home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శివ తాండవ కీర్తన


1. కైలాస మందు - కలవరమాయెను | చూడవె పద్మా నా కొండనెక్కి |
శివ దత్తుని సుందర నృత్యమదే | మధ్య మధ్య నదె రుద్ర తాండవము ||

2. విష్ణుదత్తుడగు నాతో నృత్యము - చూడ వచ్చెనదె బ్రహ్మ దత్తుడును |
ప్రళయ కాలమున ఇరువురమగుదుము - శివదత్తునిలో ఐక్యము చివరకు ||

3. ఒకడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన త్రిగుణ వేషములు |
ఊహవిశ్వ రచనా వ్యూహమీవు - ఊహసుందరివి అనఘవు పద్మా ! ||

4. మధుమతి ! లలితవు ! దుర్గవు ! కాళివి - రాజరాజేశ్వరివి ప్రధమోహవు |
వాణియు లక్ష్మియు గౌరియు నీదగు - ముచ్చట గొలిపెడి ముద్దువేషములు ||

5. అనసూయాత్రులు ఆనందముతో - ఆలోకింపగ ఆసినులైరి |
ఋక్ష పర్వతము నందున వారికి - దత్తపుత్రునిగ దత్తుడు నిలచెను ||

6. తకధిమి తకధిమి నంది మృదంగము - ప్రమధ గణంబుల వాద్యనాదములు |
నర్తనలోలుడు నటరాజు శివిడు - తాండవమాడెను దత్తాత్రేయుడు ||

7. పదములకదనము వడివడిగాబడ - బహువిధ భంగిమ లంగములొప్పగ |
అటునిటు నెర్రని చూపుల ద్రిప్పుచు – పాణి పద్మముల ముద్రాల చూపుచు ||

8. గంతులువేయగ కాలికి చుట్టిన - కాల సర్పమదె కస్సుబుస్సుమన |
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున ||

9. శ్రీశైలరాయుని శివతాండవమున - చిందుల అందము లేమందునె చెలి |
అప్సరసలె తమ నాట్యమేలయని - సిగ్గుతో తలల వంచిరి చూచుచు ||

10. కాశీపురపతి కాలిగంతులవె - కంపించె శేషుడల్లాడెను ధర |
అదిరి దిక్కరులు కుంభస్థలముల - తొండములెత్తుచు ఘీంకరించినవి ||

11. కాలభైరవుని కరాళ వక్త్రము - ఫాలాక్షి వహ్ని దీధితి మెరుపుల |
అట్టహాసముల చేయగ ప్రాణులు - గడగడ వణుకుచు పరుగులెత్తిరే ||

12. శివశివ భవ భవ శంభో ! హరహర ! - అనుచు మహర్షుల ఆర్తనాదములు |
మిన్నుముట్టినవి శరణాగతితో - శాంతింప జేయ ఆ తాండవమును ||

13. కాలకంఠుడదె రుద్రతాండవము - చేసెను త్రిప్పుచు ఢమఢమ ఢక్కను |
కైలాసాచల శిలా స్ఫటికములు - విస్ఫోటనముల బీటలు వారెను ||

14. విశ్వేశ్వరతను విభూతి చిందెను - వెచ్చ వెచ్చనిది పరమపావనము |
నుదుట ధరింపగ ఇంద్రాదులంత - నక్కి నక్కి అట సంగ్రహించిరే ||

15. నందీశ్వరుడదె రంకెలు వేయును - గర్జింతురగో ! ప్రమధగణంబులు |
చిందులు తొక్కెను చిరుత గణేశుడు - మయూర వాహనుడాడె మైమరిచి ||

16. ద్వాదశ లింగము లుజ్జ్వలమయ్యెను - గంగ పరవళ్ళు తొక్కుచు పారెను |
నాగాభరణములాడె నాట్యమును - కంపించె చంద్ర కళయును సొగసుగ ||

17. గంగాధారల చినుకుల జల్లుల  - చంద్ర రేఖ హిమ బిందువులెగురగ |
రెండు కన్నులను చల్లని చూపుల - ఆనంద మొకసారి వెలయు ||

18. ఫాలాగ్ని చక్షు రుగ్రాగ్ని శిఖలు - ఎర్రని కాంతులు చిమ్ముచుండగను |
అహి భూషల పుత్కారములందున - రుద్ర తాండవము చెలగునొకసారి ||

19. ఎర్రని జటలెగురగ పంచాస్యుడు - అట్టహాసముల తాండవమందున |
ఎర్రజూలు ఎగురగ పంచాస్యుడు - దూకి గర్జించు రీతిగఁ దోచెను ||

20. శేషుని సహస్ర ఫణములదొర్లుచు - భూగోళమాడె బంతిని పోలుచు |
దానిని నిలుప వేయి పడగలను - రొప్పుచు తిరిగెను పాదఘాతముల ||

21. భంభం నాదము లంబరమంటగ - శంఖ ధ్వనులను ప్రమధులు చేసిరి |
అప్సరసలాడిరీక్షించి నాట్య - నవ్య భంగిమల నేర్చుకొనగ దివి ||

22. చుక్కల రాలెను ముక్కంటి చూపు - వర్షించు విస్ఫులింగములంటగ |

సూర్యదేవుడును చిటపట లాడెను- ఏడు గుర్రములు సకిలించి నిలచె ||

23. శాంత నృత్యముల వీణలు మీటుచు - నారదతుంబురు లెగురుచు పాడిరి |
రుద్రతాండవము లందున భయపడి - కల్ప వృక్షముల చాటున దాగిరి ||

24. అదురుచు బెదురుచు పరుగులెత్తుచును - ఆక్రందించిరి అసురేశ్వరులే |
హరహర శంభో పాహి పాహియని - ప్రణతులఁ జేయుచు సాష్టాంగముగా ||

25. నటనములందున పదముల మృదుమృదు-నూపుర ఝలఝల రవములు చిందగ
సుందరేశ్వరుని శిరసున గంగా - లహరీ ధ్వనులవె తాళములాయెను ||

26. ఎగురుచు దూకుచు వంగుచు లేచుచు - మెలికలు దిరుగుచు వక్రభంగిమల |
చంద్రశేఖరుడు తాండవమాడెను - తళతళ మెరిసెడి తెల్ల నాగువలె ||

27. హిమాలయాచల మందున దూకెడి - తెల్ల మంచుపులి విద్యుద్రయముగ |
వామదేవుడదె తాండవ ధాటిని - అంగ భంగిమల చకచక మార్చెను ||

28. ఒకసారి మంద మధుర స్మితుడగు - ఒకసారి అట్టహాస గర్జనుదు |
మాధుర్యమొకచో రౌద్రంబొకచో - అమృత హాలహల పారవారముగ ||

29. గౌరిముఖ పూర్ణేందు బింబమును - చూచిన వెంటనె హరుడుప్పొంగెను |
అంగములాడగ నృత్యము చేసెను - పున్నమి రాతిరి పొంగిన జలధిగ ||

30. గౌరమ్మ కూడ నృత్యము చేసెను - కొంతకాలమట శివునితో గూడి |
తాండవధాటికి అలసి కూర్చుండె - స్విన్నావయవము లదురుచు నుండగ ||

31. నీలలోహితుని నిరుపమ తాండవ  - మానందార్ణవ మవధులు లేనిది |
నా విశ్వరూప దర్శన సమమది - చూడువారలకు జన్మ ధన్యమగు ||

32. రుద్రాక్ష హార వలయము లురమున - గలగల రవములు చేయుచునుండగ |
వాసుకి గళమున నర్తించె పడగ - మణిదీధితులవె నృత్యము చేయును ||

33. ఒకచో ఢక్కను కొట్టును తిప్పుచు - ఒకచో శూలము తిప్పుచు తిరుగును |
ఒకచో చూపును రిక్త హస్తముల - నాట్య ముద్రలను నటరాజు శివుడు ||

34. నారాయణ ప్రియుడతడె పద్మా ! నంది వాహనము గంతులు వేయగ |
మెడలో పదముల గల గజ్జెలతో - గల గలశబ్దము కర్ణ ప్రియమదె ||

35. నటన మనోహరుడెంత సుందరుడు - దిష్టి తగులునని పుర్రెల మాలల |
సర్ప భూషలను ధరించునీశుడు - కామున కీర్ష్యను పరిహరింపగా ||

36. కాముని దగ్ధము చేసెనందురిల - వట్టి మాటయది సుందరేశ్వరుని  |
అందము చూసిన స్మరుడె చేసుకొనె -ఆత్మ హత్యనే తగుల బెట్టుకొని ||

37. అతడే కనకా భరణములఁ దాల్చు - పురుష మోహనుడ నేనె మోహినిగ |
మారిమోహమును పొందితి కలిసితి - మణికంఠునికే జన్మ నిచ్చితిని ||

38. నన్నుజూచి మునులెత్తిరి జన్మల - గోపికలుగ పురుషులకె మోహము |
నా అందము కలిగించె నాకె అది - శివునిఁ జూడగా కలిగెను పద్మా ||

39. ఋషుల హృదయముల వికార హేతువు - నేనైతిని గద నా పాపమునకు |
శిక్షగ నాకే  ఆ వికారమే - కలిగెను కర్మ ఫలంబులు తప్పవు ||

40. ఆది దేవునిది అద్భుత తాండవ - మవలోకించిన భరత మహర్షియు |
నాట్య శాస్త్రమును వ్రాసె శంకరుడు - నాట్యాధి దేవుడనగ దత్తుడే ||

41. హావ భావముల నభినయించుచును - ఆడుచున్నాడు ఆది దేవుడదె |
చూడుము పద్మా! ఎంతో పుణ్యము - చేసిన వారికె లభ్య మీ ఫలము ||

42. నీలకంఠుడదె నిర్మల హృదయుడు - నిష్ఠానియతుదు నిశ్చల చిత్తుడు |
కరుణా సాగరు డత్యుదారమతి - ఆత్మ సౌందర్య మపారమతడిది ||

43. రావణుడడిగిన పార్వతి నిచ్చెను - ఉపమన్యువడుగ క్షీరాబ్ధినిచ్చె |
భస్మాసురునకు తననే భస్మము - చేయు వరమిచ్చె ప్రేమ సముద్రుడు ||

44. శివుని కళ్యాణ గుణ రూపములను - ఆదిశేషుడును వర్ణించలేడు |
అతడి పొందుకై ఎంత తపించెను - పార్వతి దానిని బట్టియె తెలియును ||

45. నీ మొగుడు నేను నిజమే పద్మా - నా మొగుడు శివుడు మోహిని నైతిని |
శివుడు తండ్రిగా నేను తల్లిగా - నా సుతుడు బ్రహ్మ గురువుగ నగుదుము ||

46. ఒక్కడె దత్తుడు వాని భావములె - గుణత్రయముగా త్రిమూర్తులైతిరి |
భావమె రూపము దాల్చె నూహయది - గుణమన భావమె గుణమే రూపము ||

47. ఒక్కడె మనుజుడు మూడు భావముల - నున్న రీతిగా ముగ్గుర ముందుము |
సృష్టి స్ధితి లయ కర్మ భావముల - త్రిమూర్తులనగా త్రిగుణ భావములె ||

48. ఊహించునపుడు బ్రహ్మ దేవుడన - ఊహను నిల్పగ విష్ణుదేవుడన |
ఊహనాపగ రుద్ర దేవుడన - ఒక్కడె దత్తుడు మూడు నామముల ||

49. ఒకచో నొక్కొక మూర్తి గొప్పయగు - మిగిలిన యిరువురు తగ్గియుందురిట |
ఈ భేదమంత క్రీడా వినోదము - పరమార్ధములో ముగ్గురు ఒక్కడె ||

50. ఆడేదినేను చూచేది నేను - నా ఆట నేనే ఆనందింతును |
ఆనందిచుట కొరకై భేదము - మాయా బలమున కల్పించెదనిట ||

51. మూడు భావముల త్రిమూర్తులైతిని - నానా భావము లయ్యెను జగతిగ |
దత్తైక్యముతో త్రిమూర్తులుందురు - దత్త భిన్నముగ జగములు వెలుగును ||

52. దత్తాధారము జగత్తు భిన్నము - నేతి నేతియని శ్రుతియిదె చెప్పును |
పీటపైన ఘటమున్నది కానీ - ఘటమందు పీట లేదని తెలియుము ||

53. త్రిమూర్తులందున వ్యాపించియుండు - దత్తుడు తేగెలో విద్యుత్తు బోలి |
విద్యుత్తు తీగె తీగె విద్యుత్తు - మేమే దత్తుడు దత్తుడే మేము ||

54. తాదాత్మ్యమున్న భావమె త్రిమూర్తి - తాదాత్మ్య హీన భావమె జగత్తు |
భావరహితుడె నిర్గుణ దత్తుడు - భావము చీమగ నున్నను లేనిదే ||

55. జగత్తులున్నను లేకున్న నొకటె - అద్వితీయుడే దత్తుడు బ్రహ్మము |
గుణమన చీమయె నిర్గుణుడెప్పుడు - నిర్గుణ సగుణము లద్వితీయములె ||

56. ఆహా ! తాండవమెంత రమ్యమది - బాహ్యాత్మలలో సుందరుడు శివుడు |
సుందరేశ్వరుడు వాని తాండవము - కాకుండనెట్లు సుందర మయముగ ||

57. పంచ చామరము ఛందస్సు నందు - ఏవిధి పదముల గంతులు వినబడు |
ఆ విధి పదముల గంతులు వినబడు - నూపుర రవములు కర్ణ సేయములు ||

58. కాళీయ మర్ధన మందున నేనును - శివ తాండవమును చేసి చూపితిని |
శివతాండవమును చూసిన పిమ్మట - అట్లు చేయమది కోరిక కల్గెను ||

 
 whatsnewContactSearch