19 Apr 2025
Updated with part-2 on 20-04-2025
Part-1
[26-02-2003] గుణకర్మలను బట్టి ఉత్తమత్వము, అధమత్వము సిద్ధించుచున్నవి. గుణములలో శ్రేష్ఠమైన గుణము సత్త్వగుణము. సత్త్వగుణము అనగా సాధుప్రాణులకు అపకారము చేయకుండుట. సాధుప్రాణులు అనగా సత్త్వగుణముతో నుండు నరులు, జంతువులు, పక్షులు, కీటకములు. రజోగుణము అనగా క్రోధమయమైన క్రూరత్వముతో జీవించు రాక్షసులు అనబడు నరులు, జంతువులు, పక్షి, కీటకాదులకు తిరిగి అపకారము చేయుట. శిష్టరక్షణము సత్త్వగుణము. దుష్టశిక్షణము రజోగుణము. ఈ రెండు గుణములు గొప్పగుణములే. కాని, రజోగుణముకన్నను సత్త్వగుణము గొప్పది. ఏలననగా ధర్మశాస్త్రము ప్రకారము ఒక దుర్మార్గుడు శిక్షనుండి తప్పించుకొనవచ్చును. కాని, ఒక సాధుప్రాణి అకారణముగా హింసింపబడరాదు. కావున దుష్టశిక్షణము చేయు రజోగుణము కన్ననూ శిష్టరక్షణము చేయు సత్త్వగుణము గొప్పది. కావున సాత్త్వికులు సజ్జనులను, సాధుప్రాణులను ఎట్టి పరిస్థితులలోను హింసించరు. సజ్జనులకు అపకారము చేయకుండుట మరియు సాధుప్రాణులను హింసించకుండుట అహింసయనబడును – ‘అహింసా పరమోధర్మః’. సజ్జనులగు ఋషులను హింసించి నరమాంసమును భక్షించువారు రాక్షసులు అనబడుచున్నారు. అట్లు సాధుప్రాణులగు మేకలు, గొర్రెలు, కోళ్ళు, లేళ్ళు, కుందేళ్ళు మొదలగు వాటిని వధించి భుజించువారే శూద్రులు అనబడుచున్నారు. ఈ జంతువులు, పక్షులు మానవులకు ఎట్టి అపకారము చేయుటలేదు. ఇవి మానవులకే కాదు ఏ ఇతర జీవులకునూ అపకారము చేయుటలేదు. మానవులు తినకుండా విసర్జించిన గడ్డిని ఇవి తింటున్నాయి. పంటలు పండినప్పుడు కూడా ధాన్యమును మానవులు తీసుకొనగా మానవులు తినని మిగిలిన కాండములను ఇవి తినుచున్నవి. నీకునూ, మరెవ్వరికినీ ఎట్టి అపకారము చేయక నీవు తినని ఆహారమును తిని బ్రతికెడి వాటిని వధించి భుజించనేల?
ఈ కారణముననే శూద్రుడు అధముడగుచున్నాడు. ఈ అధమత్వము వాని జన్మచేత వచ్చినది కాదు. అది కేవలము వాని గుణకర్మల చేతనే వచ్చుచున్నది.
ఇక ఈ సాధుప్రాణులలో మానవునకు ఉపకారము చేయు ప్రాణుల నుండి ఉపకారమును పొంది అవి ఉపకారము చేయనప్పుడు వాటిని వధించి భుజించుట ఇంకనూ మహాపాపము. పొలమును దున్ని పంటలు పండించిన ఎద్దులను, దున్నలను మరియు పాలిచ్చిన గేదెలను, ఆవులను ముసలితనము రాగానే అవి ఉపయోగపడనందున వాటిని వధించి భుజించువాడే చండాలుడు. ధాన్యసంపదనిచ్చిన ఆ వృషభములు, మహిషములు తండ్రితో సమానము. పాలిచ్చిన ఆవులు, గేదెలు తల్లితో సమానము. ఇట్టి పరమనీచమైన గుణకర్మలను కలిగినవాడే చండాలుడు కానీ జన్మచేత చండాలుడు కాడు. ప్రభుత్వము వద్ద ఉద్యోగము చేసి ముసలితనములో ఉద్యోగము చేయలేక పదవీ విరమణ చేసినవానికి ఫించను ఇచ్చి పోషించుచున్నారే కాని వారిని వధించుట లేదు. సర్వప్రాణులకు ఒకే నీతి ఉండవలెను. ఉపకారము చేసిన ఈ పశువులను స్వయముగా చేతులతో చంపలేక వాటిని కబేళా స్థానమునకు పంపు నేటి శూద్రులు కూడా దాదాపు చండాలురే. కావున శూద్రత్వము, చండాలత్వము వారి యొక్క గుణములను బట్టియు, వారు చేయు కర్మలను బట్టియే వచ్చుచున్నవే కాని జన్మచేత వచ్చుట లేదు.
రావణాసురుడు సీతతో నీవు మాట వినకున్నచో ఇక రెండు నెలలు కాగానే నిన్ను మా వంటఇంటిలో కోసి వండుదురు అని చెప్పినాడు. కావున రావణుడు జన్మ బ్రాహ్మణుడైననూ కర్మ చండాలుడే. ఇక క్షత్రియుడు ఎవరు అనగా సాధుప్రాణులను హింసించు క్రూర నరులను, క్రూర ప్రాణులను వధించువాడు. క్షత్రియునకు వేట ముఖ్యధర్మము. వేట యనగా కేవలము సాధుప్రాణులను హింసించు క్రూర మృగములను వధించుటయే. ఇక బ్రాహ్మణుడు అపకారికి సైతము అపకారము చేయనివాడు. అందుకే మనుసృతిలో ‘ఘాతం న ఘాతయేత్ విప్రః క్షత్రియో రిపుఘాతుకః’ అని చెప్పబడినది. అనగా క్రూరులను సైతము హింసించనివాడు బ్రాహ్మణుడు. కేవలము క్రూరులను హింసించువాడు క్షత్రియుడు. బ్రాహ్మణునకు ధర్మశాస్త్ర జిజ్ఞాస ఎక్కువగా వుండును. ఒకడు దుష్టుడా? కాదా? అని తీవ్రముగా చర్చించుటచేత ఏ ఒక్క సుగుణము కనపడినను వారిని హింసించినచో తనకు పాపము వచ్చునేమో అను భయముతో వానిని వదలివేయును. క్షత్రియుడు అట్లు కాదు. ధర్మశాస్త్ర జిజ్ఞాసకు ఒక పరిధిని పెట్టుకొనును. కావున బ్రాహ్మణ, క్షత్రియ వర్ణములు రెండునూ ఉత్తమములని గీతలో ‘కిం పున ర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయ స్తథా’ అని చెప్పబడినది. అయితే ఈ బ్రాహ్మణ, క్షత్రియ వర్ణములు జన్మచేత కాదని వారి వారి గుణ కర్మలచేత మాత్రమే ఏర్పడునని పదే పదే స్మరించవలెను. బ్రాహ్మణుడు అనగానే బ్రాహ్మణ దంపతులకు పుట్టినవాడు అను భావము అందరిలో జీర్ణించుకొని పోయి ఉన్నది.
కాలక్రమమున ఈ బ్రాహ్మణులును, క్షత్రియులును గుణకర్మ భ్రష్టులై శూద్రత్వమును పొందుచున్నారు. క్రూర మృగములను మాత్రమే వేటాడవలసిన క్షత్రియుడు జింకలు మొదలగు సాధుప్రాణులను చంపి భుజించుట ఆరంభించినాడు. అట్లే బ్రాహ్మణులును యజ్ఞముల యందు సాధుప్రాణులగు మేకలను చంపి యజ్ఞప్రసాదము పేరుతో భుజించుట ప్రారంభించినారు. తన పుత్రులను చంపిన విశ్వామిత్రుని వధించక సహించినాడు వశిష్టుడు. ఇదే బ్రాహ్మణత్వము. తన భార్యను బాధించిన రావణుని సంహరించినాడు రాముడు. ఇదే క్షత్రియత్వము. బ్రాహ్మణుడగు వామనునకు, క్షత్రియుడగు రామునకు మధ్య నున్న అవతారమే పరశురాముడు. ఇతడు బ్రాహ్మణ, క్షత్రియ ధర్మముల యొక్క సంధిస్థానము. తండ్రి జమదగ్ని బ్రాహ్మణుడు. తల్లి రేణుక క్షత్రియ స్త్రీ. శిష్టరక్షణము అను బ్రాహ్మణ ధర్మము, దుష్ట శిక్షణము అను క్షత్రియ ధర్మము రెండునూ కలిగినవాడు పరశురాముడు. ఈ రెండునూ భగవత్ తత్త్వమునకు రెండు కన్నుల వంటివి. రెండునూ ఉండవలసినవే. ఇట్టి సంపూర్ణ జ్ఞానమును పరశురాముడు తన గురువైన ‘గురుదత్త’ భగవానుని నుండి పొందినాడు. యజ్ఞములో వధించవలసినది పశుత్వమును గానీ, పశువును కాదు అని ‘మన్యుః పశుః’ అనే శ్రుతి చెప్పుచున్నది. మన్యువు అనగా అజ్ఞానము. అహంకారము వలన వచ్చిన మొండితనము. ఇదే పశుత్వము. దీనిని జ్ఞాన యజ్ఞములో వధించవలెను. కావున శ్రుతి మొండితనము అను పశువును వధించుము అని చెప్పుచున్నది. అట్లే యజ్ఞములో అగ్నిగుండమున హుతము చేయవలసినది కోరికలు గాని నెయ్యి కాదు. దీనినే శ్రుతి ‘కామ ఆజ్యమ్’ అని చెప్పుచున్నది.
అట్లే పరమాత్మ నుండి ఎట్టి ప్రతిఫలమూ కోరక నిష్కామముగా సేవించవలెను. కావున నీ కోరికలే ఆజ్యము అని శ్రుతి చెప్పుచున్నది. ఈ విధముగా భగవంతుని దూత అయిన మనుప్రజాపతి సాధుప్రాణి హింసను క్రమక్రమముగా నిషేధించినాడు. అది ఈ క్రింది విధముగా ఉన్నది. అన్ని చోటులా చేపలు పట్టువానిని కాశీ మొదలగు పుణ్యక్షేత్రములలో పట్టవలదనియు, ఏకాదశీ మొదలగు పుణ్యతిథులందు పట్టవలదనియూ మరియు క్షత్రియులు కేవలము 5 రకముల మృగములనే వేటాడవలయుననియు చెప్పినాడు. ఈ విధానములో క్రమక్రమముగా అధర్మమును తగ్గించుకొనుచూ వచ్చి చిట్టచివరకు ఏ సాధుప్రాణినీ హింసించరాదని అదియే సర్వధర్మముల సారమనియూ ‘అహింసా పరమో ధర్మః’ అని బోధించినాడు. శ్రీరాముడు మారీచుడు లేడిగా వచ్చినప్పుడు దాని వెంటబడి చివరకు అది రాక్షసమాయే అని గ్రహించి బాణమును వేసి వధించినాడు. అయితే పంచవటిని నిర్మించినప్పుడు రాముడు పోయి ఒక లేడిని వేటాడి చంపి తీసుకొనివచ్చినాడనియు సీత దానిని వండి పెట్టినదనియూ అరణ్యకాండలో కలదు. కానీ ఈ సన్నివేశమును వర్ణించు శ్లోకములు రామాయణములో దూర్చబడినవి. వీటినే “ప్రక్షేపములు” అందురు. సుందరకాండలో ‘న మాంసం రాఘవో భుఙ్క్తే’ అని రాముని గూర్చి హనుమంతుడు చెప్పుచూ రాముడు మాంసాహారి కాదని చెప్పినాడు. కారుణ్య కళ్యాణగుణ స్వరూపుడైన పరమాత్మ ఇట్టి అధర్మమును ఎన్నడూ చేయడు. జూదము గురించి ఏమియూ తెలియని ద్రౌపదికి వస్త్రాపహరణము జరుగుచున్నప్పుడు భీష్మ, ద్రోణులు అచ్చటనే ఉన్నారు. క్షత్రియుడైన భీష్ముడు దుష్టశిక్షణము చేయవలెను. బ్రాహ్మణుడైన ద్రోణుడు శిష్టరక్షణము చేయవలెను. అవి వారు చేయలేదు కావుననే భీష్ముని వంటినిండా బాణములు గుప్పించబడి శరశయ్యపై ఒరిగినాడు. అట్లే అస్త్రసన్యాసము చేసి ధ్యానములో ఉన్న ద్రోణుని కంఠము కత్తితో కోయబడినది.
Part-2
స్త్రీ భర్తతో సహగమనము చేయుట సనాతన ధర్మము కాదు. ఈనాడు ఒక రాజకీయ నాయకుడు మరణించగా కొందరు వీరాభిమానులు ఆత్మాహుతి చేసుకొనుచున్నారు. ఇవి అన్నియూ ఆత్మహత్యలు. ఇవి మహాపాపములని ‘యే కే చాత్మహనో జనాః’ అని శ్రుతి చెప్పుచున్నది. మానవజన్మ ఎంతో దుర్లభము. పరమాత్మప్రాప్తికై ప్రయత్నించుటకు కలసి వచ్చిన అదృష్టము. అట్టి మానవ జీవితము ఒక జీవుడు సాటి జీవుని కొరకు త్యజించరాదు. ఈ జన్మలో ఎంతో ప్రేమతో అన్యోన్యముగ ఉన్న ఈ దంపతులు వెనుక జన్మమున పరమశ్రతువులై ఉండవచ్చును. రాబోవు జన్మమున పరమశత్రువులు కావచ్చును.
ఇట్లు ఆత్మహత్యయే మహాపాపము అగుచుండగా ఒక స్త్రీని బలవంతముగా భర్త యొక్క చితిలోకి త్రోయుట సాధుప్రాణి హత్యయగును. కావున ఇట్టి మహాపాపములు సనాతన ధర్మములు కావు. ఇక పురుషులు స్త్రీల నుండి వరకట్నము గుంజుచున్నారనుట ఆధ్యాత్మికమునకు సంబంధించని విషయము. కొన్ని తరములకు ముందు కన్యాశుల్కము ఉన్నది. అనగా కన్య యొక్క తండ్రి వరుని నుండి ధనమును గుంజుకొనెడివాడు. కావున ఈ ధర్మము కాలానుగుణముగా దేశానుగుణముగా మారుచున్నది. వేదములో ‘మనుః పుత్రేభ్యః దాయమదాత్’ అని వ్రాయబడి ఉన్నది. అనగా మనువు తన పుత్రులకు తన ఆస్తిని పంచియిచ్చెను అని అర్థము. ఇచ్చట పుత్ర శబ్దమునకు కుమారులు, కూతుళ్ళు అని అర్థమున్నది. కావున స్త్రీ, పురుషునితో పాటు సమానమైన అధికారమును ఆస్తియందు కలిగియే ఉన్నది. కానీ కుమారులు చేయవలసిన ప్రత్యేకవిధులు కొన్ని ఉన్నవి. అవి స్త్రీలు చేయలేకపోవుట కొన్ని పరిస్థితులలో జరగవచ్చును. అయినా, అప్పుడు పుత్రికకు కొంత ధనము వచ్చును. దీనినే మనువు ‘స్త్రీధనమ్’ అన్నాడు. ఈ స్త్రీధనము సమానమైన వాటా అగునా కాదా అనునది ఆయా కర్తవ్యముల, పరిస్థితుల బట్టి మారుచుండును. ఈ స్త్రీధనమునకే వరకట్నము అని పేరు పెట్టి ఈయగలిగిన వారు ఎగగొట్టుటకు ప్రయత్నించుచున్నారు. కానీ ఇవ్వలేని సజ్జనులను బాధించి గుంజుట పాపము. ఈ స్త్రీధనము కూడా ఒక్క సారిగ ఇచ్చినచో భర్త బలవంతుడై లాగుకొనవచ్చును. కావున పండగలకు పిలుచుకొని వచ్చి కొంచెము కొంచెము ఇచ్చుట కూడా కలదు. ఇట్లు చేయుటకు కారణము స్త్రీలకు శారీరకబలము లేకపోవుటయే. కానీ నేడు కొందరు స్త్రీలు కరాటే ప్రవీణులగుచున్నారు. కావున ఈ ధర్మము కాలమాన పరిస్థితులను బట్టి మారుచుండును.
కొందరు ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని మనుప్రజాపతి ఎట్లు వ్రాసినాడని నిషేధించినారు. ఆ శ్లోకము యొక్క అర్థము బాల్యమున తండ్రి వశమని, తరువాత వయస్సులో భర్త వశమని, ముసలితనమున కుమారుని వశమున ఉండవలయునే తప్ప, స్త్రీకి స్వాతంత్ర్యము పనికిరాదని అర్థము. వెంటనే స్త్రీలు అణచబడినవారని మహిళా సంఘముల నినాదములు వచ్చుచున్నవి. ఈ శ్లోకము యొక్క అంతరార్థము తెలియక అపార్థమువలన ఈ వివాదములు వచ్చుచున్నవి. ఈ శ్లోకము యొక్క సరియైన అర్థమేమనగా సనాతన సంప్రదాయము ప్రకారముగా బాల్యము నుండి స్త్రీ అనేక బంగారు ఆభరణములు ధరించుట కలదు. మరియు శరీర సౌకుమార్యమువలన దుండగులు బాధించవచ్చును. కావున స్త్రీ పురుషుని తోడు లేకుండా ఒంటరిగా ఉండరాదనియే దీని తాత్పర్యము. ఇచ్చట తండ్రి, భర్త, కుమారుడు ఆమెకు అంగరక్షకులుగా పని చేయుచున్నారు. ప్రధానమంత్రి వచ్చినపుడు వెంట అంగరక్షకులు వత్తురు. ఆయన ఎటుపోయినా అంగరక్షకులు అటు వత్తురు. ఆయన కోపముతో ఏమిటి ఇది నాకు స్వాతంత్ర్యము లేదా? అని వారిపై అరచినచో ఎట్లుండును? కావున కరాటే ఫైటింగులు నేర్చుకొని ఆత్మరక్షణ చేసుకొనగలిగినచో ఈ అంగరక్షకుల అవసరము లేదు. అదే మనుస్మృతిలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అను శ్లోకము కూడా ఉన్నదని గ్రహించవలెను. అనగా వినయము మొదలగు సత్త్వగుణములు కలిగిన స్త్రీలు ఎచ్చట గౌరవింపబడుదురో అచ్చట సర్వగుణ సంపన్నులైన దేవతలు ఆనందింతురు అని అర్థము.
స్త్రీలకు విద్యలేదనుట సరికాదు. గార్గి, మైత్రేయి, సులభయోగిని మొదలగు అపార పాండిత్యము కల స్త్రీలు ఉన్నారు. శాస్త్రవాదములో గార్గి చేతిలో యాజ్ఞవల్కుడు ఓడినాడు. జ్ఞానాధిదేవతయగు సరస్వతి స్త్రీయే. సత్యభామ నరకునితో యుద్ధము చేసినది. దుర్గాదేవి శుంభ, నిశుంభులను, మహిషుడను మహాదైత్యులను వధించినది. రాజేశ్వరీమాత యొక్క సింహాసనమును త్రిమూర్తులు మోయుచున్నట్లు మంత్రశాస్త్రమున వర్ణింపబడినది. కావున జ్ఞానము, ప్రేమ మొదలగు సాత్త్విక కళ్యాణగుణములను బట్టియే ఉత్తమత్వము లభించుచున్నది కాని బ్రాహ్మణాది కులభేదముచేత గాని, స్త్రీ పురుషాది లింగభేదముచేత గాని కాదని సనాతన సంప్రదాయ ధర్మమును నడిపించు సనాతన ధర్మసారథియగు ‘శ్రీగురుదత్త’ భగవానుడు ఘంటాపథముగా సత్యమును వ్యవస్థాపించుచున్నాడు.
★ ★ ★ ★ ★