home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కదలి వచ్చినాడె కళ్యాణమునకు


(శివదత్తుడు పార్వతీ దేవి దీక్షను పరీక్షించి, అనుగ్రహించి పార్వతీ కళ్యాణమునకు వెడలిన ఘట్టము).

కదలి వచ్చినాడె కళ్యాణమునకు
సుందరేశ్వరుడు సొగసుల రాయుడు కదలి వచ్చినాడె (పల్లవి)

1. జటాజూటమే కనక కిరీటము - చంద్రరేఖయే ముత్యాలసరము |
ఫాలనేత్రమే అరుణతిలకమై - సంకల్పించగ వేషము మారెను ||

2. ఉరగములయ్యెను స్వర్ణహారములు - పడగల మణులవి మార్పును చెందక |
తనువున తెల్లని భస్మము మారెను - సుగంధ కరమౌ అంగరాగముగ ||

3. గజాజినమయ్యె పట్టు వస్త్రముగ - గంగాధారయె మల్లెలమాలగ |
చరణోరగములు మణినూపురములు - కంఠ నైల్యమే కలువపూవుగ ||

4. ప్రమధగణంబులు రాజవేషముల - మేళములూదుచు వాద్యనాదముల |
బయలుదేరగా బయలుదేరెనే - పెండ్లి కొడుకై పరమేశ్వరుడు ||

5. మదవృషభంబదె నందీశ్వరుడు - సాలంకృతుడై చిరుమువ్వలతో |
స్వామిని మోయుచు సుందరగతితో- ఝలఝల ఝలఝల రవముల నడచెను ||

6. వేదమంత్రముల చదువుచుముందుగ - వాణితో నడచె బ్రహ్మ దేవుడట |
పద్మ గోవిందులిరుపక్కలలో - నడచిరి నవ్వుల కళకళలాడుచు ||

7. వాణి రచించిన మంగళ గీతుల - మధుర కంఠమున పద్మ పాడినది |
మురహరుడంతట మురళినూదెను - తలనాడించెను స్మితముఖుడీశుడు ||

8. ముక్కోటి సురలు ముందుగ పక్కల - వెనుకను నడచిరి శంఖములూదుచు |
స్వస్తి వాచనము లొప్పగ చెప్పుచు - సప్త మహర్షులు సరసనె నడచిరి ||

9. గంధర్వగణము గళమెత్తిపాడె - జయజయ శంభో జయశంభో! యని |
కిన్నరు లందరు వీణల మీటిరి - అప్సరసలంత నృత్యమునాడిరి ||

(త్రిపుర సుందరి యైన పార్వతిని వాణి, పద్మలు దేవకాంతలే సువాసినులుగా అలంకరిచిన ఘట్టము).

 
 whatsnewContactSearch