిసేటి మొనగాడా !
మూడు మూర్తులకు మూలమైనట్టి వాడా ! (పల్లవి)

1. భక్తి మద్యము త్రాగు ఉన్మత్తుడా! - ధర్మాల తన్నేటి శ్రీదత్తుడా! |
గోపికలతో గూడు శ్రీకృష్ణుడా ! - నీ లీలలె శ్రీ వేంకటేశుడా ! ||

2. పద్మకై ప్రతి రాత్రి దిగివచ్చేవు - భక్తి ప్రభావమిదియని చాటేవు |
స్వార్థములఁ దీర్చుకొన గిరినెక్కేరు - వారికి శిలామూర్తి కనిపించేను ||

3. భక్తులకు చేతనగ, మాటలాడేవు - స్వార్థులకు శిలగానె గోచరించేవు |
పాషాణ విగ్రహమె స్వార్థ జీవులకు - కరుణా రసార్ణవము భక్త జీవులకు ||

4. కోరికలు దీర్చుకొనవచ్చు లుబ్ధులకు - మాటలాడిన గాని మౌనమిచ్చేవు |
మాటలాడగ నీవె స్వయముగా కొండ - దిగి వత్తువా ! స్వార్థ రహిత భక్తులకు ||

5. పద్మావతీ ప్రేమ ఎంత గాఢమో - తెలియంగ తరమౌనె దేవతలకైన |
కాలినడకనె వచ్చు కొండరాళ్ళలో - ప్రతి రాత్రి పాదముల బొబ్బలెక్కగా ||

6. లుబ్ధులకు పగలంత రాతి పాదములు - కఠినంబులైయుండు మార్పులేకయె |
అర్థరాత్రులవియే మారు పద్మకై - చరణ పద్మములుగా కోమలంబులై ||

 
 whatsnewContactSearch