home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

చంద్రశేఖరా దయాసాగరా


(ఉపమన్యువను పసిబాలుని అనుగ్రహించి పాల సముద్రమును ఒసంగిన కీర్తన )

చంద్రశేఖరా దయాసాగరా
వామదేవా! నిను వర్ణించగలనా ? (పల్లవి)

1.ఉపమన్యువనెడి తాపసబాలుడు - పాలు లేక విలపించె నాశ్రమమున |
దిక్కుతోచని తల్లి పలికెను - సర్వేశ్వరునే అడుగు పొమ్మని ||

2. అంతట బాలుడు బయలుదేరెను - దుర్గమారణ్య మార్గమందున |
నాన్నా! శంకర!  పాలనీయవా! - అన్న వాక్యమే మంత్రమాయెను ||

3. ప్రళయ భయంకరుడైనను నీవు - కరిగిపోతివి కరుణార్ణవమా |
యుగయుగ తపముల కందనివాడవు - క్షణమున ఎదురుగ నిలిచినావు ||

4. ఫాలనేత్రము నుండియు కురిసెను - వేడి వేడి కన్నీటి ధారలు |
పాలబుగ్గల పసివానిఁ జూసి - నాన్నా రమ్మని కౌగలించితివి ||

5. తొడను కూర్చుండ పెట్టుకొంటివి - చేతిలోనికే పరుగున వచ్చెను |
పాలసముద్రమె బాలున కీయగ - నీ కరుణఁ జూచి అసురులె ఏడ్చిరి ||

 
 whatsnewContactSearch