కైలాసము వీడి కదలివచ్చినాడే -
కలకలనవ్వెడి కలికి వెంటరాగ।
మందాకిని తట మందగమనమున -
మందహాసమున భక్త మందారుడు॥
అడుగులు వేయుచు గంభీరముగా -
ఎర్రని జటలవె ఎగురుచుండగా।
చేతుల నూపుచు వీరాధివీరుడు -
మృగముల రాజగు సింహము రీతిగ॥
శిరసు చంద్రకళ పక్షి ఈకెగను -
ఫాలనయనమె కుంకుమ బొట్టుగ।
ఉరగ భూషణములు పూసలదండలు -
మారిపోవ శివ కోయరాజతడు॥
ఆదిదేవుని అడుగుల బాటను -
హిమగిరి వనమదె అప్పటికప్పుడె।
పుష్పముల రాల్చి పూలబాటగా -
అర్చించెనట అనఘా ప్రియుని॥
అతిధీరముగా అతి విలాసముగా -
వామదేవుని నడకల సొగసులు।
తనివితీరగా ఆలోకించిరి -
ఆకాశమందు అప్సరసలట॥
అనవసరముగా రెచ్చగొట్టియు -
ఓడించి మరల గెలిపించి నరుని।
అనుగ్రహించెనదె పాశుపతమిచ్చి -
అపార కరుణా సాగరుడతడే॥