వెంకట రమణా ! నీ సొమ్ములెంత
నీ కళ్యాణ గుణ విలువల ముందు (పల్లవి)
1. నీ కారుణ్యమునకు కనకాభరణాలు - ఎన్నియైన తుల తూగునా ! దేవదేవ !
నీ వాత్సల్యమునకు వరహాల పతకాలు - లక్షలైనను సరియౌనె ? వాసుదేవ !
2. నీ అందమునకు ముందు రూకలును -బిందెలైనను బిందు మాత్రమెస్వామి !
నీ త్యాగమునకెదురు తక్కెడలో నిలుచునె-ధనమెంత యైనను పద్మా హృదయకామి!
3. నీ జ్ఞానమునకు ముందు నిలువగలవా ? - వజ్ర కిరీటాలు వజ్రాభరణాలు !
నీ సౌందర్యకళకు సరివచ్చునె దేవ ! - నీ భూషణ ఖచిత రత్నాల కాంతులు !
4. నీ ప్రేమసుధకు సమ ఉజ్జియగునే - పంచామృత చందన గంధరసధారలు !
నీ ఔదార్యమునకు తలవంచును - హేమాభరణములు మణి మాణిక్యములు !
5. నీ సౌజన్యము ముందు వెలవెల పోయెడి - బంగారు హారాలు బంగారు కడియాలు!
నీ శాంతికి ముందు ఓడి చింతించుచున్నవి-చింతాకు పతకాలు చిత్తు చిత్తయినవిట !
6. నీ కళ్యాణ గుణములు నిత్యములైయుండు -ఈ సొమ్ములన్నియు నాశమొందునుదేవ!
షోడశ కళలైన షోడశ గుణపూర్ణ ! - పూర్ణ చంద్ర ప్రకటిత శ్రీ దత్తా త్రేయ దేవ !