home
Shri Datta Swami

 07 Feb 2002

అన్నపూర్ణతో ఆసీనుడైన - ఆదిదేవుడా!

 

అన్నపూర్ణతో ఆసీనుడైన -
ఆదిదేవుడా! ఆలకించవా
నన్నేలుమింక నారాయణ ప్రియ! -
నాకెవరు దిక్కు నాగేంద్రహార! (పల్లవి)
 
 
వారణాసిలో విశాలాక్షితో -
వేదపీఠమున వెలిగేటి దేవ!।
జీవభక్తులకు మాయలముడులను -
తల్లి విప్పగా మోక్షమిచ్చేవు॥
 
 
గంగలో మునుగ ముక్తులయ్యేరు -
బ్రహ్మఙ్ఞానమె గంగానది యన।
జలముల మునిగెడి పశువులఁజూచెడి -
మందస్మితముఖ ! పశుపతినాథ !॥
 
 
ఙ్ఞానమె తేజము కాశి అర్థమదె -
ఙ్ఞానప్రాప్తియె కాశీగమనము।
భక్త్యావేశమె గంగా స్నానము -
పరమార్థ దత్త ! పరమేశ వేష !॥
 
 
సర్వపాపహర ఈ భక్తి గంగ -
నీ కరుణ హిమమై ప్రవహించె నదిగ।
అంతరార్థమున పశుపతిని పొందు -
బాహ్యార్థమైన పశుజన్మ పొందు॥
 
 whatsnewContactSearch