21 Apr 2025
Updated with Part-2 on 22-04-2025
Part-1
[26-03-2003] గురుత్వము ముందు ఏర్పడవలెను. ఆ తరువాత గురుత్వములో దైవత్వము సిద్థించును. గురుత్వము కలిగిన వారు మానవుడైననూ కావచ్చును. కాని దైవత్వము కేవలము మానవరూపమున వచ్చిన మాధవునికి మాత్రమే ఉండును. గురుత్వము కేవలము గ్రంథజ్ఞానమునకు మాత్రమే పరిమితమై యుండును. దైవత్వము లేని గురువు బోధించు మాటలు అనుభూతిని కలిగించజాలవు. అవి కేవలము బుద్ధికి పదును పెట్టునే కాని హృదయములోనికి దూరి ఆత్మలోనికి వ్యాపించి ఆత్మను ఆనందమయముగా చేయజాలవు. గురువు పరిమితమైన జ్ఞానము కలవాడు. గురువు యొక్క జ్ఞానము కేవలము జగత్తుకు మాత్రమే పరిమితమై యుండును. జగత్తు యొక్క అస్తిత్వము పూర్ణమయము, సత్యము కాదు. కావున గురువు యొక్క జ్ఞానము అసత్యమైనది. గురువు అనగా నరగురువు యొక్క జ్ఞానము గుడ్డి దీపమువలె యుండును. అది అంధకారమును పూర్తిగా పోగొట్టజాలదు. దాని సాయముతో చూచు వస్తువు కూడా పూర్తిగా స్పష్టముగా కనిపించదు. గురుత్వములో దైవత్వము చేరినపుడు అట్టివాడు గురుదేవుడగును. గురుదేవుడనగా నరరూపమున ఉన్న నారాయణుడు.
గురు శబ్దమునకు అర్థము అంధకారమును పోగొట్టు ప్రకాశము. ‘గు’ అనగా అంధకారము, ‘రు’ అనగా దానిని పోగొట్టునది. దేవుడు అనగా గొప్ప తేజస్సు. కావున గురువు అనగా మన ఇంటిలోని చీకటిని పోగొట్టు దీపము మాత్రమే. గురుదేవుడు అనగా అంధకారమును పోగొట్టు గొప్పతేజస్సు అనగా జగత్తులోని అంధకారమును పోగొట్టు సూర్యుడు అని అర్థము. కావున గురువు ఇంటిలోని దీపమువలె తన శిష్యుని అజ్ఞానమును మాత్రమే పోగొట్టగలడు. ఈ విధముగా నరుడగు గురువు శిష్యుల యొక్క అజ్ఞానాంధకారము పూర్తిగా పోగొట్టజాలడు. కాని నరరూపమున ఉన్న నారాయణుడగు గురుదేవులు జగత్తులో ఉన్న సమస్తజీవుల యొక్క అజ్ఞానాంధకారము పరిపూర్ణముగా పోగొట్టగలరు. గురువు యొక్క జ్ఞానము శ్రవణము చేయుటకు శిష్యులు ప్రయత్నము చేయవలసి వచ్చుచున్నది. గురువు జ్ఞానమును బోధించునపుడు సహజమైన ఆకర్షణ ఏర్పడదు కావున తమోగుణమయమైన నిద్ర వచ్చుచుండును. గుడ్డిదీపములో కాంతి తక్కువ యుండును. కావున తమోరూపమైన అంధకారము చుట్టుచుండును. రాత్రిపూట ఇంటిలో దీపము వెలుగుచున్ననూ జీవులకు నిద్ర వచ్చుచుండును. ఏలననగా గుడ్డిదీపము ఇంటిలో ఒక గదిలోనున్న చీకటిని మాత్రమే తొలగించగలదు. కాని ఇంటి చుట్టూ జగత్తులో అంధకారము వ్యాపించి యున్నది.
జగత్తులో ఉన్న అంధకారము పోగొట్టగల మహాతేజస్సు సూర్యుడు ప్రకాశించినపుడు ఇంటిలోని అంధకారమే కాక ఇంటి చుట్టూ ఉన్న అంధకారము పటాపంచలగును. అదే విధముగా పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీదత్తాత్రేయుడే నరరూపమున గురువుగా వచ్చినప్పుడు జగత్తులో ఉన్న సమస్తజీవులలోనున్న అజ్ఞానాంధకారమును పోగొట్టగలరు. అయితే అట్టి గురుదేవుని వాక్యములను శ్రవణము చేయుటకు మనము శ్రద్ధతో సమీపించినపుడు మాత్రమే మనలోనికి ఆ జ్ఞానము ప్రవేశించును. సూర్యుడు ప్రకాశించునపుడు ఇంటి తలుపులను కిటికీలను తెరిచినపుడు మాత్రమే సూర్యప్రకాశము లోనికి వచ్చును. తలుపులు కిటికీలను మూసినచో మన ఇంటిలో అంధకారమే యుండును. ఆ విధముగా శ్రద్ధతో, భక్తితో ప్రపన్నుడైనపుడే గురుదేవుని యొక్క జ్ఞానము చేత మనలోని అజ్ఞానము మాత్రమే కాక మన చుట్టునూ ఉన్నజగత్తులోని అజ్ఞానము నశించును. అర్జునుడు ఎంతో శ్రద్ధాభక్తులతో సాష్టాంగ నమస్కారము చేసి ప్రపన్నుడై నీకు శిష్యుడను నీకు ప్రపన్నుడైన నన్ను శాసించుము అని అర్థించినాడు. అప్పుడే కృష్ణభగవానుడు పార్థునికి గీతను ఉపదేశించినాడు.
ఆ గీత పార్థునిలోని అజ్ఞానమునే కాక జగత్తులోని సమస్తజీవుల అజ్ఞానమును పోగొట్టగలిగిన జ్ఞానసూర్యుడై యున్నది. కావున శ్రద్ధాభక్తులను విశ్వాసమును పరీక్షించియే గురుదేవులు జ్ఞానప్రకాశమును అందించును. భగవానుడు గీతలో శ్రద్ధలేని వారికి ఈ గీతను బోధించరాదని చెప్పినారు. మరియు ప్రణిపాతము అనగా సాష్టాంగ వందనము చేసి సేవలో వినయముతో ప్రశ్నించినపుడు జ్ఞానోపదేశమును చేయుదునని గీతలో చెప్పినాడు. ఇచ్చట జ్ఞానులు అనగా ఎవరు? ‘జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్’ అని జ్ఞాని అనగా తానే అని నిర్వచించినాడు. కావున జ్ఞానులు అనగా దత్తావతారము అనియే అర్థము. అంతే కాని నరగురువులు కారు. జీవుడు పరమాత్మను గురించి ఎప్పటికిని తెలియజాలడని గీతలో ‘మాం తు వేద న కశ్చన’ అని స్వామి అన్నారు. కావున పరమాత్మను గురించిన ఆధ్యాత్మిక జ్ఞానవిషయములో ఏ నరుడును గురువు కాజాలడు. శ్రుతి కూడా ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ అని అన్నప్పుడు – బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మము మాత్రమే, అనగా బ్రహ్మము గురించి బోధించువాడు గురురూపములో ఉన్న బ్రహ్మమే తప్ప గురురూపములో ఉన్న జీవుడు కాజాలడు అని అర్థము. బ్రహ్మము వాక్కులకు కాని, మనస్సుకు కాని, బుద్ధికి కాని, తర్కమునకు కాని అందదు అని ‘యతో వాచః, మనసా సః, న మేధయా, నైషా తర్కేణ’ అని శ్రుతులు ఘంటాపథముగా ఘోషించుచున్నవి. జీవుని యొక్క బుద్ధి తర్కమును దాటి పోజాలదు. పదిమంది బుద్ధిమంతులు ఒక చోట చేరగా వారి యొక్క బుద్ధులు కలసి చర్చించినదే తర్కము. అట్టి తర్కమునకు కూడా అందని బ్రహ్మము ఒక్క జీవుని బుద్ధికి ఎట్లు చిక్కును?
కావున జీవుడగు గురువు బోధించు జ్ఞానము తర్కమును దాటి పోలేదు. కావున జగత్తునకు పరిమితమై యుండును. జగత్తు అత్యల్పమైన సత్యము కావున దాదాపు లేనట్లే, అనగా అసత్యమే. అసత్యమైన జగత్తు యొక్క జ్ఞానము అసత్యమై పరిమితమై యుండును. కాని బ్రహ్మము యొక్క జ్ఞానము సత్యము, అనంతము అని ‘సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ’ అని శ్రుతి చెప్పుచున్నది. కావున నరుడు గురువైనపుడు మనము శ్రద్ధలేకున్ననూ మన వెంటబడి బోధించును. ఏలననగా అతడు మన నుండి ప్రతిఫలమును ఆశించును. కావున మనకు శ్రద్ధ లేకపోయిననూ అతడు ప్రవేశపెట్టిన జ్ఞానము మనలో ఎట్లుండును అనగా కిటికీలను తలుపులను బంధించిననూ ఇంటి లోపల బంధించిన గుడ్డిదీపము యొక్క కాంతివలె ఉండును. అట్టి గురువు బోధించిన జ్ఞానము కేవలము జగత్తునకు సంబంధించినది అయి మాత్రమే ఉండును. అనగా గణితశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జంతుశాస్త్రము, వృక్షశాస్త్రము మొదలగు లౌకికజ్ఞానములై యుండును. కాని ఈనాడు ఆధ్యాత్మిక జ్ఞానమును కూడా ‘ఫిలాసఫి’ అను ఒక పేరు క్రింద ఒక సబ్జక్టుగా భావించుచున్నారు. ఈ తర్కమును దాటిపోలేని నరులు గురువులుగా ఈ తర్కశాస్త్రమును బోధించుచుండగా అది వార్షికపరీక్షల (annual examination) కొరకు మాత్రమే నేర్చుకొనుచున్నారు.
Part-2
ఇచ్చట తత్త్వజ్ఞానము యొక్క సత్యమైన లక్ష్యము ఏ మాత్రము లేకుండెను. బ్రహ్మజ్ఞానము కూడా పొట్టపోసుకొను ఉపాధిగా దిగజారి ఉన్నది. బ్రహ్మజ్ఞానము కేవలము ఆత్మానందము కొరకును, ఆత్మ యొక్క మోక్షము కొరకును ఉద్దేశించబడినది. కావున లౌకిక జ్ఞానము కొరకు లౌకికజీవులను లక్ష్యముగా తీసుకొని శరీరయాత్రకే కావలసిన ధనమును సంపాదించవచ్చును. కాని ఆత్మజ్ఞానమగు బ్రహ్మవిద్యను అట్టి ఉపాధివిద్య (worldly education) గా లౌకికులగు (materialsitic people) జీవుల నుండి శ్రవణము చేసినపుడు అట్టివారి యొక్క ఉపన్యాసములు కేవలము గ్రంథపరమై అనుభూతిరహితమై (absence of experience) యుండును. కావున అవి కేవలము శుష్కతర్కము (dry logic) లై ఏ మాత్రము ఉపయోగమునకు రావు. ఫిలాసఫీలో Ph.D. తీసుకొను పెద్ద ప్రొఫెసర్ కాని లేక వేదాంతశాస్త్రములను, తర్క, వ్యాకరణములను మథించిన పండితుడు కాని పరమాత్మను గురించిన సత్యమైన జ్ఞానమును ఉపదేశించ జాలరు. శ్రీరామకృష్ణ పరమహంస వేదాంతశాస్త్రములో ప్రొఫెసర్ కాడు. పండితుడు కాడు కాని ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి వాక్యము కడిగిన ముత్యమువలె ఒక ఉపనిషత్తులవలె భాసించుచుండును. అయితే ఈనాడు అటు శాస్త్రజ్ఞానము లేక అనుభూతియు లేక కొందరు పామరులు పరమహంసవలె నటించుచున్నారు. పండితునివలె నటించుట కష్టము. ఏలననగా నోరు విప్పినచో బండారము (truth) బయిటపడును. అయితే, పరమహంసవలె పామరునిగా మాటలాడుట సులభము కాని వీరి మాటలు పరమహంస వాక్యములవలె ఆత్మానుభూతిని కలిగించుటలేదు.
ఈ రోజు కొందరు శిరిడీసాయివలె కాషాయ కఫినీలను ధరించి ఆయనవలె తలకట్టు కట్టుకొని బిచ్చములను యాచించుచూ పొట్టపోసుకుంటున్నారు. అందుకే ఆదిశంకరులు ‘ఉదరనిమిత్తం బహుకృతవేషః’ అన్నారు. అనగా పొట్టకూటి కొరకు ఎన్నో వేషములు వేయుచున్నారని అర్థము. మరికొందరు దైవత్వమును అల్పములగు సిద్ధులతో ముడిపెట్టుచున్నారు. కొందరు క్షుద్రవిద్యలను నేర్చుకొని అల్పసిద్ధులను సంపాదించి ప్రదర్శించి దైవత్వమును ప్రకటించుకొనుచున్నారు. సిద్ధులు దైవత్వమునకు గుర్తులు కావు. రావణుడు, హిరణ్యకశిపుడు సిద్ధులను ప్రదర్శించినారు. అల్పసిద్ధులు అహంకారమునకు దారితీసి తద్ద్వారా పతనమునకు దారితీయును. అష్టసిద్ధులను సాధించిన కార్తవీర్యుడు చివరకు స్వామి చేతిలోనే అంతమొందినాడు. ఇక అల్పసిద్ధులకు అల్పులగు మానవులు, ప్రదర్శించు వారును, చూచువారును ఉబ్బిపోవుచున్నారు.
తండుమహర్షి ఒకనాడు దర్భలను కోయుచుండగా గుప్పెడు విభూతి సృష్టించబడెను. దానికే ఆయన ఉబ్బిపోయి తనలో దైవత్వము ప్రకటితమైనదని భావించి తనే సృష్టికర్తనని భావించి ఆనందముతో గంతులు వేయసాగెను. అప్పుడు శంకరుడు సాక్షాత్కరించి ఈ గంతులకు కారణమేమి అని అడిగెను. తండు గంతులను ఆపి, ఈనాడు నేను ఈ విభూతిని సృష్టించితిని అని అరచినాడు. దానికి శంకరులు ఆశ్చర్యపడునట్లు నటించి తన చేతి బ్రోటనవ్రేలును క్రిందకు వంచినాడు. ఆ బొటనవ్రేలి నుండి విభూతి సృష్టించబడి ఒక పెద్ద పర్వతమువలె భూమి మీద పడినది. అపుడు శంకరుడు ఇట్లు వచించినాడు – తండు, గుప్పెడు విభూతిని సృష్టించినందుకే నీవు ఇన్ని గంతులను వేయుచున్నావే ఈ విభూతి కొండను సృష్టించిన నేను ఎన్ని గంతులు వేయవలెను? అని అనగా, అప్పుడు తండువునకు జ్ఞానోదయమై శంకరుని పాదములపై పడినాడు. కావున బ్రహ్మమును షోడశకళ్యాణ గుణములచేత గుర్తించవలెను. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి ‘జ్ఞానము’. అది సత్యమై అనంతమైన జ్ఞానము. శ్రవణమాత్రమున అప్రయత్నముగా హృదయములను ఆకర్షించి ఆత్మను ఆనందములో ముంచివేయగల బ్రహ్మానుభవములో ఆ జ్ఞానము కూడియుండును. జ్ఞానము ఆయన యొక్క స్వరూపము. ఇక రెండవ కళ్యాణగుణము ‘ప్రేమ’, దీనినే శ్రుతి ‘రసో వై సః’ అని చెప్పును. భగవద్గీత ద్వారా ప్రదర్శించబడిన స్వచ్ఛమైన అనంతమైన జ్ఞానముచేతను సర్వలోకముల పైన గోలోకము సృష్టించి ఇచ్చిన గోపికలపై చూపిన ప్రేమవల్లను శ్రీకృష్ణుని భగవంతునిగా ఈ ఋషులు (sages) నిర్ణయించినారు. ప్రేమ ఆయన యొక్క సౌందర్యము. ‘ప్రేమయే నా సహజ సత్య సౌందర్యము,
జ్ఞానమే నా సహజ సత్య స్వరూపము,
ఈ రెండెనను బట్ట గుర్తులిచ్చట,
నా అలంకారాలే ఈ అష్ట సిద్ధులు’.
అష్టసిద్ధులు ఆయన యొక్క అలంకారాలు మాత్రమే. సర్వజీవులు ఆయన బిడ్డలే కావున మూర్ఖులగు రాక్షసులు కూడా ఆయన బిడ్డలే. ఈ రాక్షసులు తపస్సుచేసి మొండిపట్టుదలతో ఆయన యొక్క అష్టసిద్ధులను ఇమ్మని యాచించుదురు. చేతి ఉంగరాలు ఇమ్మని పట్టువదలక బిడ్డ ఏడ్చుచున్నచో తండ్రి చేయునది లేక దానిని ఇచ్చివేయును. ఆ ఉంగరమును ధరించినంత మాత్రమున వాడు ఆ తండ్రియగునా? కావున దైవము నుండి సిద్ధులను పొందినంత మాత్రమున రాక్షసులు దైవము కాలేరు. ఏలననగా వారు ఆయన యొక్క స్వరూపమగు జ్ఞానమను సౌందర్యమును పొందజాలరు. ఒక వ్యక్తి నుండి శరీర సౌందర్యమును విడదీయలేరు. వ్యక్తియొక్క స్వరూప సౌందర్యములకు ఆ వ్యక్తి ధరించు ఉంగరము మొదలగు అలంకారములు గుర్తులు కావు. కాని అజ్ఞానులు ఈ అలంకారములనే గుర్తుగా తీసుకొందురు. కిరీటము (crown) మొదలగు అలంకారములను ధరించిన పగటి వేషగానిని, అజ్ఞానులగు బాలురు రాజుగా తలచెదరు.
అలంకారములను వదలి నార చీరెలను కట్టిననూ శ్రీరాముని సర్వసృష్టికే రాజైన భగవంతునిగా జ్ఞానులగు ఋషులు గుర్తించినారు. కావున ఈ కలియుగములో దైవము నుండి కొన్ని సిద్ధులను పొంది నరరూపములో ఉన్న రాక్షసులగు కొందరు క్షుద్రమాంత్రికులను దైవములుగా అజ్ఞానులు, అంధులగు జనులు భావించుచున్నారు. కొంత జ్ఞానము కలవారు కూడ ఆ సిద్ధుల (miraculous powers) ద్వారా తమ కష్టములను పోగొట్టుకొనుటకు వారిని దైవములుగా ఆరాధించుచున్నారు. కృతయుగమున మరియు త్రేతాయుగమున ఋషులు ఎక్కువగా ఉండెడివారు. ఆ ఋషుల వద్ద అష్టసిద్ధులునూ ఉండెడివి. కాని వారు ఈనాటి అల్పులవలె దైవత్వమును ప్రకటించుకొనక దైవము కొరకు అన్వేషించుచూ తపస్సులను చేయుచుండిరి. కావున శ్రీరాముడు సిద్ధులను ప్రదర్శించలేదు. కాని ద్వాపరాంతమున దాదాపు కలి లక్షణములు వచ్చినవి. కావున కృష్ణుడు కొన్ని సిద్ధులను ప్రదర్శించ వలసివచ్చెను. కలియుగములో దత్తావతారములు కూడ స్వల్పముగా కొన్ని ప్రదర్శించవలసి వచ్చెను. ద్వాపరయుగమున ఋషుల సంఖ్య బాగుగా తగ్గినది. కలియుగములో ఋషులు అసలు కనబడుటలేదు.
కావున గురుదేవునిగా పరమాత్మ అవతరించినపుడు జ్ఞానము, ప్రేమ మొదలగు కళ్యాణగుణములను ఆధారముగా చేసుకుని తమ ఆత్మలోపల ఆనందమే ప్రధానమైన గుర్తుగా తీసుకుని గుర్తించి సేవించిన వారు మాత్రమే తరించెదరు. కలియుగములో నకిలీరాళ్ళ సంఖ్య పెరిగినది. కావున వాటిలో కలసిపోయిన అసలు వజ్రమును గుర్తించుట చాలా కష్టమగుచున్నది. బ్రహ్మమును గుర్తించు జ్ఞానమే బ్రహ్మజ్ఞానము (divine knowledge). బ్రహ్మతత్త్వమును గురించిన జ్ఞానము లేదు. ఏలననగా బ్రహ్మతత్త్వమును గురించిన జ్ఞానము బుద్ధికిని, తర్కమునకును, ఊహకు సైతము అందనిది.
★ ★ ★ ★ ★