home
Shri Datta Swami

 28 Jan 2002

సతీదేవి కీర్తన - దక్షాయనుచును

శివ దత్త కీర్తనలు

(దక్ష ప్రజాపతి కుమార్తె శ్రీశివదేవుని రాణి సతీదేవి. తండ్రియగు దక్ష ప్రజాపతి శివుని ఆహ్వానించక శివ రహితమైన యఙ్ఞము తలపెట్టి కుమార్తె సతిని, అల్లుడు శివుని ఆహ్వానించలేదు. తన చెల్లెళ్ళు ఆ యఙ్ఞమునకు వెళ్ళుచుండగా జూచిన సతి, భర్తను బ్రతిమాలి శివుడు వద్దన్ననూ వినక స్వామీ అనుఙ్ఞ ఇవ్వండి అని బ్రతిమాలి ఆ యజ్ఞమునకు వెళ్ళింది. అక్కడ తండ్రి దక్షుడు శివనిందచేసి ఆమెను అవమానించాడు. భగవంతుడైన శివుని అవమానమును భరించలేక సతీదేవి సతీత్వమును చెందు ఘట్టము.)

దక్షాయనుచును ఏకవచనమున -
సంబోధించెను తండ్రిని శివసతి।
దాక్షాయణియె మొట్టమొదటగా -
స్వామి దూషణము నోర్వగలేకయె।।
 
 
ఓరీ! దక్షా ! నోరుమూయుమిక -
నా తండ్రిగాన బ్రతికి పోతివిట।
వేరొకరైతే నా శాపాగ్నికి -
భస్మమయ్యెదరు శివదూషణకై।।
 
 
నీకు పుత్రికగ జన్మించుటయే -
నేను చేసినది మహాపాపమే।
తత్ఫలమిప్పుడు శివదూషణమును -
వినగావలసెను నేనేల బ్రతుక?।।
 
 
స్వామి దూషణము నాకర్ణించియు -
బ్రతికి యుంటినే పాపిష్ఠిదాన।
కావున పాపికి నీకు పుట్టితిని -
మరణించుటయే ప్రాయశ్చిత్తము।।
 
 
శివుడన నెవరని తలచుచుంటివో -
మూఢాగ్రేసర రాజాధిరాజ !।
శివుడే దత్తుడు పరమబ్రహ్మము -
త్రిమూర్తులాయన వేషములే గద।।
 
 
జగదుత్పత్తిని జగత్పాలనను -
జగదంతమునే చేసెడి వాడే।
పరమేష్ఠియనగ పురుషోత్తముడన -
పరమేశ్వరుడన నతడే దత్తుడు।।
 
 
ఓరీ దక్షా ! ఙ్ఞానాంధుండవు -
నీకేమి తెలియు శివమాహాత్మ్యము।
కరుణరూపుడా పరమేశ్వరుడే -
కావున తిట్టియు బ్రతికి యున్నావు।।
 
 
శివదూషణమే మహాపాపము -
దానిని మించిన పాపము లేదట।
దానికి ప్రాయశ్చిత్తము లేదుర -
సర్వ పాపహరమగు శివనామము।।
 
 
అర్థము తెలుయునే ? సర్వమంగళుడు -
అని శివశబ్దము తాత్పర్యంబని।
శివరహితంబగు కర్మయేదైన -
అమంగళంబగు నశుభము తుచ్ఛము।।
 
 
శ్మశానవాసిని శివునర్చించిన -
శ్మశానగమనము తప్పును దక్షా!।
అపమృత్యుహరము మృత్యుంజయుడని -
తలచుటయని మునిగణములు చెప్పవె।।
 
 
దిగంబరుండే కృత్తివాసుడే -
పట్టు వస్త్రముల దాల్చనివాడే।
కానీతత్పద నతుడు ప్రతిదినము -
స్వర్గసంపదల రక్షకునింద్రుడు।।
 
 
శివపద ధూళిని శిరమునఁదాల్చును -
ప్రతి సూర్యోదయమందున సురపతి।
ఆరోజు వరకు అతడికి స్వర్గము -
సురక్షితంబగు దక్షా! వినరా !।।
 
 
సర్వసంపదల నతడే ఇచ్చును -
సృష్టి యంతయును అతడి సొత్తే।
బిడ్డలు దీనిని భోగించచూచి -
సంతుష్టుండగు ఆ మహేశ్వరుడు।।
 
 
ఓ పిచ్చివెధవ ! దరిద్రుడనగా -
అమంగళుండన నోరెట్లు వచ్చె।
నేత్ర పద్మమును అతడికర్పించి -
సర్వ లోకపతి పదవిఁ బొందె హరి।।
 
 
శిశుపాలుతిట్లు విని గోపాలుడు -
సభలో వక్కల లెక్కించినట్లు।
నీ దూషణములు లెక్కపెట్టబడు -
మహాకాలుడగు పరమేశునిచే।।
 
 
బ్రహ్మయు హరియును యత్నింపలేదె?
కనుగొననీశ్వరు మొదలును తుదినట।
హంసవరాహము రూపము లెత్తియు -
చేతగాక శివ శరణముఁజొచ్చిరి।।
 
 
వారికె తెలియనసాధ్యుడు శివుడు -
నీకేమి తెలియు వాగబోకురా।
హరివిధులముందు నీవొక చీమవు -
ఆతత్త్వ మెరుగ నీ తరమగునే !।।
 
 
నీ బోడి యఙ్ఞమెంతర దక్షా ! -
యఙ్ఞపురుషుడగు నారాయణుడే।
మేరు శైలమున ప్రతి దినమాయనను -
పూజించె కమల సహస్రార్చనల।।
 
 
నారాయణునే పరీక్షఁ జేసెను -
మాయజేసెనొక కమలము నొకపరి।
నేత్ర కమలమును పెరికి అర్పించె -
ప్రసన్నుడై శివుడెదురుగ నిలచెను।।
 
 
కౌగలించె శివుడబ్జలోచనుని -
మోహిని భావము నందుచు హరియును।
పతిగా తలచెను పరమేశ్వరునే -
పురుషోత్తముడే స్త్రీ భావమందె।।
 
 
నాటినుండియును సర్వ జగత్పతి -
పదవిని మురారి కిచ్చెను భార్యకు।
మోహినిరూపము దాల్చి భార్యగా -
పురుషోత్తముడే మారెను దక్షా!।।
 
 
నీవొక పురుషుడ వైతివీనాడు -
పురుషోత్తమునకు పురుషుడగువాని।
అల్పుడిగఁ దలచి నాడవు మూర్ఖా ! -
నీ అజ్ఞానపు జలధి అపారము।।
 
 
శివ నామమును ఉచ్చరింపగనె –
శాంతించు మనము పవిత్రతఁ గలుగు।
ఒక్కసారి శివ నామము పలుకుచు -
అనుభవమందుము మూర్ఖత్వమేల?।।
 
 
మహాప్రళయమున సర్వ జగత్తును -
భస్మముఁ జేయును కాలాంతకుడై।
సర్వమీశ్వరుని వశముననుండును -
విభూతికర్థము ఇదె భస్మమునకు।।
 
 
తాండవగళితము భస్మమును సురలు -
సంగ్రహించి తిలకంబు ధరింతురు।
శివతనువునుండి రాలినదానిని -
చూచి దరిఁజేర భీతుడగు యముడు।।
 
 
హాలహలమట జగములదహింప -
మగవాడెవడు ముందుకు వచ్చెను?।
పురుషుడొక్కడే పరమేశ్వరుడే -
దానిని మింగెను నీలకంఠుడై।।
 
 
భస్మమైతిరే నీకు తెలియదా -
అట్టహాసమున త్రిపురాసురులే।
శరభావతారమెత్తి రుద్రుడే -
నరసింహుని శాంతింప చేసెనే।।
 
 
ఆదిదేవుడా! దేవదేవుడా! -
మహాదేవుడా! నా ప్రాణనాథ!।
నా ప్రాణ దీపమారిపోనిమ్ము -
నీ నిందవిన్న బ్రతుకు నాకేల?।।
 
 
నా ప్రాణనాథ ! నీ చరణమందు -
నా ప్రాణదీప మారిపోవగా।
నాకాభాగ్యము లేదాయె నాథ ! -
వీడి కడుపునకు పుట్టినందులకు।।
 
 
నీ ప్రేమలోన జీవించియున్న -
నిజమైన భక్తురాలనైనచో।
నా పాదాంగుళి నిదిగో రుద్దితి -
భూమిపై అగ్ని పుట్టి నను గాల్చు।।
 
 
అపుడు యోగాగ్ని పుట్టెను దహించె -
సతీదేవినే హాహారవములు।
మిన్నుముట్టెనే మునిసుర కృతములు -
ఎంత భక్తియని అచ్చెరువొందిరి।।
 
 
స్వామి దూషణము విన్నమాత్రమున -
ప్రాణత్యాగము చేసిన సతినే।
మూడుచూపులును ఏకముకాగా -
చూచె విస్మితుడు పరమేశ్వరుడును।।
 
 
మూడు నేత్రముల బాష్పధారలే -
త్రిమార్గగంగా వాహినిఁ బోలుచు।
కురియగ పల్కెను స్వామి 'ఓ ప్రియా -
నీ ప్రేమ నెరుగ నాకు నసాధ్యము।।
 
 
భగవద్దూషణ శ్రవణమాత్రమున -
ప్రాణము విడచిన సతీమాతరో।
సాష్టాంగమిదియె ప్రణతులు తల్లీ ! -
మాకిమ్ము నీదు భక్తి లేశమును।।
 
 whatsnewContactSearch