కాలకంధరా! ఇదె కార్తికదీపం
నాగాభరణా ! ఇది నా ప్రాణదీపం
భక్తి తైలమై ఙ్ఞానమె వత్తిగ
వెలిగింది దేవ ! నీ కోసమేను (పల్లవి)
నా బాష్పధార - గంగా జలమై।
గద్గద గళమే - డమరు నాదమై।
తనువున కంపమె - శివతాండవమై।
(నను) నీ పాదధూళి - కణమై పోనీ !॥
అహంకారినై - పాపాత్ముడినై।
పతితుడనైతిని - పరమేశా।
నీవె కాదన్న - నేనేమి చేతు।
నీ పదముల పడి ఏడ్చెదను॥
నాథ! నీవుండ - అనాథుడనైతి।
కరుణార్ణవమా - కదలి రావేల ?।
(నీ) ఙ్ఞానాగ్ని నేత్ర - శిఖలో కాలెద।
(నను) నీ దయా గంగలో - కలిసిపోనీ !॥
ఏనాటికైన - నీవాడ నేను।
నిను వీడి బ్రతుక - లేనీ కలిని।
నా ప్రాణనాథ - నీ చరణమందు।
నా ప్రాణదీపం - ఆరిపోనీ॥