మార్కండేయుని కాపాడుటకై -
ఒకే ఒకే ఒక్క కాలితన్నుతో
కాలునె కూలదోసినాడె -
కాలకాలాయ నమో హరహర! (పల్లవి)
శివ శివ భవ భవ హర హర శంభో –
పాహి పాహియని శిశువాక్రందించ।
పటపట లింగము పగిలిపోవగా -
ఎర్రని అగ్నుల మెరుపులు ఎగిరెను॥
పటపట కొరికెను దంతములుగ్రుడు -
కన్నుల నిప్పుల వర్షము కురియగ।
ఎంత పొగరురా నీకని అరచెను -
గదిమి గర్జించె గుడ్లనురిమెనే॥
‘సావిత్రి పొగడ నిన్ను నిచ్చితివె -
పతియసువులను విధి యేమాయెను।
నన్ను పొగడు శిశువందు విధినిష్ఠ? –
ధర్మరాజు’ వని ఆక్షేపించెను॥
కాలి చుట్టుకొను కాలసర్పమదె -
బుసలను కొట్టుచు ముందుకు వంగగ।
యముని వక్షమున పదఘాతమాయె -
పాహి పాహియని సురలు మొరపెట్ట॥