ఉత్తర తారను చంద్రుడుండగ -
సింహలగ్నమున పార్వతి పెండ్లి।
బంగారు బొమ్మ గౌరిని వధువుగ -
చేయుచుండిరదె సువాసినులార!॥
గంగయె స్వయముగ తరలివచ్చెనే -
మంగళస్నాన విధినొనరించగ।
ఆస్నాన నెపముతోడ గంగక్క -
కౌగలించెనే ముద్దుల చెల్లిని॥
పసుపును కలిపిన సున్నిపిండినే -
నలుగును పెట్టగ వచ్చిరి స్వయముగ।
వాణియు లక్ష్మియు విసిరివేసిరే -
దానిని గౌరీ తను కాంతిఁజూచి॥
పన్నీరుఁజల్ల పరుగున వచ్చిరి -
దేవకాంతలట పార్వతి మీదను।
గౌరితనువున పద్మగంధమదె –
సహజముగ రాగ విరమించిరదియు॥
బంగారురంగు ఎర్రని అంచుల -
పట్టు చీరెనే శివుని కిష్టమని।
ధరింపఁజేసిరి బంగారు కాంతి -
దేహమందునది కలిసిపోయెనే॥
బంగారు సొమ్ములన్నియు పెట్టిరి –
గౌరికి తనువున వెలవెల బోయెను।
అగ్నిలో కాలి మరింత మెరుపున -
వచ్చిన తనువది పూర్వజన్మఁ బడి॥
పూలహారములు నంగములందున -
శోభిల్లుచుండ వనదేవతలా।
పద్మవేసినది పద్మహారమును -
కొత్త శోభతో వెలుగుచుండెనది॥
మొగలిపూవులే రేకుల ముడిచి -
గులాబిపూవుల తురుముచు కట్టిన।
పూలమాలతో మేళవించిరే -
పెండ్లికూతురికి జడను వేసిరే॥
కళ్యాణతిలకమప్పుడు దిద్దిరి -
గౌరి ఫాలమున పద్మయు వాణియు।
అరుంధతి పెట్టె కన్నులకాటుక -
కాటుక చుక్కను బుగ్గపై చివర॥
హంసయానమున బయలుదేరెనే -
మేళతాళములు మిన్నుముట్టగా।
బంగారు గాజులవె కదులుచుండ -
పదముల నందెలు ఘల్లు ఘల్లుమన॥
పారాణి పాద పద్మములవియే -
జగదంబవియట కదులుచున్నవే।
అడుగు అడుగునకు కొత్త అందములు -
అప్సరసలె మరి మురిసిపోయిరే॥
వాణియు పద్మయు కౌగిలించిరే -
మోహభావమున తాళజాలకే।
త్రిపురసుందరియె పెండ్లి కూతురై -
సొగసుల దేవత నడుచుచున్నదే॥
కండ్లు మూసుకొని తపమును చేయును -
శివుడెందులకో ఇపుడర్థమాయె।
అందాలరాశి నీ గౌరమ్మను -
పొందుటకేలే అన హరి నవ్విరి॥
తత్తరలాడెను శివుని నేత్రములు -
గౌరినిఁ జూడగ బ్రహ్మ మంత్రముల।
నాలుగు ముఖముల నొకసారి చదువ -
వేరువేరుగా బాగుండుననుకొనె॥
ముక్కోటి దేవత లొక్క దృష్టితో -
చూచుచుండిరే కన్నులు చెమరింప।
మంగళసూత్రము కట్టునమ్మా -
గౌరికి మెడలో శంకరుడు॥
భగవంతుడే వరుండనగా -
భక్తజీవుడె పెండ్లికూతురు।
మంగళసూత్రమె భక్తి బంధము -
అంతరార్థమును తెలియండీ॥
భరించువాడే భర్తయగును -
సర్వభర్తయె పరమాత్మ।
భరింపబడె జీవుడు భార్య -
సహస్రార బంధమె కళ్యాణము॥